గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లు

పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించాం.;

Update: 2025-05-19 10:51 GMT

గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రతి ఒక్క గిరిజనుడిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించన అనంతరం గిరిజనులు, నల్లమల ప్రాంత అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే ‘నల్లమల డిక్లరేషన్‌’ను ఆవిష్కరించారు. దీని ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని వెల్లడించారు.

‘‘నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోంది. ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆ దిశగా అధికారులకు సూచనలు చేశా. పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది’’ అని చెప్పారు.

‘‘అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు అందిస్తాం. రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసింది. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్నాం. వరి వేస్తే ఊరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు కల్పించాం. పేదలందరికీ సన్న బియ్యం అందించి వారి ఆత్మగౌరవం పెంచాం’’ అని అన్నారు.

‘‘రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలలకు అప్పగించాం. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నాం. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టాం. నిత్యావసర ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది’’ అని గుర్తు చేశారు.

‘‘శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించాం. ఎంతోమంది ప్రధానులు అయినా…. ప్రతీ తండాలో.. పేదవాడి గుండెల్లో నిలిచిపోయింది మాత్రం ఇందిరమ్మ మాత్రమే. మీ భూమికి హక్కు ఇవ్వడమే కాదు.. మీ భూముల్లో సోలార్ పంపుసెట్లతో సాగు చేసుకునేలా నల్లమల బిడ్డగా నేను బాధ్యత తీసుకున్నా. కొంతమంది తమ అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కడుపునిండా విషం పెట్టుకుని మనపై విష ప్రచారం చేసే వారిని నేను పట్టించుకోను. పేదల ఆకలి తీర్చే రేవంతన్న సన్న బియ్యం మేమేం చేస్తున్నామో గుర్తు చేస్తుంది. రైతులు పాసు పుస్తకాలు చూసినప్పుడల్లా రుణమాఫీ చేసిన రేవంతన్న గుర్తొస్తాడు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘బస్సులో ఉచిత ప్రయాణం చేసిన ఆడబిడ్డలకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న పేదలకు మా ప్రభుత్వం చేసే మంచి పనులు గుర్తుంటాయి. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మన పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయి. మనపై తప్పుడు ప్రచారం చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News