మావోయిస్టు కరపత్రాల కలకలం

భద్రాద్రి జిల్లాలో పోలీసుల అప్రమత్తం;

Update: 2025-07-28 09:22 GMT

అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోల మద్దతుదారులు కరపత్రాలు, బ్యానర్లు వేసి కలకలం రేపారు. ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితోపాటు దానవాయిపేటలో ఈ బ్యానర్లు వెలిశాయి. రోడ్లపై కరపత్రాలు కనిపించాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా అందులో వ్యాఖ్యలు చేశారు.

సంక్షోభ సమయంలో వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీకి ఈ సంవత్సరం సంక్షోభ సమయం. ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రబలగాలు మావోయిస్టుల ఇలాఖాలో జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు రహిత దేశంగా వచ్చే సంవత్సరం ప్రకటిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

ఈ సంవత్సరంలోనే 16 ఎన్ కౌంటర్లు జరిగి 206 మంది మావోయిస్టులు చనిపోయారు. పార్టీ చీఫ్ సంబాల కేశవరావు చనిపోవడం మావోయిస్టులకు పెద్ద దెబ్బ. వందలాది మంది మావోయిస్టులు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీ సంస్మరణవారోత్సవాలు జరుపుకుంటోంది. ప్రతీ ఏటా మావోయిస్ట్ అగ్రనేత చారుమజుందార్ చనిపోయిన జులై 28 నుంచి వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1972 జులై 28న చారు మజుందార్ జైల్లో చనిపోయారు.

పోలీసుల ముమ్మర తనిఖీలు

సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కేంద్రబలగాలు మావోయిస్టు పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీ చేపట్టాయి. మావోయిస్టులు ప్రతీకారచర్యలకు పాల్పడే అవకాశం ఉంది అని సమాచారమందడంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Tags:    

Similar News