అవినీతి అధికారులకు అందలం, ఏసీబీ, విజిలెన్స్ కేసులున్నా ప్రమోషన్లు

తెలంగాణలో అవినీతి అధికారులకు అందలం ఎక్కిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఏసీబీ, విజిలెన్స్, క్రిమినల్ కేసులున్నా, వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు.;

Update: 2025-03-18 12:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. అవినీతికి పాల్పడి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కినా, విజిలెన్స్ కేసులు నమోదైనా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ప్రమోషన్లు ఇచ్చి కోరుకున్న స్థలాల్లో పోస్టింగులు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు తెరపడటం లేదు.


ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతీ పనికీ లంచాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు విభాగాల ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డుతున్నారు. ప్ర‌తి చిన్న ప‌నికి కూడా ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన ప‌రిస్థితి నెలకొంది.ముఖ్యంగా రెవెన్యూ, రవాణ, మున్సిపాలిటీ, పోలీసు, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్‌, ఆబ్కారీ వంటి శాఖ‌ల్లో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది.ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో త‌ప్పు చేస్తే శిక్ష ప‌డుతుందన్న భ‌యం లేకుండా పోయింది.

ఏసీబీ, విజిలెన్స్ రిపోర్టులపై చర్యలేవి?
ప్రభుత్వ అధికారుల అవినీతిని అరిక‌ట్ట‌డానికి ఏర్పాటు చేసిన విజిలెన్స్, అవినీతి నిరోధ‌క శాఖల రిపోర్టుల‌పై తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఏ.సి.బి., విజిలెన్స్‌ల నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు, క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న చాలామంది ఉద్యోగుల‌కు కోరుకున్న జాగాల్లో పోస్టింగులు ఇవ్వడమే కాకుండా ప్ర‌మోష‌న్లు కూడా కట్టబెడుతున్నారు. దీంతో ఉద్యోగ‌స్థుల్లో ఎన్ని అక్క‌మాల‌కు పాల్ప‌డ్డా, లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఏమీ కాదు అన్న భావ‌న క‌లుగుతుంది.దీంతో ఉద్యోగ‌స్థులు విచ్చ‌ల విడిగా లంచాల‌కు ఎగ‌బ‌డుతున్నారు.

డీసీటీఓపై ఏసీబీ కేసున్నా...
డి.సి.టి.ఓ. జి. శ్రీ‌నివాస్‌ పై ఏ.సి.బి. అధికారులు 2013వ సంవ‌త్స‌ర‌ములో ఒక క్రిమిన‌ల్ కేసు (సంఖ్య నం 11/ ఆర్‌.సి.టి. - సి.ఆర్‌. 1/2013 న‌మోదు చేసింది. ఏ.సి.బి. ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో కేసు వేశారు. (సి.సి. నం. 10/2014) కేసు గ‌త 11 సంవ‌త్స‌రాల నుంచి ఏ.సి.బి. న్యాయ‌స్థానంలో పెండింగులోనే ఉంది. శ్రీ‌నివాస్‌ త‌న‌పై ఉన్న కేసును ప‌క్క‌న పెట్టి త‌న‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించ‌గా (డ‌బ్యు.పి.నం 7046/2025) కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. శ్రీ‌నివాస్‌ కోరిన విధంగా ఆయ‌న‌పై ఏ.సి.బి. కోర్టులో ఉన్న క్రిమిన‌ల్ కేసును ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోకుండా ఆయ‌న‌కు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా ప‌దోన్న‌తి కోసం ప‌రిశీలించాల‌ని ఆర్డ‌ర్ పాస్ చేసింది.

వాణిజ్యపన్నుల శాఖలో...
మరో డి.సి.టి.ఓ. డి.శ్రీ‌నివాస్‌రెడ్డి పై ఎఫ్‌.ఐ.ఆర్‌. 04/ ఆర్‌.సి.టి. - ఏ.సి.బి/ ఎన్‌.జెడ్‌.బి/2018 తేది 6-7-2018 న ఏ.సి.బి. కేసు న‌మోదు చేసింది. గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా కేసు విచార‌ణ పూర్తి కాలేదు. ఇంత‌లో శ్రీ‌నివాస్ రెడ్డి త‌న‌పై ఉన్న ఏ.సి.బి. క్రిమిన‌ల్ కేసును ప‌క్క‌న పెట్టి త‌న‌కు ప‌దోన్న‌తి క‌ల్పించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. (డ‌బ్యు.పి. నం. 3445/2025) కోర్టు శ్రీ‌నివాస్‌రెడ్డి అర్జీని ప‌రిశీలించి ఆయ‌న కోరిన విధంగా ఏ.సి.బి. కేసును ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోకుండా ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చే విషయం ప‌రిశీలించాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మరో విజిలెన్స్ కేసులో...
సీటీఓగా కె. గీత (భ‌ర్త యం. శ్రీ‌నివాస్‌రెడ్డి)తీవ్ర అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌గా విజిలెన్స్ విభాగం విచారించి ఆమెపై తేదీ 30-6-2017 న నేరారోప‌ణ ప‌త్రం జారీ చేసింది. ఈ కేసు ఇంకా విచార‌ణ‌లోనే ఉంది. ఇంత‌లో గీత త‌న‌పై జ‌రుగుతున్న విచార‌ణ‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోకుండా త‌న‌కు జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించింది (డ‌బ్యు.పి. నం. 7066/2025). ఈ కేసులో కోర్టు ఆమె కోరిన విధంగా, ఆమెపై జ‌రుగుతున్న విచార‌ణ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఆమెను జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ప‌దోన్న‌తి కోసం ప‌రిశీలించాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేసింది.

కోర్టు ఉత్తర్వులు
ఇలాంటి కేసులు ఒక క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ శాఖ‌లో కాక చాలా శాఖ‌ల్లో జ‌రుగుతున్నాయి.తీవ్ర అవినీతి, నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉద్యోగ‌స్థుల‌కు కావాల్సిన స్థ‌లాల్లో పోస్టింగులు ,ప్ర‌మోష‌న్‌లు ఇస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేశారు.

సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
తెలంగాణలోని ప్రభుత్వ విభాగాల్లో అధికారులపై అవినీతి, తీవ్ర నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉద్యోగ‌స్థులకు కావాల్సిన చోట పోస్టింగులు, ప్ర‌మోష‌న్‌లు ఇవ్వ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పైన తెలిపిన మూడు కేసుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మేర ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పక్షాన అధ్య‌క్షులు యం.ప‌ద్మ‌నాభ‌రెడ్డి సీఎంకు మంగళవారం లేఖ రాశారు.


Tags:    

Similar News