తెలంగాణలో ఏసీబీ కేసులున్నా అవినీతి అధికారులకు సర్కార్ అందలం

పలుకుబడి ఉంటే మళ్లీ పోస్టింగ్ లు వస్తాయి.;

Update: 2025-07-15 10:06 GMT
తెలంగాణ సచివాలయం

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులకు సర్కారు అందలం ఎక్కిస్తుంది. లంచం సొమ్ము తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా, వారిపై చర్యలు తీసుకోక పోగా, అక్రమార్కులకు ఏసీబీ కేసులను పక్కన పెట్టి పోస్టింగులు, ప్రమోషన్లు ఇస్తున్నారు.దీంతో గతంలో అక్రమాలకు పాల్పడి, ఏసీబీ కేసులున్న అవినీతి పరులు సైతం తిరిగి పోస్టింగులు పొంది, మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడమే తప్పంటే, వారిపై ఏసీబీ కేసులు విచారణలో పెండింగులో ఉన్నా, వాటిని కాదని పదోన్నతులు సైతం ఇచ్చారు. దీంతో పలు ప్రధాన ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.


ఏసీబీ వలలో ఏఈ
ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన సీసీ రోడ్డు పనిని కొలతల పుస్తకంలో నమోదు చేసి, దానిని పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప కార్య నిర్వహణ ఇంజనీర్‌కు పంపించేందుకు ఫిర్యాధిధారుని నుంచి లక్షరూపాయల లంచం ఏఈ పి.జగదీష్ బాబు డిమాండ్ చేశారు.పెద్దపల్లి సబ్-డివిజన్ & జిల్లా పంచాయతీరాజ్ శాఖ విభాగపు ఉప కార్య నిర్వహణ ఇంజనీరు వారి కార్యాలయంలోని ఎలిగేడు మండలపు సహాయక ఇంజనీరు పి.జగదీష్ బాబు రూ.90,000 లంచం తీసుకుంటూ ఈ నెల 12తేదీన తెలంగాణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు .

రెండు సార్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా...
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ ప్రాంత పంజాయితీరాజ్ అసిస్టెంట్ ఇంజినీరు జ‌గ‌దీష్ బాబు గతంలో 2017వ సంవత్సరంలో కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తూ ఓ కాంట్రాక్టరు నుంచి ఓ కంట్రాక్ట‌ర్ నుంచి రూ.1.50 లక్షలను లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.ఏసీబీ కేసు విచార‌ణలో ఎనిమిదేళ్లుగా జరిగిన జాప్యంతో మళ్లీ జగదీష్ బాబు పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ప్రాసిక్యూట్ చేయ‌డానికి అనుమ‌తిలో జరిగిన జాప్యంతో ఏఈ పై అధికారుల చ‌ల‌వ‌తో మంచి పోస్టింగు తెచ్చుకొని మ‌ళ్లీ అవినీతికి పాల్ప‌డుతున్నాడు. మళ్లీ రూ.90,000 12-7-2025 వతేదీన కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారుల‌కు చిక్కాడు. రెండు సార్లు ఏసీబీ చేతికి చిక్కారు.



 ఏసీబీ కేసున్నా పదోన్నతి

క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ డిపార్టుమెంటులో డిప్యూటీ క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ అధికారిగా డి. శ్రీ‌నివాస్‌రెడ్డి ప‌నిచేస్తున్నాడు. ఇత‌నిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తేది 6-7-2018వతేదీన అవినీతి కేసు న‌మోదు చేశారు. (ఎఫ్‌.ఐ.ఆర్‌. నం. 04/ఆర్ సీటీ -ఏసీబీ, నిజామాబాద్)నంబరుతో ఇతనిపై ఏసీబీ కేసు పెట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌ద‌రు అధికారిని ప్రాసిక్యూట్ చేయ‌డానికి జరిగిన జాప్యంతో గ‌త 7 సంవ‌త్స‌రాలుగా ఈ కేసు చార్జిషీటు ఫైల్ చేయ‌లేదు.దీంతో శ్రీనివాసరెడ్డి ఈ మ‌ధ్య కోర్టులో కేసువేయ‌గా, కోర్టు ఏసీబీ కేసును పరిగణనలోకి తీసుకోకుండా ఆయ‌నకు కమర్షియల్ ఆఫీసరుగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు. ఏసీబీ కేసును ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోకుండా పదోన్నతి ఉత్త‌ర్వులు జారీచేశారు.ఈ విధంగా చాలామంది అధికారులపై ఏసీబీ కేసులున్నా ప్ర‌మోష‌న్లు, మంచి పోస్టింగులు పొందుతున్నారు.

