తెలంగాణలో గురుకులాలను రద్దు చేస్తారా ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు బహిరంగ లేఖ

Update: 2024-06-14 05:07 GMT


మీరు ఇటీవల ముఖ్యమంత్రిగా గురుకులాల వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరమవుతున్నారని ఒక నివేదిక వచ్చిందని ప్రకటించారు. అదే సమయంలో ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం స్కూల్లో భోజనాలు , స్నాక్స్ పెట్టి ఇంటికి పంపడం అనే ఆలోచన వ్యక్తం చేశారు. దీంతో గురుకులాలను రద్దు చేసి కేవలం స్కూల్లో భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారని భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. పేద ప్రజలు , తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


పేదల ఇంటికాడ పరిస్థితులు :


ఇంటికాడ పరిస్థితులు బాగోలేకపోవడం , చదువకునే వాతావరణం లేక ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణంలో చక్కని వసతి సౌకర్యాలతో నాణ్యమైన విద్య , నాణ్యమైన భోజనం వందలాది మంది విద్యార్థులు కలిసి ఒక సమాజంగా జీవించడం కోసం ఒక ఆదర్శంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ నివేదిక సంపన్నుల పిల్లల గురించి :

రెసిడెన్షియల్ స్కూళ్ళవల్ల తల్లిదండ్రులకు పిల్లలు దూరమవుతునన్నారని వచ్చిన నివేదిక సంపన్న కులాలకు , కుటుంబాలకు సంబంధించిన నివేదిక మాత్రమే. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో , హాస్టళ్ళలో ఈ పరిస్థితి ఉండదు. ఇక్కడ పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడైనా కలవవచ్చు. పండుగలకు ఇంటికి కూడా తీసుకువెళ్తారు. దసరా , సంక్రాంతి , వేసవి సెలవుల్లో ఇంటివద్దే ఉంటారు. ఇలా యేడాదికి మూడు నెలల దాకా తల్లిదండ్రులతోటే కలిసి ఉంటారు. అందువల్ల అనుబంధాలు తగ్గుతాయి అనే మాట అవాస్తవం. నేను బీసీ కమిషన్ ఛైర్మన్గా , అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళను సందర్శించాను. ఎక్కడ చూసినా పిల్లలు ఎంతో ఉ త్సాహంగా చదువుకుంటున్నారు. ఇల్లు బాగుందా ?, రెసిడెన్షియల్ స్కూలు బాగుందా ? అని అడిగితే ముక్త కంఠంతో స్కూలే బాగుంది అని చెప్పారు.

పిల్లల మధ్యన ఒక సంఘటిత శక్తి , ఒక ఆత్మవిశ్వాసం , చక్కని సంస్కారం , ఆటపాటలు , చక్కని హ్యాండ్ రైటింగ్ , చక్కని భాష , అభివ్యక్తి నేర్పుతున్నారు. పది మందిలో ఎలా మాట్లాడాలి ? ఎలా ఉపన్యాసం ఇవ్వాలి ? వంటివి కూడా నేర్పుతున్నారు. బాడీ లాంగ్వేజ్ ఎలా హుందాగా ఉండాలి ? ఎంత సంస్కారవంతంగా ఉండాలి ? అని నేర్పడం 24 గంటలూ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండడంవల్లే సాధ్యం. దానికోసమే సంపన్నులు తమ పిల్లలను ఐదేళ్ళ వయస్సు నుండే చేర్చుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే !... సుప్రీంకోర్టు ఈ విషయంలో లోతుగా ఆలోచించి ఎప్పుడో తీర్పు చెప్పింది. తొమ్మిదేళ్ళలోపు పిల్లలను హాస్టళ్ళలో , రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేర్చకూడదని , తొమ్మిదేళ్ళు నిండిన తర్వాత మాత్రమే హాస్టళ్ళలో , గురుకులాలలో చేర్చాలని తీర్పు ఇవ్వడం జరిగింది. విడాకుల కేసుల్లో కూడా పిల్లలు తల్లి వైపు ఉండాలో , తండ్రివైపు ఉండాలో తేల్చుకునేదాక తల్లివద్దే ఉండాలని తీర్పునిచ్చింది. ఇలా తొమ్మిదేళ్ళ లోపు పిల్లలు తమ భాషను , సంస్కృతిని , పరిసరాలను , తమ తల్లిదండ్రుల స్థితిగతులను , కులాన్ని , కులవృత్తులను , కుల వెలివేతను , కుల వివక్షను , తమ పేదరికాన్ని అన్నిటిని చూస్తారు. అవగాహన పెరుగుతుంది. అందువల్ల తొమ్మిదేళ్ళ తర్వాత హాస్టళ్ళలో , గురుకులాల్లో , రెసిడెన్షియల్ స్కూళ్ళలో వేయవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతారు అనే మాట ఆధారంగానే తొమ్మిదేళ్ళ దాక తల్లిదండ్రుల వద్దే ఉండాలని సుప్రీంకోర్టు భావించింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ యధేచ్ఛగా ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్ళు నడుస్తున్నాయి అసలు విషయం ఇలా ఉండగా , యధేచ్ఛగా ప్రైవేటు రంగంలో నర్సరీ నుండి హాస్టళ్లలో , రెసిడెన్షియల్ స్కూళ్ళలో సంపన్నులు కలిగినవారు చేరుస్తూనే ఉన్నారు. వాటిని వెంటనే మూసేయించడం అవసరం. ఎక్కడికక్కడ దాడులు చేసి నర్సరీ నుంచి కొనసాగుతున్న ప్రైవేటు హాస్టళ్ళను , రెసిడెన్షియల్ స్కూళ్ళను మూసేయించడం అవసరం.

