పద్మశాలీలకు బీజేపీ గాలమేస్తోందా ?

పద్మశాలి సామాజికవర్గం ఓటుబ్యాంకు పైన బీజేపీ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు సమాచారం. పద్మశాలీలపైనే బీజేపీ ఎందుకు ఎక్కువగా దృష్టిపెట్టింది ?

Update: 2024-04-28 07:57 GMT
BJP

తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పది సీట్లన్నా గెలవాలన్నది బీజేపీ టార్గెట్. మరన్ని సీట్లు గెలుచుకునేంత సీన్ ఆ పార్టీకుందా అన్నదే అసలు ప్రశ్న. అంతసీన్ ఉన్నా లేకపోయినా ప్రయత్నమైతే తప్పదు కదా. అందుకనే అందుబాటులో ఉన్న అనేక మార్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలంపార్టీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్రమోడి ఇమేజిని బాగా ప్రొజెక్టు చేయటం ఒకటైతే అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని హైలైట్ చేసుకోవటం మరో మార్గం. దీనికి అదనంగా అనుసరిస్తున్న మూడో మార్గం ఏమిటంటే పద్మశాలీలను అకట్టుకునే ప్రయత్నాలు చేయటం. పద్మశాలి సామాజికవర్గం ఓటుబ్యాంకు పైన బీజేపీ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు సమాచారం. పద్మశాలీలపైనే బీజేపీ ఎందుకు ఎక్కువగా దృష్టిపెట్టింది ?

ఎందుకంటే తెలంగాణాలో జనాభారీత్యా ప్రాధాన్యత ఉన్న ఐదు బీసీ సామాజికవర్గాల్లో పద్మశాలి సామాజికవర్గం కూడా ఒకటి. పైగా మిగిలిన నాలుగింటితో పోల్చితే తాము ఆర్ధికంగా, రాజకీయంగా వెనకబడిపోయామనే బాధ వీళ్ళల్లో ఎక్కువగా ఉందట. మిగిలిన నాలుగు సామాజికవర్గాలైన గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, మున్నూరుకాపులతో పోల్చుకున్నపుడు తాము బాగా వెనకబడిపోయున్నామనే భావన పద్మశాలీల్లో బాగా పెరిగిపోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎక్కువగా పై నాలుగు సామాజికవర్గాలకే బాగా ప్రాధాన్యత ఇస్తు తమను చిన్నచూపు చూస్తున్నాయని పద్మశాలీలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో అదునుచూసుకుని పద్మశాలీల మద్దతుకోసం గాలమేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో బీజేపీ తరపున శ్రావణి(పద్మశాలి) పోటీచేసి ఓడిపోయారు.

 

రాబోయే ఎన్నికల్లో గుండుగుత్తగా తమకు మద్దతిస్తే పద్మశాలీలకు వీలైనంత లబ్ది చేకూరుస్తామని బీజేపీ నేతలు హామీలిస్తున్నారట. హామీలిచ్చి ఊరుకోకుండా అయోధ్యలో నిర్మించిన రామాలయం, ఆదిపురుషుడు, భూధాన్ పోచంపల్లిలోని మార్కండేయ మహర్షి ఆలయాన్ని డెవలప్ చేయటానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారట. పోచంపల్లిలో ప్రతి ఏడాది మార్కండేయ మహర్షి పేరుతో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని అందరికీ తెలిసిందే. అలాగే సాంస్కృతికంగా, పురాణాల పరంగా కూడా పద్మశాలీ సామాజికవర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాగంటే తిరుమలలో వెలసిన వెంకటేశ్వరస్వామి రెండవ భార్య పద్మావతిది కూడా పద్మశాలి సామాజికవర్గమే అని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వరస్వామి తర్వాత అవతారమే శ్రీరామచంద్రుడని చెబుతున్నారట. అలాంటి శ్రీరాముడికి అయోధ్యలో గుడికట్టిన తమ పార్టీకి మద్దతుగా నిలబడమని కమలంపార్టీ నేతలు పద్మశాలి సామాజికవర్గాన్ని సెంటిమెంటుతో కొడుతున్నారట.

 

ఇదే విషయాన్ని తెలంగాణా ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపర్ధపు మురళి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు తమ సామాజికవర్గం ఓట్లకోసం బీజేపీ ప్రయత్నిస్తున్నది వాస్తవమే అన్నారు. తమ ఓట్లు ఎక్కువగా భువనగిరి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మల్కాజ్ గిరి, నల్గొండ, నాగర్ కర్నూలు, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నదని చెప్పారు. బీసీల్లో ఎక్కువగా గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, మున్నూరుకాపులకే ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పై నాలుగు సామాజికవర్గాలతో పోల్చితే పద్మశాలీలు వెనకబడిన మాట వాస్తవమే అన్నారు. ఓట్ల విషయంలో తమను మిగిలిన నాలుగు సామాజికవర్గాలతో సమానంగా చూస్తున్న పార్టీలు పదవులు, టికెట్ల దగ్గరకు వచ్చేటప్పటికి తమను చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు.

 

ప్రస్తుత ఎన్నికల్లో తమ సామాజికవర్గం ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు మురళి చెప్పారు. ఎందుకంటే చేనేతలకు బీఆర్ఎస్ బకాయిపెట్టిన సుమారు రు. 250 కోట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రు. 50 కోట్లు విడుదలచేసిందన్నారు. మరో రు. 50 కోట్ల బకాయిలు తీర్చటానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. ఇదే సమయంలో వివిధ కారణాలతో సామాజికవర్గంలోని కొందరు బీజేపీ వైపు కూడా మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. బీజేపీలో చేరితే రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని మురళి అన్నారు. బీసీల్లో వెనకబడిన, అణిచివేతకు గురవుతున్న పద్మశాలీలను ఆకర్షించేందుకు కమలంపార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నది నిజమే అన్నారు.

 

బీసీల్లోని మిగిలిన సామాజికవర్గాలతో పోల్చుకుంటే పద్మశాలీల్లో దేవుడు, భక్తి, పూజలు చాలా ఎక్కువన్నారు. దీన్ని అడ్డంపెట్టుకునే తమ సామాజికవర్గం మద్దతుకోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పద్మశాలీలను ఆకర్షించేందుకు ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు మంత్రి శ్రీనివాస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు మురళి చెప్పారు. తాజా పరిస్ధితులను చూస్తుంటే పద్మశాలి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ఒకవైపు రాజకీయంగాను మరోవైపు సాంస్కృతిక, పురాణ నేపధ్యాన్ని కూడా సెంటిమెంటుగా ప్రయోగిస్తోందని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News