అక్రమాలకు కేరాఫ్ ఈ ప్రభుత్వ శాఖలు
తెలంగాణలోని పలు ప్రభుత్వ విభాగాలు అవినీతి ఆలవాలంగా మారాయి. సామాన్యులు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న అక్రమాలతో చాలా బాధ‌పడున్నారు. ముఖ్యంగా పుర‌పాల‌క‌, రెవెన్యూ, పోలీసు వంటి శాఖ‌ల్లో లంచాలు ఇవ్వ‌నిదే ఏ ప‌ని కావ‌డంలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు. అవినీతి నిరోధ‌క శాఖ వారు అవినీతి అధికారుల‌పై కేసులు పెట్టినా, వాటి విచార‌ణ‌లో జాప్యం వల్ల పలు కోర్టుల‌లో చాలా కేసులు వీగిపోయాయి. దానితో అవినీతి అధికారుల‌కు త‌ప్పు చేస్తే శిక్ష ప‌డుతుంద‌న్న భ‌యం లేకుండా పోయింది.

ఏసీబీ, విజిలెన్స్ కేసులపై చర్యలేవి?
అవినీతి నిరోధక శాఖ కేసు న‌మోదు చేసిన త‌ర్వాత మూడు నెల‌ల‌లోగా విచార‌ణ పూర్తి చేసి త‌మ రిపోర్టును విజిలెన్స్ క‌మిష‌న్ ద్వారా ప్ర‌భుత్వానికి పంపాలి. విజిలెన్స్ క‌మిష‌న్ వారు ఏసీబీ రిపోర్టులు ప‌రిశీలించి రెండు వారాల్లో కేసుపై త‌మ అభిప్రాయాన్ని తెలుపుతూ ఏసీబీ రిపోర్టును రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంపాలి.కానీ ఏళ్లు గడస్తున్నా ఈ అక్రమాల కేసులపై నివేదికలను ప్రభుత్వానికి పంపించడం లేదు.
- తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో సంబంధిత శాఖ వారు ఏసీబీ రిపోర్టుపై ఒక నెల‌లో నిర్ణ‌యం తీసుకోవాలి. ఏసీబీ నిందితుణ్ణి ప్రాసిక్యూట్ చేయాల‌ని అడిగిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ప్రాసిక్యూష‌న్ కు అనుమ‌తి ఇవ్వాలి. తాము కొన్ని ద‌స్త్రాలు ప‌రిశీలించిన‌ప్పుడు సంబంధిత శాఖ‌ల్లో నిందితుల‌కు స‌హాయం చేసే ప‌ద్ధ‌తిలో కేసు పెండింగులో ఉంచ‌డం లేదా ప్రాసిక్యూష‌న్ అనుమ‌తి ఇవ్వ‌టం లేదని యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కోర్టులో ప్రాసిక్యూష‌న్ త‌ర‌పున గ‌ట్టిగా వాద‌న‌లు వినిపించి దోషికి శిక్ష‌ప‌డేట‌ట్లుగా చూడాలి. అలాగే కేసు న‌మోదైన రెండు సంవ‌త్స‌రాల‌లోపు కేసుకు ముగింపు ఉండాలి.కానీ ఏళ్లు గడుస్తున్నా విచారణ పూర్తి కావడం లేదు.
- ప్ర‌స్థుతం అవినీతి నిరోధకశాఖ కేసులు 60 శాతానికి మించి స‌క్సెస్ అవ‌డం లేదు. దీనిని 90 శాతం స‌క్సెస్ రేటు వ‌ర‌కు తీసుకు వెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంది.
- అవినీతి నిరోధకశాఖ ఒక ఉద్యోగ‌స్థునిపై కేసు న‌మోదు చేసిన త‌రువాత అత‌ని కేసు పూర్తి అయ్యే వ‌ర‌కు పోస్టింగు ఇవ్వ‌కూడ‌దు. కానీ అక్రమార్కులకు విచారణ పూర్తికాకుండానే పోస్టింగులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ స‌గ‌టున నెల‌కు 20 కేసులు న‌మోదుచేస్తుంది అయితే విచార‌ణ‌లో ఆల‌స్యం, కోర్టుల‌లో కేసులు కొట్టివేత‌, కేసు పెండింగులో ఉన్నా ప్ర‌మోష‌న్లు వంటి వాటితో ప్ర‌జ‌ల‌కు ఏసీబీ కేసు న‌మోదు చేసిన వాటి వ‌ల్లఏమీ అవ్వ‌దు అన్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో నెలకొంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ
అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల‌లో తొంద‌ర‌గా విచార‌ణ చేసి, గ‌ట్టి శిక్ష‌లు ప‌డేలా చూడాలని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్య‌క్షులు యం.ప‌ద్మ‌నాభ‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఒక‌సారి ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ అధికారుల‌కు కేసు పూర్తి అయ్యే వ‌ర‌కు పోస్టింగులు ఇవ్వ‌కుండా అలాగే ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకొనాలని ముఖ్య‌మంత్రిని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ కోరింది.


Tags:    

Similar News