1 పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు , హాస్టళ్ళు ఎంతో అవసరం
పేదరికం వల్ల ప్రభుత్వ హాస్టళ్ళో కూడా మూడవ తరగతి నుండి చేర్చుకుంటున్నారు. నిజానికి ఒకటో తరగతి నుంచి కూడా తీసుకోవచ్చు అని భావించడం జరిగింది. కానీ , వారి కాలకృత్యాలు తీర్చుకొని , చక్కగా స్నానం చేసి , బడికి పోవడానికి కనీసం ఏడెనిమిదేళ్ళ వయస్సు ఉండాలని , మూడవ తరగతి నుండి తీసుకుంటున్నారు. పేదల పిల్లలు కాస్త ఆలస్యంగా బడికి వెళ్ళడం వల్ల మూడవ తరగతికే ఎనిమిదేళ్ళు నడుస్తుంటాయి. దశాబ్దాల అనుభవంతో రూపొందిన హాస్టళ్ళు , రెసిడెన్షియల్ స్కూళ్ళు దశాబ్దాల అనుభవంతో రూపొందిన పాఠశాలల ప్రవేశ పద్దతులు , రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశ పద్ధతులు స్థిరపడ్డాయి.

నేడు ఆన్లైన్ అప్లికేషన్ పద్దతి కూడా కష్టపడి అలవర్చుకుని పిల్లలు , తల్లిదండ్రులు హాస్టళ్ళలో , రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేర్పించడానికి కష్టపడుతున్నారు. అయినప్పటికీ బిసి - ఎ గ్రూపులోని చాలా కులాలు , తక్కువ జనాభా గల పెద్ద కులాలు , ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశ పరీక్ష పాస్ కాలేకపోతున్నారు. దాంతో ప్రత్యేకంగా ఆయా కుల సంఘాలు తమకు అందుబాటులో ఉన్న అధికారులను , ప్రజాప్రతినిధులను కలిసి ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నారు.

నిజానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో , ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ప్రవేశం అనే నిబంధనల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాలు పెరుగుతాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుంది. దశాబ్దాల అనుభవంతో , అధ్యయనంతో ఈ సూచన చేయడం జరుగుతున్నది. ఇకనుండి రెసిడెన్షియల్ స్కూళ్ళలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి మాత్రమే అర్హులు అనే నిబంధనతో పెద్ద పెట్టున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. విద్య ప్రమాణాలు కూడా పెరుగుతాయి.

ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. సంపన్నులు తమ పిల్లలను నర్సరీ , ఒకటో తరగతి నుంచి కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఐదో తరగతి నుంచి తీసుకుంటున్నారు. అప్పటికీ పిల్లలకు పదేళ్ళ వయస్సు నడుస్తుంటుంది. ఈ పదేళ్ళ దాక వారు ఇంట్లోనే ఉండి తమ సమీప పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇలా ప్రాథమిక విద్యాస్థాయిలో ఇంటివద్దే ఉండి చదువుకోవటం వల్ల వాళ్ళకు తల్లిదండ్రులకు ఇరుగు పొరుగుతో చుట్టూ సమాజంతో చక్కని సంబంధాలు , ఆ పరిమితులు , కుల వివక్ష , పేదరికం , కులవృత్తులు మొదలైనవి తెలుస్తున్నాయి.

అంతే గాకుండా , ఇంటి పనిలో , వంట పనిలో , పొలం పనిలో , కులవృత్తిలో ఎంతో కొంత సహకరిస్తూ నేర్చుకుంటున్నారు. పేదరికం కారణంగా పిల్లలు ఇంటివద్ద సరియైన పరిస్థితులు లేక చదువుకోలేకపోతున్నారు. సరైన విధంగా ఇంటి వసతి ఉండదు. దోమలు , ఈగలు , ఇంటిచుట్టూత పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. స్కూలుకు పోయి రాగానే ఇంటి పనులు చెప్పడం వల్ల సరిగ్గా చదువు సాగడంలేదు. సమాన పరిస్థితులలో సమానంగా ఎదగడానికి బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ పేదలకు హాస్టళ్ళు , రెసిడెన్షియల్ స్కూళ్ళు సమాన పరిస్థితులలో సమానంగా ఎదగడానికి బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ పేదల కోసం హాస్టళ్ళు , గురుకుల పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ఇంటివద్ద లేని సౌకర్యాలు వీటిల్లో సమకూర్చడం జరుగుతూ వస్తున్నది. వీటి ద్వారానే బడుగు బలహీన వర్గాలు అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదుగుతూ వచ్చారు.

ఇవాళ ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఇలా ఎదిగివచ్చినవారున్నారు. గద్దర్ , గోరటి వెంకన్న , గూడ అంజయ్య , మల్లేపల్లి లక్ష్మయ్య , ఘంటా చక్రపాణి , ఐఏఎస్ అధికారులు బుర్రా వెంకటేశం , రామకృష్ణారావు వంటి వేలాదిమంది పేదలు వీటిల్లో చదువుకొని ఎదిగినవారే అని మరిచిపోకూడదు. ఈ సౌకర్యాలను మరింత ఉన్నత ప్రమాణాలతో పెంచాలని , ఉదాత్త ఆశయంతో ప్రభుత్వాలు కృషి చేయడం అవసరం.

బీసీ , ఎస్సీ , ఎస్టీ మేధావులతో చర్చలు జరపాలి


బీసీ , ఎస్సీ , ఎస్టీ మేధావులు , అధికారులు , రాజకీయ నాయకులు , ఉద్యమకారులు చేసిన అనేక పోరాటాలు , ఉద్యమాలు , అధ్యయనాలు అనుసరించి నేటి గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా దేశవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో తొట్టతొలుత గురుకుల పాఠశాలలను మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా , ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు.

ఆద్యుడు పి.వి. నరసింహారావు


పేదలనుండి సంపన్నులతో సమానంగా సకల సౌకర్యాలతో కొద్దిమందినైనా ఎదిగిస్తే వారి స్ఫూర్తితో ఆయా సామాజిక వర్గాల పేదలు ఎదుగుతారు. ఎదిగినవాళ్ళు , ఎదగాల్సినవారికి స్ఫూర్తినిస్తారు. చేయూతనిస్తారు అని భావించి ఇలా పెట్టడం జరిగిందని మాతో స్వయంగా పి.వి. నరసింహారావుగారు తన జీవితంలో చేసిన గొప్ప కృషిలో ఇది ఒకటిగా సగర్వంగా చెప్పుకున్నారు. కేంద్రంలో ఉన్నప్పుడు జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించడానికి కారకుడయ్యారు.

