మోదీ విద్వేష ప్రసంగంపై ఈసీకి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు
పీఎం నరేంద్రమోదీ అల్లాదుర్గంలో జరిగిన బహిరంగసభలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ,విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
By : The Federal
Update: 2024-05-01 03:46 GMT
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది.
- భారత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 16 వతేదీ నుంచి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు కచ్చితంగా పాటించాలని ఈసీ సూచించింది.
- మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రాజకీయ పార్టీలు, నాయకులు ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయకూడదు, మతాన్ని లేదా మతపరమైన స్థలాలను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించకూడదు.
- ఏ పార్టీ లేదా నాయకులు ప్రస్తుత విభేదాలను తీవ్రతరం చేసేలా లేదా పరస్పర ద్వేషాన్ని సృష్టించేలా లేదా వివిధ కులాలు వర్గాల మధ్య మతపరమైన లేదా భాషాపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యేలా వ్యాఖ్యలు చేయరాదని ఎన్నికల నియమావళి స్పష్టం చేస్తోంది. నేతలు వ్యక్తిగత జీవితంలోని అన్ని అంశాలకు సంబంధించిన విమర్శలకు దూరంగా ఉండాలి.
- కాని తెలంగాణలోని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ పైన పేర్కొన్న మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రధాని మోదీ విమర్శల దాడి చేశారు.
- మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడల్ కోడ్ ను ఉల్లంఘించినందున, ఆయనపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
నేను జీవించి ఉన్నంత వరకు ముస్లింలకు రిజ్వరేషన్లు కల్పించను : మోదీ
తాను జీవించి ఉన్నంత వరకు మతాల ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలో 2004 నుంచి 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ హయాంలో బీసీల రిజర్వేషన్లను రాత్రికి రాత్రే లాక్కోని, దాన్ని ముస్లింలకు ఇచ్చారని మోదీ ఆరోపించారు. నెహ్రూ కుటుంబంపై మోదీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. తనను తాను రాజ్యాంగ పరిరక్షకుడిగా చెప్పుకునే మోదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
మోదీపై చర్యలు తీసుకోండి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
ప్రధాని నరేంద్ర మోదీపై తాము గతంలో ఫిర్యాదు చేసినా, ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ నాయకులు నిరంజన్ ఆరోపించారు.అల్లాదుర్గంలో మోదీ ప్రసంగం ద్వేషంతో నిండి ఉందని ఆయన చెప్పారు. ప్రజల మధ్య మతపరమైన, కుల విభేదాలను సృష్టించే ఉద్ధేశంతోనే మోదీ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై మెదక్ జిల్లా ఎన్నికల అధికారి నుంచి వివరణాత్మక నివేదికను తెప్పించుకొని, ఆయనపై చర్య తీసుకోవాలని, లేకుంటే ఈ వ్యాఖ్యలు దేశంలో అరాచకానికి దారి తీస్తాయని ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు.
అసదుద్దీన్ ఒవైసీకి ఎన్నికల అధికారి నోటీసులు
వారణాసిలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై జిల్లా ఎన్నికల అధికారి తరపున అదనపు రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేశారు.యూసీసీతో బీజేపీ దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఒవైసీ ఆరోపించారు. ఏప్రిల్ 25వతేదీన జరిగిన సమావేశంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు కాశీ ప్రాంతానికి చెందిన బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ శశాంక్ శేఖర్ త్రిపాఠి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందినట్లు ధృవీకరిస్తూ అదనపు రిటర్నింగ్ అధికారి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నీరజ్ పటేల్ ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఒవైసీకి నోటీసులిచ్చారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముఖ్తార్ అన్సారీ మరణానికి సంబంధించిన వాదనలతో సహా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.