బీఆర్ఎస్ లో కవిత పరిస్ధితి ఏమిటి ?

తీన్మార్ చేసిన వ్యాఖ్యలకన్నా పార్టీస్పందన విషయమే కవితను ఎక్కువగా కలవరపెడుతున్నదా అన్న సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి;

Update: 2025-07-16 07:18 GMT
Kalvakuntla Kavitha

బీఆర్ఎస్ తో కల్వకుంట్ల కవిత బంధం తెగిపోయినట్లేనా ? చాలామందిలో ఇపుడు ఇదే అనుమానం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ పార్టీ తనది అని కవిత చెప్పుకోవటమే తప్ప పార్టీనుండి సానుకూలంగా ఎలాంటి స్పందన కనబడటంలేదు. అధినేత తనయ అనే ట్యాగ్ తో ఇంతకాలం నెట్టుకొస్తున్నది. తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే కవిత(Kavitha)కు పార్టీ అధినేత కేసీఆర్KCR), వర్కింగ్ ప్రెసిడెంట్, సోదరుడు కేటీఆర్(KTR) మానసికంగా దూరమైపోయినట్లు అర్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయాలని డిసైడ్ చేసింది. ఆర్డినెన్స్ జారీ చేయాలన్న నిరణయం తమ ఒత్తిడి ఫలితమే అని కవిత క్రెడిట్ క్లైమ్ చేసుకోవటానికి ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే కవితను ఉద్దేశించి కాంగ్రెస్ సస్పెండెడ్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ తో పాటు పార్టీలోని నేతలెవరూ ఖండించలేదు. అంటే కవితకు బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధంలేదని సంకేతాలు ఇచ్చినట్లేనా అనే ప్రచారం పెరిగిపోతోంది.

పార్టీ అధినేత కేసీఆర్ కూతురు అన్న ట్యాగ్ కవితకు తెగిపోయిందా అన్న సందేహం ఎందుకు వచ్చిందంటే ఇంతకాలం ఆ ట్యాగ్ తోనే నెట్టుకొస్తున్నారు. అమెరికా టూరుకు వెళ్ళిన దగ్గరనుండి కవితకు సమస్యలు మొదలయ్యాయి. అంతకుముందు సోదరుడు కేటీఆర్ తో ఎంతకాలంగా కవితకు వివాదాలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. అమెరికా టూరులో ఉండగా కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ అవటం పార్టీలో సంచలనంగా మారింది. అన్నా-చెల్లెళ్ళ మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందన్న విషయం అప్పుడే బహిర్గతమైంది. అప్పటికే ఇద్దరిమధ్య గొడవలున్నా కేసీఆర్ కూతురు హోదాలో కవిత పార్టీలో చెలాయించుకుని వస్తోంది. ఏకార్యక్రమంలో పాల్గొన్నా పార్టీ నేతలు, క్యాడర్ మద్దతుగా నిలబడేవారు. ఎప్పుడైతే గొడవలు బయటపడ్డాయా అప్పటినుండి కవితకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ తో నేతలకు మాట్లాడే అవకాశాలు దాదాపు లేవు. ఇక అందరికీ అందుబాటులో ఉండేది కేటీఆర్ మాత్రమే. అన్నా, చెల్లెళ్ళ మధ్య గొడవలు బయటపడిన తర్వాత కేటీఆర్ ఆలోచనలకు భిన్నంగా కవితతో మాట్లాడేందుకు నేతలు సాహసించలేదు.

ఇదేసమయంలో కవితకు మద్దతు ఇవ్వకూడదనే పరోక్షసంకేతాలు నేతలకు అందినట్లు పార్టీవర్గాల సమాచారం. అప్పటినుండి పార్టీలో కవిత ఒంటరైపోయారు. అందుకనే వేరుకుంపటి పెట్టుకునేందుకు వీలుగ జగృతి సంస్ధను బలోపేతం చేయటంలో కవిత బిజీ అయిపోయారు. సరిగ్గాఈ సమయంలోనే బీసీ రిజర్వేషన్ల(BC Reservations) ఆర్డినెన్స్ కు సంబంధించి కవితపై తీన్మార్ మల్లన్న తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ వ్యాఖ్యలను వ్యతిరేకించేవారు ఉన్నట్లే మద్దతుగా మాట్లడేవారు కూడా ఉన్నారు. హోలు మొత్తంమీద తీన్మార్ కవితపై ప్రయోగించిన కంచం..మంచంపొత్తు అన్న సామెత జనాల్లోకి నెగిటివ్ గానే వెళ్ళింది. దాంతో జాగృతి నేతలు, క్యాడర్ తీన్మార్ ఆఫీసుపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు. దాంతో అసలు విషయం పక్కదారిపట్టి కొసరు విషయంపైనే రాజకీయంగా మంటలు మొదలయ్యయి.

కవితను ఉద్దేశించి తీన్మార్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజంలోని కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. కొందరేమో తీన్మార్ వ్యాఖ్యలతో పాటు జాగృతి దాడిని కూడా తప్పుపట్టారు. ఎంఎల్సీలు ఇద్దరి మధ్యా ఆరోపణలు, ప్రత్యరోపణలు ఎలాగున్నా పార్టీ తరపున ఒక్కరంటే ఒక్కనేత కూడా కవితకు మద్దతుగా మాట్లాడలేదు. బీఆర్ఎస్ నుండి మద్దతు దొరకకపోవటంతో పార్టీ కవితను వదిలేసిందా లేకపోతే తీన్మార్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదని భావిస్తున్నదా అన్నదే మామూలు జనాలకు అర్ధంకావటంలేదు. ఎవరిభావాలు ఎలాగున్నా కవితను పార్టీ వదిలేసినట్లు అందరికీ అర్ధమైంది. అంటే కేసీఆర్ తనయ అన్న ట్యాగ్ లైన్ కూడా తెగిపోయిందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. తీన్మార్ చేసిన వ్యాఖ్యలకన్నా పార్టీస్పందన విషయమే కవితను ఎక్కువగా కలవరపెడుతున్నదా అన్న సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు ఏ రవీంద్రశేషు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కల్వకుంట్ల ఫ్యామిలిలోని విభేదాలు బయటపడటానికి కవిత రాసిన లేఖే కారణమ’’ని అభిప్రాయపడ్డారు. ‘‘ఏ విషయమైనా కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నపుడు కేసీఆర్ కు కవిత లేఖలు రాయటమే ఆశ్చర్యంగా ఉంద’’న్నారు. ‘‘కవితకు మద్దతుగా కాని వ్యతిరేకంగా కాని పార్టీ స్పందించటంలేదంటేనే ఆమెపరిస్ధితి ఏమిటో చెప్పకనే అందరికీ అర్ధమైపోయింద’’న్నారు. ఫామ్ హౌస్ లో కూతురు ఎదురుపడినా కేసీఆర్ మాట్లాడటానికి కూడా ఇష్టపడని విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పరు. ‘‘అధినేత దూరంగా పెట్టేసిన తర్వాత ఇక కవితతో మాట్లాడేంత సాహసం ఎవరూ చెయ్యర’’ని శేషు తెలిపారు. ‘‘కేసీఆర్ తర్వాత కేటీఆరే పార్టీకి కాబోయే అధినేతగా ప్రచారంలో ఉంది కాబట్టి మిగిలిన నేతలంతా కవితను దూరంపెట్టేస్తున్నార’’ని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News