మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ దెబ్బ

భద్రతా దళాలు మావోయిస్టుల మీద అధునాతన ఆయుధాలతో నాలుగువైపుల నుండి విరుచుకుపడిపోతున్నాయి;

Update: 2025-04-05 10:30 GMT
Maoists Surrender

ఒక సినిమాలో మరణమా ? శరణమా ? అని హీరో ఓ సన్నివేశంలో తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇపుడు మావోయిస్టుల పరిస్ధితి అలాగే తయారైంది. భద్రతా దళాలు, ఆక్టోపస్ దళాలు, పోలీసులు, గ్రేహౌండ్స్ లాంటి అనేక దళాల దెబ్బకు మావోయిస్టులు చనిపోతున్నారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్రప్రభుత్వం మావోయిస్టు(Maoists)ల ఏరివేతకు సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దండకారణ్యమే కాకుండా ఏవోబీ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల వేటకు జల్లెడపడుతోంది. రకరకల దళాలు చుట్టుముడుతండటంతో మావోయిస్టులు ఏమిచేయలేక ఎన్ కౌంటర్లో చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రగాయాలతో తప్పించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రాణభయంతో మరికొందరు పోలీసులకు లొంగిపోతున్నారు.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఐజీ చంద్రశేఖరరెడ్డి సమక్షంలో తమ ఆయుధాలతో 66 మంది పురుష మావోయిస్టులు, 20 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. ఇంతమంది ఎందుకు లొంగిపోయారంటే ప్రాణభయంతోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మావోయిస్టుల ఉనికిపై భద్రతాదళాలు, పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చాలావేగంగా చేరుతోంది. పోలీసులు కూడా తమ ఇన్ఫార్మర్ నెట్ వర్కును బాగా పెంచుకున్నట్లే ఉన్నారు. అందుకనే పదిమంది యాధృచ్చికంగా కలిసినా లేదా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం తెలిసిపోతోంది. ఇంకేముంది మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న తర్వాత పోలీసులు, భద్రతాదళాలు ఊరుకుంటాయా ? వేటకుక్కుల్లాగ భద్రతా దళాలు మావోయిస్టుల మీద అధునాతన ఆయుధాలతో నాలుగువైపుల నుండి విరుచుకుపడిపోతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ల(Encounters)ను తట్టుకోలేక, ఎన్ కౌంటర్లనుండి తప్పించుకోలేక చివరకు శాంతిచర్చలకు సిద్ధంబాబోయ్ అంటు రెండురోజుల క్రితమే మావోయిస్టు కేంద్రకమిటి అధికార ప్రతినిధి అభయ్ ప్రభుత్వాలకు ఓపెన్ ఆఫర్ లేఖను విడుదలచేశారు.


ఇలాంటి పరిస్ధితుల్లోనే ఒక్కసారిగా 86 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోవటం చిన్నవిషయం కాదు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఐజీ స్వయంఉపాధి నిమ్మితం రు. 25 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకిగా మారినట్లు ఆరోపించారు. మావోయిస్టుల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. మవోయిస్టులందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఐజీ పిలుపిచ్చారు. ఎన్ కౌంటర్లు దెబ్బకు చనిపోవటం కన్నా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవటమే మేలని మావోయిస్టులు అనుకుంటున్నట్లున్నారు. అందుకనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను చూసిన తర్వాత మరికొందరు లొంగిపోతున్నారు. గడచిన నాలుగునెలల్లో కొత్తగూడెం జిల్లాలో మాత్రమే 250 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరో 66 మంది అరెస్టవ్వగా పదులసంఖ్యలో చనిపోయారు.

పోయిన నెలలో కూడా ఒకేరోజు 64 మంది దళసభ్యులు లొంగిపోయారు. నాలుగునెలల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) లో సుమారు 200 మంది మావోయిస్టులు చనిపోయారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పోయిన ఏడాది మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, భద్రాద్రి కొత్తగూడెం అడవీ ప్రాంతాల్లోనే చాలామంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమైపోయారు. మావోయిస్టు రహిత భారత్ అనే కేంద్రప్రభుత్వ నినాదం మావోయిస్టుల్లో చాలామందిలో వణుకుపుట్టిస్తున్నట్లే ఉంది. అందుకనే దళాలను వదిలేసి, నాయకత్వాలను కాదని మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు.

Tags:    

Similar News