కామారెడ్డి జెయింట్ కిల్లర్ మ్యాజిక్ పనిచేస్తుందా?

ఇపుడందరి కళ్ళు రెడ్డిగారి మీదే ఉన్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెడ్డిగారు తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా ?

Update: 2024-04-01 10:12 GMT
Kamareddy MLA venkata ramanareddy source face book

ఇపుడందరి కళ్ళు రెడ్డిగారి మీదే ఉన్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెడ్డిగారు తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా ? చేస్తే ఏ స్ధాయిలో చేయగలరు అనే చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలోని మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కొన్నిమాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి కొన్ని నియోజకవర్గాల్లో జహీరాబాద్ నియోజకవర్గం కూడా ఒకటి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం భౌగోళికంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చాలా దగ్గరలో ఉంటుంది. అందుకనే ఇక్కడ షెత్కార్లు, లింగాయతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకపుడు తెలంగాణా స్టేట్ లో ఇప్పటి మహారాష్ట్ర, కర్నాటక అంతర్భాగంగా ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పుడు తెలంగాణా స్టేట్ నుండి విడిపోయిన ప్రాంతాలు మహారాష్ట్ర, కర్నాటకగా ఏర్పడ్డాయి.

భౌగోళికంగా మహారాష్ట్రలో షేత్కార్లు, కర్నాటకలో లింగాయుతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మహారాష్ట్ర, కర్నాటకలు ఏర్పడినా పై సామాజికవర్గాల జనాలు మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఉండిపోయి పై రాష్ట్రాలతో సంబంధాలు కంటిన్యు చేస్తున్నారు. కాబట్టే నిజామాబాద్ జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో పై రెండు సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ తరపున సురేష్ కుమార్ షేత్కార్, బీజేపీ అభ్యర్ధి బీబీ పాటిల్ ఇద్దరూ లింగాయతులే. బీఆర్ఎస్ అభ్యర్ధి అనీల్ కుమార్ మున్నూరుకాపు. పై సామాజికవర్గాలు కాకుండా ముస్లింల ఓట్లు సుమారు 3.5 లక్షలుంటుంది. వీళ్ళు కాకుండా ఎస్సీ, బీసీ, ఓసీ సామాజికవర్గాలు ఉండనే ఉన్నాయి. మొత్తం ఓటర్లు సుమారు 17 లక్షలు.

కాంగ్రెస్ కు ఎంత అడ్వాంటేజ్ ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో కాంగ్రెస్ నాలుగు చోట్ల, బీఆర్ఎస్ రెండు నియోజకవర్గాల్లోను, బీజేపీ ఒక నియోజకవర్గంలో గెలిచింది. బీజేపీ గెలిచిన ఒక్క నియోజకవర్గమే కామారెడ్డి. ఈ కామారెడ్డిలో గెలిచిందే కే. వెంకటరమణారెడ్డి. కామారెడ్డిలో గెలిచారు కాబట్టే రమణారెడ్డిని జెయింట్ కిల్లరంటున్నారు. ఎందుకంటే తనకు ప్రత్యర్ధులుగా పోటీచేసిన కేసీయార్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించారు. నియోజకవర్గంలోని 2.45 లక్షల ఓట్లలో వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు, కేసీయార్ కు 59,911, రేవంత్ కు 54,916 ఓట్లొచ్చాయి. వన్ టు వన్ కేసీయార్-రమణారెడ్డి మధ్యే ఫోటీ జరిగుంటే ఫలితం ఎలాగుండేదో. పోటీ కేసీయార్-రమణారెడ్డి-రేవంత్ మధ్య ట్రయాంగిల్ అవటంతో రమణారెడ్డికి అడ్వాంటేజ్ అనుకున్నారు. అనుకున్నట్లే రమణారెడ్డి సుమారు 6 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు.

ఒక ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించారు కాబట్టే రమణారెడ్డిని అందరు జెయింట్ కిల్లరంటున్నారు. అయితే అదే ఇమేజి రేపటి పార్లమెంటు ఎన్నికల్లో రెడ్డిగారు నిలుపుకోగలరా ? బీజేపీ అభ్యర్ధి పాటిల్ ను తన మ్యాజిక్ తో గెలిపించగలరా ? అనే చర్చలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రమణారెడ్డికి బాగా కలిసొచ్చిన అంశం ఏమిటంటే లోకల్, నాన్ లోకల్ అంశం. రమణారెడ్డి లోకల్, కేసీయార్, రేవంత్ నాన్ లోకల్స్ కావటంతో లోకల్ ఫీలింగ్ జనాల్లో బాగా పనిచేసింది. జెయింట్ కిల్లర్ కాబట్టే రమణారెడ్డికి బీజేపీ నాయకత్వం జహీరాబాద్ పార్లమెంటు సీటును గెలిపించే బాధ్యతను పెట్టింది. అందుకనే రెడ్డిగారు ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్ధి గెలుపుకు బాగా కష్టపడుతున్నారు.

బీసీ ఓటర్లే కీలకమా ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాటిల్ మీద నియోజకవర్గంలో వ్యతిరేకతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున రెండుసార్లు వరుసగా గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీచేయలేదని. అయితే పాటిల్ ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ కూడా ఆర్ధికంగా గట్టి నేతే కాకుండా జనాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఊపు రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యు అయి గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.

ఇదే విషయమై రిపోర్టర్ సంజీవ్ మాట్లాడుతు కాంగ్రెస్, బీజేపీ మధ్యే గట్టిపోటీ ఉంటుందన్నారు. పాటిల్ అభ్యర్ధి కావటంతో బీజేపీకి బాగా కలిసొస్తుందని అందరు అనుకోవటం తప్పన్నారు. పాటిల్ మీద జనాల్లో వ్యతిరేకత పార్టీకి మైనస్ అని సంజీవ్ అబిప్రాయపడ్డారు. అయితే బీజేపీ తరపున పోటీచేయగల గట్టి అభ్యర్ధి కూడా వేరే వాళ్ళు లేరన్నారు. ఏడు అసెంబ్లీల్లో నాలుగుచోట్ల కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఉండటం సురేష్ కు బాగా కలిసొచ్చే అంశమన్నారు.

అలాగే స్ధానిక రాజకీయ విశ్లేషకుడు జావేద్ ఆలి మాట్లాడుతు నియోజకవర్గంలో 3.5 లక్షల ముస్లింల ఓట్లు కీలకమన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లో ఉన్న బీబీ పాటిల్ ను బీజేపీ కామారెడ్డి అభ్యర్ధి రమణారెడ్డి తిట్టిన తిట్టకుండా తిట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది అదే రమణారెడ్డి ఇపుడు అదే పాటిల్ కు ఓట్లేసి గెలిపించమని అడుగుతున్నారని చెప్పారు. పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు.

ఫైనల్ గా నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతు నిజామాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్ధితి బాగుందన్నారు. జహీరాబాద్ లో షెత్కార్లు, లింగాయతుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. జహీరాబాద్ బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి ఎంఎల్ఏ వెంకటరమణారెడ్డిని కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తే కుదరలేదు.

Tags:    

Similar News