హైదరాబాద్ కు హై అలర్ట్

రాబోయే రెండు రోజులు హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ హై అలర్టు ప్రకటించింది.

Update: 2024-09-21 12:02 GMT
Heavy rains in city

రాబోయే రెండు రోజులు హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ హై అలర్టు ప్రకటించింది. ఆమధ్య నాలుగురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణాలోని చాలా ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోని జనాలు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. నగరంలో భారీ వర్షంపడిందంటే సమస్య ఏమిటంటే రోడ్లకు మ్యాన్ హోల్సుకు తేడా తెలీదు. దీనివల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సడెన్ గా శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పెద్ద వర్షం దంచికొట్టింది. దాదాపు గంటసేపు కురిసిన భారీ వర్షం దెబ్బకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.

శుక్రవారం రాత్రి కురిసిన వర్షం దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్ పేటలో 68.5 మిల్లీ మీటర్లు, గన్ ఫౌండ్రీలో 68.3, ఉప్పల్ లో 67, బేగంబజార్లో 62.8, నాచారంలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనిదెబ్బకు పై ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటిది మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హై అలర్టు ప్రకటించిందంటేనే జనాలు వణికిపోతున్నారు.

ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా నగరంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్ధాయి సిబ్బందిని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎంతో అవసరమైతే తప్ప జనాలు ఇళ్ళు వదిలి బయటకు రావద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

Tags:    

Similar News