హైదరాబాద్ హెల్త్ టూరిజం పై అందాల భామల ఆసక్తి

72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు శుక్రవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. రోగులను పరామర్శించారు.;

Update: 2025-05-16 10:02 GMT
ఏఐజీ ఆసుపత్రిలో మిస్ వరల్డ్ పోటీదారుల సందడి

హైదరాబాద్ నగరంలో వైద్యపర్యాటక రంగం విశిష్ఠత గురించి ప్రపంచం దృష్టికి వెళ్లింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ అందాల భామలు శుక్రవారం ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి రోగులను కలిశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వైద్య పర్యాటక కార్యక్రమంలో మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొన్నారు.




 ఈ కార్యక్రమంలో ఆఫ్రికా గ్రూప్ నుంచి 25 మంది పోటీదారులు, గ్వాడెలూప్, టర్కీ, వేల్స్, బోస్నియా, ప్యూర్టో రికో, బెల్జియం, గ్వాటెమాల, లెబనాన్, మలేషియా, పోలాండ్, ఫ్రాన్స్, ఉత్తర ఐర్లాండ్, గయానా, మాల్టా వంటి ఇతర సమూహాల నుంచి వైద్యులు, మనస్తత్వవేత్తలైన అందాలభామలు పాల్గొన్నారు వీరికి సాంప్రదాయ దుస్తులు ధరించిన తెలంగాణ యువతులు గులాబీ రేకులను చల్లుతూ, ప్రత్యక్ష షెహనాయ్ ప్రదర్శనతో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.




 రోగులకు అందాలభామల బహుమతులు

అందాల భామలు తమ కటౌట్‌లతో పాటు ఫోటోలకు పోజులిచ్చారు. కటౌట్ లపై అందాలభామలు సంతకాలు చేశారు. ప్రపంచ సుందరీమణులు రోగులకు బహుమతులు ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎండోస్కోపీ సూట్‌లు, ఏఐ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, కీమో వార్డ్, పరిశోధనా కేంద్రం, స్కిల్ ల్యాబ్‌లు, పీడియాట్రిక్ వార్డులను సుందరీమణులు సందర్శించారు, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ సుజన ప్రియ, డాక్టర్ జి.వి. రావు, డాక్టర్ లక్ష్మి లు రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అందాలభామలకు వివరించి చెప్పారు.



 అందాలభామలకు సత్కారం

మిస్ వరల్డ్ పోటీదారులకు ఏఐజీ ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి సత్కరించారు.కేన్సర్ నివారణ, మహిళల ఆరోగ్య కార్యక్రమాలు, తెలంగాణ ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు వివరించి చెప్పారు.



 ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైద్య పర్యాటకం

ప్రపంచ స్థాయి వైద్యం, మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతతో తెలంగాణ వేగంగా వైద్య నైపుణ్యానికి నిలయంగా మారుతోందని డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి చెప్పారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను ఇక్కడ నిర్వహించడం వల్ల హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ పురోగతిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. వైద్య పర్యాటకులకు ప్రముఖ గమ్యస్థానంగా నగరం పాత్ర గురించి అందాలభామలకు వివరించి చెప్పారు.



 మిస్ వరల్డ్ పోటీదారుల రాకతో హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణపై అంతర్జాతీయ దృష్టి ఏర్పడుతుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ చెప్పారు. హైదరాబాద్ వైద్య పర్యాటక రంగం వృద్ధి సాధించింది, గత దశాబ్దంలో విదేశీ రోగుల రాకపోకలు రెట్టింపు అయ్యాయి. 2014వ సంవత్సరంలో కేవలం 75,000 మంది విదేశీ రోగులు ఉండగా, 2024లో తెలంగాణ 1.55 లక్షల మంది అంతర్జాతీయ వైద్య పర్యాటకులను ఆకర్షించింది. దేశీయంగా గత ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి 8.82 కోట్ల మంది రోగులు తెలంగాణలో వైద్య చికిత్సలు పొందారు.



Tags:    

Similar News