రైతుబంధు,బీమా పథకాల్లో అక్రమాల బాగోతం

రైతుబంధు పథకం అమలులో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి రైతుబంధు, రైతు బీమా నిధులను కైంకర్యం చేసిన నిందితులపై సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు.

Update: 2024-02-26 10:15 GMT
AVINASH MOHANTY IPS (Photo Credit : CYBERABAD METROPOLITAN POLICE)

తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా, రైతు బంధు పథకాల పేరిట కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించి నగదు కాజేశారు. రైతు మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేసిన కంత్రీగాళ్లు కొందరు ఈ నకిలీ పత్రాల ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదు బదిలీ చేయించుకున్నారు. తెలంగాణ ధరణి లో వచ్చిన డేటా చూసి ఎన్ఆర్ఐల వివరాలు తీసుకొని రూ.2కోట్ల నగదును స్వాహా చేశారని సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 20 మంది వ్యక్తులు రైతు బీమా పథకం కింద నగదు బదిలీ చేయించుకున్నారని దర్యాప్తులో బయటపడింది. కొందుర్గు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు బదిలీ చేసి దర్యాప్తు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.


రూ.2కోట్లు స్వాహా
రైతుబంధు, రైతు బీమా కుంభకోణంలో రూ.2కోట్ల మేర సర్కారు నిధులు స్వాహా చేశారని పోలీసులు చెప్పారు. 2019వ సంవత్సరం నుంచి ఇలా నకిలీ పత్రాలతో సర్కారు సొమ్మును కొల్లగొట్టారు. మోసగాళ్లు చనిపోయిన వారు బతికిఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు ఒక్కో రైతు పేరుతో రూ. 5 లక్షల నగదు ను స్వాహా చేశారు. సర్కారు సొమ్ము స్వాహా కేసులో వ్యవసాయ శాక ఏఈఓ అగ్రికల్చర్ క్లస్టర్ గోరేటి శ్రీశైలం , వీర స్వామిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. రెండు వేల మంది అమాయక రైతుల డేటా ను ఈ మోసగాళ్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.

పక్కదారి పట్టిన రైతు బంధు లక్ష్యం
వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించి, రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతోంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు 2018-19 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రవేశపెట్టిన వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం రైతు బంధు అక్రమార్కుల వల్ల అసలు లక్ష్యం నెరవేరడం లేదు.

గతంలోనూ వెలుగుచూసిన అక్రమాలు
గతంలో నల్గొండ జిల్లా లచ్చుగూడెం గ్రామంలోని 50ఎకరాల చెరువు భూమికి పట్టాలు పొంది ఎలాంటి సాగు చేయకుండానే 20 మంది రైతుల పేరిట రైతుబంధు పథకం కింద రూ.5లక్షల పెట్టుబడి సాయం పొందారు.చెరువులో ఉన్న భూమికి కూడా అధికారులు గుడ్డిగా రైతుబంధు ఇచ్చారు. సాగుకు యోగ్యమైన భూములకే రైతుబంధు సాయం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా, గుట్టలు, బీడుభూములు, వక్ఫ్ భూములు, లేఅవుట్లు, చెరువులకు కూడా రైతు బంధు సాయం అందించారు. దీంతో ఈ విషయం గతంలో వెలుగు చూడటంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రైతుబంధు పథకం ప్రక్షాళనకు సర్కారు సమాయత్తం
రైతు బంధు పథకంలో అమలులో అక్రమాలను అరికట్టి అర్హులైన సాగుచేసే రైతులకే ఈ పథకాన్ని వర్తింపచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ ఫథకం అమలు తీరుతెన్నులపై సర్కారు సమీక్షిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని సాక్షాత్తూ తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటీవల శాసనసభలో ప్రకటించారు.సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు, రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని మంత్రి ఆరోపించారు. ఈ పథకంలో త్వరలో మార్పులు చేర్పులు చేసి నిజమైన రైతులకు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటీవల ప్రకటించారు.


Tags:    

Similar News