కేటీఆర్ ఇంటికి భారీగా నేతలు, క్యాడర్...ఏం జరుగుతోంది ?

బుధవారం అర్ధరాత్రి నుండి ఎక్కడెక్కడి నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ఇంటి దగ్గరకు ఎందుకు చేరుకుంటున్నారు ?

Update: 2024-11-14 02:42 GMT
KTR

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి కేటీఆర్ అరెస్టు తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయంటే రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేటీఆర్(KTR) ఇంటికి చేరుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి ఎక్కడెక్కడి నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ఇంటి దగ్గరకు ఎందుకు చేరుకుంటున్నారు ? పార్టీలో కీలక నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ప్రస్తుత ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ మద్దతుదారులంతా నందినగర్లోని కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. అంత పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు తనింటి దగ్గరకు రావటంతో కేటీఆర్ కూడా అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వచ్చి వాళ్ళతో భేటీ అయ్యారు.

కేటీఆర్ ను అరెస్టుచేస్తారనే అనుమానం నేతలు, కార్యకర్తలకు ఎందుకు వచ్చినట్లు ? ఎందుకంటే కలెక్టర్ మీద దాడి ఘటనలో బుధవారం ఉదయం అరెస్టయిన మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) పోలీసులు విచారణలో ఘటనకు దాడితీసిన నేపధ్యాన్న వివరించినట్లు సమాచారం. పట్నంను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినపుడు రిమాండ్ రిపోర్టు(Remand Report) కూడా అందించారు. అందులో సంచలనమైన విషయాలున్నాయి. తాను కొడంగల్ లోని భోగమోని సురేష్ ను రైతులను రెచ్చగొట్టి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) తో పాటు అధికారులపై దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు అంగీకరించాడు. తాను ఎందుకు సురేష్ ను రెచ్చగొట్టాడంటే కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పాడు. దాడిలో అధికారులు చనిపోయినా పర్వాలేదని పట్నం చెప్పినట్లు బయటపడింది. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు, జనాల దృష్టిలో దోషిగా నిలబెట్టేందుకు కేటీఆర్, తాను కలిసే ప్లాన్ చేసినట్లు పట్నం తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు.

దాడి జరిగినప్పటినుండి భూములు పోతాయన్న ఆందోళనతో కడుపుమండిన రైతులు కలెక్టర్ పై దాడిచేసినట్లు కేటీఆర్, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఎదురుదాడి చేస్తున్నారు. కలెక్టర్ పై రైతుల దాడి దురదృష్టకరమని అంటునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతకానితనంవల్లే పరిస్ధితి ఇంతదాక వచ్చిందని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు చెప్పిన విషయాలు వేరేగా ఉన్నాయి. అదేమిటంటే కలెక్టర్ పై జరిగిన దాడిలో సుమారు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అందులోపి తీసుకున్న 60 మందిలో 40 మందిని వదిలేశారు. దాడితో సంబంధంలేదని నిర్ధారణ చేసుకున్న పోలీసులు 40 మందిపై ఎలాంటి కేసులు పెట్టకుండానే వదిలేశారు. మిగిలిన 20 మందిపైన కేసులు నమోదుచేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీళ్ళు కాకుండా మరో 20 మందికోసం వెతుకుతున్నారు. పరారీలో ఉన్న వాళ్ళల్లో సురేష్ కూడా ఒకడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కలెక్టర్ మీద దాడిచేసిన వారిలో 20 మందికి అసలక్కడ ఎలాంటి భూమిలేదు.

తమ భూములు పోతాయనే కడుపుమంటతోనే కదా రైతులు కలెక్టర్ మీద దాడిచేశారని కేటీఆర్ చెప్పింది. మరి భూములే లేని రైతులు కలెక్టర్ మీద ఎందుకు దాడిచేసినట్లని పోలీసులు అడుగుతున్నారు. భూములు లేకపోయినా, ప్రభుత్వం భూములు అడగని రైతులు కలెక్టర్ మీద దాడిచేశారంటే ఉద్దేశ్యపూర్వకంగానే దాడి జరిగినట్లు అర్ధమవుతోందని ఐజి సత్యనారాయణ మీడియాతో చెప్పింది కన్వీన్సింగ్ గానే ఉంది. రైతులను కలెక్టర్ మీద దాడికి రెచ్చగొట్టిన సురేష్ భూములను ప్రభుత్వం అసలు అడగనే లేదని కూడా ఐజి చెప్పారు. అందుకనే కలెక్టర్ మీదకు ఉద్దేశ్యపూర్వకంగానే రైతులను, గ్రామస్తులను సురేష్ రెచ్చగొట్టినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. పైగా ఘటనా స్ధలంలో కర్రలు, రాళ్ళు కారప్పొడి కూడా పోలీసులకు దొరికింది. కర్రలున్నాయంటే రైతులు కాబట్టి దగ్గర పెట్టుకున్నారని అనుకోవచ్చు. మరి రాళ్ళు ఎందుకున్నాయి ? కారంపొడి ఎందుకు దగ్గర పెట్టుకున్నట్లు ? అన్న పోలీసుల ప్రశ్నలకు బీఆర్ఎస్ నుండి సమాధానం లేదు.

అందుకనే సురేష్ ను రెచ్చగొట్టిన పట్నంను పోలీసులు అరెస్టుచేసింది. విచారణలో దాడికి ప్లాన్ చేసిందే కేటీఆర్ అని పట్నం చెప్పినట్లుగా పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కేటీఆర్, తాను కుట్రచేసినట్లు పట్నం అంగీకరించారని పోలీసులు చెప్పారు. కాబట్టి ఏ నిముషంలో అయినా కేటీఆర్ అరెస్టు ఉంటుందనే విషయం కలకలం రేపింది. పట్నం రిమాండురిపోర్టు కోర్టు ద్వారా బయటకుపొక్కింది. దాంతో పార్టీ నేతలు, క్యాడర్ కేటీఆర్ ను పోలీసులు అరెస్టు చేస్తారని అనుమానించారు. అరెస్టు చేయటానికి పోలీసులు వస్తే ప్రతిఘటించటానికి నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ఇంటిదగ్గర ముందుజాగ్రత్తగా వందలసంఖ్యలో చేరుకున్నారు. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి చేరుకున్న నేతలు, క్యాడర్ ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News