బీసీ బిల్లు కోసం దీక్షకు పిలుపిచ్చిన కవిత

బీసీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని వెల్లడి.;

Update: 2025-07-29 07:27 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించడం తెలంగాణలో అత్యంత కీలక అంశంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. కాగా ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలవీ మూడు వేరువేరు మార్గాలుగా ఉన్నాయి. బీసీ బిల్లు పేరిట కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. బీసీ బిల్లు అని చెప్తూ కాంగ్రెస్.. బీసీలకే అన్యాయం చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. కాగా తాజాగా ఈ అంశంపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలనుకునే వారు తమతో ఢిల్లీకి రావాలని కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈనేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. 72 గంటల దీక్ష చేయనున్న ప్రకటించారు. బీసీ బిల్లు ఎంత ముఖ్యం అనే అంశాన్ని దేశానికి చాటిచెప్పడమే లక్ష్యంగా తాను మూడు రోజుల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తెలంగాణ జాగృతి నేతలు, తాను కలిసి 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు మంగళవారం తెలిపారు.

‘‘బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం కోసమే దీక్ష చేయనున్నాను. బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు. ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటే చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టాలనుకున్న ధర్నా కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదే. బీసీ బిల్లులో చేయాల్సిన పనులను కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం సాగదీస్తూ వస్తున్నారు. బీసీ బిల్లును అడ్డుపెట్టుకుని ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారు. కావాలనే బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ సాగదీత ధోరణ అవలంభిస్తోంది. బీజేపీ నేతలు తక్కువేం కాదు. బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో వాళ్లు మొఖం చాటేస్తున్నారు’’ అని కవిత మండిపడ్డారు.

ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలి: పొన్నం

సోమవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో బీసీ బిల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని నిశ్చయించారు. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతేకాకుండా 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో వెళ్లనున్నామని, బీసీ బిల్లు ఆమోదం కోరుకునే ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రావాలని, ప్రతి బీసీ బిడ్డ దేశ రాజధానిలో తమ గొంతు వినిపించాలని ఆయన కోరారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆగస్ట్ 5,6,7 తేదీల్లో ముఖ్యమంత్రి గారు , లోకసభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు గౌరవ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఆగస్టు 5,6,7 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ కూటమి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ వెళ్తున్నాం’’ అని తెలిపారు.

దీక్ష తెలంగాణలో ఎందుకు..!

బీసీల రిజర్వేషన్ల కోసం కవిత చేపడతానంటున్న మూడు రోజుల దీక్ష ప్రస్తుతం అనేక చర్చలకు దారితీస్తోంది. బీసీల కోసం చేస్తున్న దీక్షను ఆమె ఢిల్లీలో ఎందుకు చేయట్లేదు? అన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది. బీసీ బిల్లు ఆమోదం ఎంత ముఖ్యమో దేశవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యం అయితే.. కవిత తన దీక్షను చేయాల్సింది ఢిల్లీలో కదా.. గల్లీలో ఎందుకు చేస్తానంటున్నారు? అని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే వారంతా కూడా తమతో ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోరుతుంటే.. ఆమె ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్ ధర్నా.. బీహార్ ఎన్నికల కోసమే అంటున్న కవిత.. బీఆర్ఎస్, జాగృతి నేతలతో ఆ ధర్నాలో పాల్గొని.. ఆ ధర్నా రాష్ట్ర సమస్య కోసం చేస్తున్నదని చాటి చెప్పొచ్చుగా? అలా కాకుండా తెలంగాణలో ఉండి.. ధీక్ష చేస్తానని ఎందుకు అంటున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా ఢిల్లీలో ఏం జరిగినా దానిని దేశమంతా చూస్తుంది. అలాంటప్పుడు ఏదైనా విషయాన్ని దేశమంతా తెలియజేయాలని, చాటాలి అనుకునే వారికి ఢిల్లీ అనేది ఒక అద్భుతమైన వేదిక. అలాంటిది ఎంతో ముఖ్యమైన బీసీల రిజర్వేషన్ల అంశాన్ని దేశానికి చాటాలనుకుంటున్న కవిత.. ఆ ఫ్లాట్‌ఫార్మ్ కాదని.. తెలంగాణలో దీక్ష చేస్తా అనడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News