రిటైర్డ్ ఆఫీసర్ల జీతాలకే రూ.1800 కోట్లా! తెలంగాణ చెల్లిస్తున్న డబ్బు!
తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1,049 మంది రిటైర్డ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు నివేదికల ద్వారా తేలింది.
తెలంగాణ ప్రభుత్వంలో ఇకపై రిటైర్డ్ అధికారుల సేవలకు కాలం చెల్లినట్టేనా..? ఇక నుంచి పదవీ విరమణ చేసిన అధికారులకు సర్కార్‌లో పనిచేసే చాన్స్ లేనట్టేనా..? అంటే అవునే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వం రిటైర్డ్ అధికారులను నియమించుకోవడంలో ప్రధాన ఉద్దేశం వాళ్ల అనుభవం, సేవలు, చిత్తశుద్ధి, విదేయత. ఆ విధేయత శృతి మించినప్పుడు, కొత్త వారికి చాన్స్ రానప్పుడు వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. ఆ విషయాన్ని పసిగట్టే తెలంగాణ సర్కార్ ప్రక్షాళనకు నడుం కట్టింది.
“పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారుల సేవలను గౌరవప్రదంగా ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. అయితే ఎంతకాలమన్నదే ప్రశ్న. ఇలా నియమించే దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. తాజాగా 2020లో కూడా ఇచ్చారు. వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు రిటైర్ అయిన వారిని నియమించుకోవచ్చు. నైపుణ్యం కలిగిన వారు లేనప్పుడో, కొరత ఉన్నప్పుడో, కొత్త వారు రానప్పుడో.. రిటైర్ అయ్యే అధికారుల సర్వీస్ పొడిగింపు, రీ పోస్టింగ్, కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవచ్చు. ప్రస్తుత యుగం బహుళ విభాగం. జ్ఞానం అపారం, నిర్వహణ, సాంకేతిక రంగాలలో నైపుణ్యాలు పెరిగినప్పుడు, కొత్త తరం వెల్లువలా వస్తున్నప్పుడు పాత వారినే అట్టిపెట్టుకోవడం సబబు కాదు“ అన్నారు మాజీ ఐఎఎస్ అధికారి ఇ.వి.ఎస్. శర్మ. బహుశా ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణకు నడుంకట్టి ఉంటుంది. నిజంగానే ఎవరైనా అధికారి తన అనుభవాన్ని పంచాలనుకున్నప్పుడు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. సమాజాభివృద్ధికి తోడ్పడవచ్చు. అయితే “అంతటి ఔదార్యాన్ని ఆశించడం దురాశే అవుతుంది. రిటైర్ అయిన ఐఎఎస్, ఐపీఎస్ లలో ఏ కొద్దిమందో తప్ప ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. వ్యవస్థలో ఎక్కడి నుంచి నిధులు వస్తాయో కూడా వారికి తెలుసు. అందువల్ల ఉచిత సేవల్ని ఆశించలేం“ అన్నారు సామాజిక కార్యకర్త డాక్టర్ డి.నరసింహారెడ్డి. ప్రజల సామాజిక-ఆర్థిక సంక్షేమానికి కట్టుబడిన స్వచ్ఛంద సంస్థలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాలలోనూ ఆయన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆయన చెప్పిన మాట ప్రకారం పాలనపరమైన సంస్కరణలు చేపట్టందే కొత్త తరానికి ఉపాధి లభించడం కష్టం. అందుకే ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంస్కరణలను స్వాగతించారు.
రిటైర్డ్ అధికారుల లెక్కలు తేలుస్తున్న సర్కార్...
తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లెక్క తేలడంతో.. త్వరలోనే వారందరికి ఉద్యాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. ఇక నుంచి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప... రిటైరైన అధికారులను విధుల్లోకి తీసుకోవద్దన్న నిర్ణయంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది.
తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో రిటైరైన అధికారులు రీ అపాయింట్‌మెంట్, ఎక్స్‌టెన్షన్ పేరుతో ఇంకా విధులు నిర్వహిస్తున్న వారి లెక్క తేలింది. సీఎస్ శాంతి కుమారి ఆదేశంతో... ఆయా శాఖల కార్యదర్శులు నివేదికలు సమర్పించారు.
విధుల్లో 1,049 మంది రిటైర్డ్ అధికారులు...
తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1,049 మంది రిటైర్డ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు నివేదికల ద్వారా తేలింది. ఈ నివేదికను సీఎస్ శాంతి కుమారి విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. రిటైరైన అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్‌లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు తెలంగాణలో మున్సిపల్ శాఖలోనే అత్యధికంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌరసరఫరాల శాఖలో 75 మంది, రోడ్లు భవనాల శాఖలో 81 మంది, ఇరిగేషన్ శాఖలో 70 మంది, పంచాయతీరాజ్‌లో 48 రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్టు లెక్క తేలింది. వీరంతా రిటైర్ అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు కన్సలెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగుతున్నారు.
ఆర్డర్లు ఇలా ఇవ్వొచ్చా...
గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు చాలా సంవత్సరాల క్రితమే రిటైర్ అయినప్పటికీ వారిని తిరిగి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది కేసీఆర్ సర్కార్. వీరిలో చాలా మంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని ఉత్తర్వులు ఇచ్చారు. రిటైరైన అధికారుల్లో ఐదుగురు ఐఏఎస్‌లు సైతం ఉన్నారు. సెక్రటేరియేట్‌లో ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న అర్విందర్ సింగ్, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్, పశుసంవర్ధక శాఖలో స్పెషల్ సీఎస్‌గా అధర్ సిన్హా, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సీఎస్‌గా రాణి కుముదిని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉమర్ జలీల్ ఉన్నారు. ఇలా రిటైర్డ్ అయిన అధికారులకు లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్, ఆఫీసు, అదనపు సిబ్బంది ఇలా అన్ని సౌకర్యాలు కేటాయించడంతో సర్కారుపై కోట్ల రూపాయల భారం పడింది.
జీతభత్యాలకే ఏటా రూ.1800 కోట్లు...
పదవీ విరమణ చేసిన అధికారులకు జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఏడాదికి 1,800 కోట్లు చెల్లిస్తూ వస్తోంది. అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి ఉన్న ఈ పదేళ్లలో రిటైర్డైన అధికారుల జీతభత్యాల కోసం సుమారు 13 వేల కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం వీరి భవితవ్యంపై కసరత్తు చేస్తున్నారు. తొలగింపుపై త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రిటైర్డ్ అధికారులు ప్రభుత్వాల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంటారని భావిస్తుంటాయి. ప్రభుత్వ కార్యనిర్వాహకుని పక్షాన ఒక అసైన్‌మెంట్‌లో అటువంటి కొనసాగింపును కోరుకునే ధోరణి పెరిగితే ప్రమాదం. ఈ ధోరణి కొన్నిసార్లు అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది.