తెలంగాణ నుంచి బరిలో రాహూల్ గాంధీ? నల్గొండ లేదా ఖమ్మం నుంచి పోటీ?
కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టున్న నల్గొండ, లేదా ఖమ్మం నుంచి రాహూల్ గాంధీ పోటీ చేస్తారని..
By : The Federal
Update: 2024-02-27 08:43 GMT
గోపిరెడ్డి సంపత్ కుమార్
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చెయ్య బోతున్నారా.. సునాయాసంగా గెలిచే ఖమ్మం, భువనగిరి, నల్గొండ నియోజక వర్గాల్లో ఏదైన స్థానం నుంచి పోటీ చెయ్యబోతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిని రాహుల్ గాంధీ అంగీకరించారా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సోనియా గాంధీని ఖమ్మం పార్లమెంటు నుంచి రంగంలోకి దింపాలనుకున్నా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు అత్యంత సేఫ్ సీట్లు ఖమ్మం, భువనగిరి, నల్గొండ స్థానాలు .. సోనియా గాంధీ మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సోనియా గాంధీ రాజస్థాన్ వెళ్ళడంతో రాష్ట్ర నేతల ప్రయత్నాలు ప్రియాంక వైపుకు మళ్లాయి. యిక్కడి నుంచి పోటీ చేయాలని ఆమెకు విజ్ఞప్తులు వెళ్ళాయి. అయితే దీనికి ప్రియాంక అంగీకరించలేదని సమాచారం, దీంతో ఇప్పుడు నాయకుల చూపు రాహుల్ గాంధీపై పడింది. ఫలితంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది.
గాంధీ కుటుంబానికి మంచి పట్టున్న అమేథీ నుంచి మూడుసార్లు వరుసగా రాహుల్ గాంధీ గెలిచారు. 2019 ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీచేసిన రాహుల్ వయనాడ్ లో గెలిచి లోక్ సభలో కొనసాగారు. ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహిల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీచేయడంలేదని తెలుస్తున్నది.
కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ వయనాడ్ నుంచి పోటీ చెయ్యాలని, సీట్ల పంపకాలు ఇంకా తేలకపోయినప్పటికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య యాని రాజా వయనాడ్ లో పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వయనాడ్ తో రాహుల్ బంధం తెగిపోయినట్టేనని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఆహ్వానాన్ని అందుకున్న ప్రియాంక వధేరా తమ కుటుంబానికి ప్రియమైన సీటు రాయ్ బరేలీనుంచే పోటీకి సుముఖంగా ఉన్నట్లు.. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయవచ్చుని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ పోటీ ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండూ కూడా అత్యంత సేఫ్ సీట్లు అని పార్టీ భావిస్తోంది. ఖమ్మంలో ఇప్పటికే పార్టీ టికెట్ కోసం చాలా పోటీ ఉంది. ఆ సీటు నాదే అని ప్రకటించుకున్న రేణుకా చౌదరి రాజ్యసభ కు ఎంపికయ్యారు. ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హెచ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కీలకంగా రేసులో ఉన్నారు. కాగా ఖమ్మం సీటుకు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వస్తే అంతా సద్దుమణగడం మాత్రమే కాదు. అందరూ కలిసి మెలిసి పార్టీ విజయానికి పనిచేసే అవకాశం కూడా ఉంటుందనేది తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ గాంధీ పోటీ వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ త్వరలో రావచ్చని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెజావత్ బెల్లయ్య నాయక్ తెలిపారు. తెలంగాణపై రాహుల్ గాంధీకి ప్రత్యేక అభిమానం వున్న నేపద్యంలో కచ్చితంగా ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు మెండుగా వున్నాయని వెల్లడించారు.