తెలంగాణ కాంగ్రెస్‌లో ‘మహిళ’ చిచ్చు..!
పార్టీ కోసం కష్టపడే వారికి కాంగ్రెస్ మొండిచేయి చూపుతోందన్న కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు.;
‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం’ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ మహిళా నేతలనే పట్టించుకోవడం లేదా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు మాట కూడా ఇదే. పార్టీ కోసం కష్టపడిన వారి కోసం కాకుండా అయినవారికి, కావాల్సిన వారికి మాత్రమే పదవులను కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీలో పదవులు ఉన్నప్పటికీ వాటిలో మహిళలకు ప్రాధాన్యత ఉండటం లేదని, ఒకవేళ ఉన్నా వాటిని చెల్లెళ్లు, మరదల్లకు కట్టబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై గాంధీభవన్‌లోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట సునీతారావు, పలువురు మహిళా నేతలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ కుమార్ గౌడ్ తన చెల్లెళ్లు, మరదళ్లకు మాత్రమే పదవులు ఇచ్చుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతోంది’’ అని సంచలన ఆరోపణలు చేశారు.
పార్టీలోని పరిస్థితులపై సునీతారావు గురువారం మరోసారి ఘాటుగా స్పందించారు. ‘‘నన్ను నమ్మిన వాళ్లకి ఆలస్యమైనా పదవులు దక్కుతాయి. అందుకు అద్దంకి దయాకరే ఉదాహరణ. ప్రతి ఒక్కరినీ న్యాయం చేస్తా’’ అన్న రేవంత్ రెడ్డి మాటలను ఉత్తిత్తి మాటలే అని నిరూపించారు. పార్టీ కోసం కష్టపడే వారికి కాంగ్రెస్ మొండిచేయి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు, సహకరించడం లేదని, మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో తనను టార్గెట్ చేస్తున్నారని సునీతారావు ఆరోపించారు. ముందుగా మహిళలు 30 మందికి పదవులు ఇస్తామన్నారని, కానీ ఇప్పుడు ఇద్దరితో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఆ తర్వాత ఏం చేయాలో తనకు ఒక క్లారిటీ ఉందని ఆమె పేర్కొన్నారు.
మీనాక్షి నటరాజన్ చెప్పాలి..
‘‘పదవుల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ ఇద్దరూ కూడా స్పష్టత ఇవ్వట్లేదు. సీఎం రేవంత్‌ను అడిగితే పీసీసీని అడిగి పదవులు తీసుకోవాలని అంటున్నారు. పీసీసీని అడిగితేనేమో సీఎం రేవంత్‌తో మాట్లాడాలి, ఏ పదవి గురించి అయినా ఆయనను అడగాలి అంటున్నారు. మరి ఇక్కడ పదవులు మాకు ఎవరు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. వీటిని సీఎం ఇస్తారా, పీసీసీ ఇస్తారా అనేది పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పాలి. అందుకోసమే ఆమెతో మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారామే.
కండవాలు మారిస్తే పదవులా..!
పార్టీ కోసం కష్టపడిన వారి కన్నా కండవాలు మార్చిన వారికే పదవులు ఇస్తున్నారని సునీతారావు ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని చూపారు. కాంగ్రెస్ పార్టీ కోసం విజయశాంతి ఏం చేసింది? ఎప్పుడైనా జెండా పట్టి ర్యాలీ చేసిందా? పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించిందా? కానీ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు? అని సునీతారావు ప్రశ్నించారు. అదే విధంగా పార్టీ పదవులు ఉంటే, ప్రభుత్వంలో ఉండవు. ప్రభుత్వంలో ఉంటే పార్టీలో పదవులు ఉండవన్న.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఎమ్మెల్సీగా, పీసీసీ చీఫ్‌గా ఎలా ఉంటున్నారన్న ప్రశ్న కూడా కాంగ్రెస్ మహిళా నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది.