ఇరిగేషన్ అవినీతిలో మనీలాండరింగ్ కోణముందా..?
ఇతర ఇంజినీర్లు కూడా తమ అవినీతి సొమ్మును మురళీధర్ కుమారుడు అభిషేక్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారని ఈడీ అనుమానిస్తోంది.;
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఏసీబీ ఇప్పటికే వేగం పెంచి ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకుంది. తాజాగా ఈ ఇరిగేషన్ అవినీతి కేసులో మనీలాండరింగ్ కోణం తొంగిచూస్తోంది. ఇందులో మనీలాండరింగ్ జరిగిందా? అన్న కోణంలో ఈడీ దర్యాప్తుకు రెడీ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్‌ను అదుపులోకి తీసుకుంది. ఆయన ఈఎన్సీగా ఉన్న మసయంలో తన కుమారుడు అభిషేక్ రావుకు చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసం.. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లలో సబ్ కాంట్రాక్ట్‌లు వచ్చేలా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తన కుమారుడికి సబ్ కాంట్రాక్ట్‌లు ఇప్పించడంలో మురళీధర్ రావు అన్నీ తానై చూసుకున్నారని కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. కొడుకు కంపెనీ ద్వారా మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తును స్టార్ట్ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి చేసిన ఇతర ఇంజినీర్లు కూడా తమ అవినీతి సొమ్మును మురళీధర్ కుమారుడు అభిషేక్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి అభిషేక్ కంపెనీల్లో జరిగిన పెట్టుబడులపై ఆరా తీయడం ప్రారంభించింది. ఎక్కడికి సంస్థ నుంచి లావాదేవీలు జరిగాయి వంటి అంశాలపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే డెస్టినేషన్ మ్యారేజీలు నిర్వహించడంపైన కూడా ఈడీ నజర్ పెడుతోంది. థాయ్‌ల్యాండ్‌లో జరిగిన నూనె శ్రీధర్ కుమారుడి పెళ్ళి, ఆ వివాహానికి అయిన ఖర్చులపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఇంజినీర్లపై నమోదైన అవినీతి కేసులకు సంబంధించిన వివారాలను అందించాలని ఏసీబీని కోరింది.