సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ బెస్ట్, శిఖాగోయెల్‌కు అవార్డు

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది.సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్, దేవేందర్‌సింగ్‌లకు మంత్రి అమిత్ షా అవార్డులను ప్రదానం చేశారు.

Update: 2024-09-10 11:52 GMT
కేంద్రమంత్రి అమిత్ షా నుంచి అవార్డు అందుకుంటున్న షీకాగోయెల్ (ఫొటో : పీఐబీ సౌజన్యంతో)

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేశారు.తెలంగాణలో సైబర్ నేరాల నివారణకు చేసిన కృషికి గుర్తింపుగా వీరిద్దరికీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో వచ్చిన ఈ గుర్తింపు తెలంగాణ పౌరులందరికీ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను అందించినందుకేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ చెప్పారు. సైబర్ నేరాలను విశ్లేషించి ప్రజలు మోసపోకుండా ముందుజాగ్రత్తలపై ప సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది.

- మహిళలు, పిల్లలు ఆన్ లైన్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కేంద్రమంత్రి అమిత్ షా నుంచి అవార్డు లభించింది.
- సైబర్ మోసాల బారిన ప్రజలు పడకుండా సురక్షితంగా ఉండేందుకు వీలుగా 1930 నంబరుకు ఫోన్ చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది.

పాన్ ఇండియా సైబర్ మోసం
తెలంగాణ రాష్ట్రంలో రూ.85.05 కోట్లను సైబర్ మోసాల బాధితులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో తిరిగి అందించింది. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.13.16 కోట్లను కొల్లగొట్టారు. సైబర్ నేరగాళ్లు ఈ సొమ్మును హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముజఫర్ నగర్, కటక్, అహ్మదాబాద్, భన్ వాడ, సూరత్, జునాఘడ్, నోయిడా, భలియా సెహోర్, నాసిక్, నవీముంబయి, అంథేరి, థానే హీరాపురా, జోధ్ పూర్, జైపూర్, సోనిట్ పుర్ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలకు మళ్లించారని తేలింది.

ఉన్నతవిద్యావంతులే సైబర్ మోసాల బాధితులు
సైబర్ మోసాల బారిన పడిన బాధితుల్లో దాదాపు సగం మంది బాగా చదువుకున్న వారేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ చెప్పారు.ఉన్నత విద్యావంతులైనప్పటికీ, వారు సైబర్‌స్కామ్‌ల బారిన పడుతున్నారు.సైబర్ నేరాలను తాము విశ్లేషించగా 48 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్,ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఉన్నతవిద్యావంతులని తేలిందని ఆమె చెప్పారు.

సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం
సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శిఖాగోయెల్ చెప్పారు.డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా వీడియోలు, పోస్టర్లు, మెసేజుల రూపంలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు.అందువల్ల సైబర్ నేరాలపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సైబర్ నేరస్థుల బారిన పడితే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు లేదా 1930 ఫోన్ నంబరుకు డయల్ చేయాలని శిఖా గోయెల్ కోరారు.

నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు
సైబర్ నేరాలు ఎక్కువగా నకిలీ డాక్యుమెంట్ల సాయంతో సిమ్ కార్డులు పొందిన వారు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో తేలింది. దీంతో నకిలీ డాక్యుమెంట్లకు సిమ్ కార్డులు జారీ చేయవద్దని తాము టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం రెగ్యులేట్ అథారిటీకి, టెలీ కమ్యూనికేషన్స్ విభాగాలకు లేఖలు రాశామని సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెప్పారు.

ఆన్ లైన్ మోసాలపై ముందుజాగ్రత్తలు తీసుకోండి
- అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్,ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా వచ్చే మెసేజులు, లింక్స్ ను క్లిక్ చేయవద్దు.క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు. కేవైసీ పేరిట బ్యాంకు అధికారులెవరూ ఖాతాదారులను సంప్రదించరు.
- అపరిచితుల ఫోన్ కాల్స్, ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించరాదు.
- ఐవీఆర్ మెసెజులు, స్పూఫుడ్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్, కొరియర్ సర్వీసులు, పోలీసులు పేరిట వచ్చే కాల్స్ ను నమ్మవద్దు.


Tags:    

Similar News