రాష్ట్రంలో , కేంద్రంలో , విద్యా , ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు కల్పించే అవకాశం చరిత్ర నాకే ఇచ్చిందని ఎంతో వినయంగా పి.వి. నరసింహారావు తన జీవితంలోని మధురమైన క్షణాలుగా గుర్తు చేసుకుంటూ చెప్పారు. తెలుగు మీడియం ప్రవేశపెట్టిన తర్వాత తెలుగులో పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి తెలుగు అకాడమి తానే ఏర్పాటు చేశానని పి.వి. చెప్పారు. ఇలా దశాబ్దాల ముందు చూపుతో పి.వి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమాజ పురోగతికి ఏర్పాటు చేయడం జరిగింది. అవి నేడు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలా తెలుగు నేల నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు స్ఫూర్తి విస్తరించింది.

తెలంగాణ ఉద్యమంలో జరిగిన మేధోమధనం నుండి పుట్టిన నేటి రెసిడెన్షియల్ స్కూళ్ళు తెలంగాణ ఉద్యమంలో జరిగిన మేధోమధనంలో భాగంగా పేదల అన్ని రంగాల్లో సమానంగా ఎదగడానికి రెసిడెన్షియల్ స్కూలే ఏకైకమార్గమని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీపడి ఎదిగితే తప్ప బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ పేద విద్యార్థులు ఆధునిక అభివృద్ధిలో భాగస్వామ్యం పొందలేరని ఈ సామాజిక వర్గాల నుండి వచ్చిన విద్యావంతులు , మేధావులు , ఉద్యమకారులు , రాజకీయ నాయకులు భావించారు. అలా ఎంతో లోతైన అవగాహనతో బహుముఖీన సామాజిక అధ్యయనాలతో రెసిడెన్షియల్ స్కూళ్ళను విస్తరించడం జరిగింది. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 30 ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళను 1100 లకు విస్తరించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక్కటి చొప్పున బాల బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఎంతోమంది మేధావుల మేధోమధనం నుండి పుట్టి విస్తరించినవే అని మరిచిపోకూడదు. ఇవాళ ఈ రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో ఐదున్నర లక్షల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఉన్నత విద్య దాకా ఎదుగుతున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీపడి అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు.

పేదలు ఎదగడం ఓర్వలేని కులాల భావాలు వేరు

ఇది చూసి ఓర్వలేనివాళ్ళు , తమ ఇళ్లల్లో పాచిపని , కూలిపని , పొలాల్లో బాల కార్మికులుగా పని చేయించుకోవడానికి పని మనిషి దొరకడం లేదని , కొందరు అగ్రకుల మేధావులు , నాయకులు కొత్త రూపాల్లో సిద్ధాంతాలు చేసి ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు అనే వాదన ముందుకు తెచ్చారు.

హాస్టళ్ళను , స్కూళ్ళను కలిపి రెసిడెన్షియల్ స్కూళ్ళుగా మార్చాలి

హాస్టళ్ళలో చదువుతున్న విద్యార్థులను , ఆ స్కూళ్ళను కలిపి రెసిడెన్షియల్ స్కూళ్ళుగా మార్చడం అవసరం. ఆ తర్వాత పెరిగే ఖర్చు అంటూ పెద్దగా ఏమీ లేదు. కానీ , విద్యాప్రమాణాలు , విద్యార్థుల నైపుణ్యాలు , సంస్కృతి , భాష , భావ వ్యక్తీకరణ , సృజనాత్మక శక్తి ఎంతగానో ఎదుగుతుంది. బీసీ , ఎస్సీ , ఎస్టీ శాఖల్లో భాగంగా యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలి రెసిడెన్షియల్ పాఠశాల , కళాశాల విద్యా వ్యవస్థ అక్కడితో ఆగిపోకుండా , బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ శాఖల బడ్జెట్ భాగంగా ఆయా శాఖల నిర్వహణలో విశ్వవిద్యాలయాలను ఏర్పర్చడం ద్వారానే ప్రైవేటు , కార్పొరేట్ రంగాలకు ధీటుగా 75 శాతంగా ఉన్న ఈ బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ పేద వర్గాల పిల్లలు పోటీపడి ఎదుగుతారు.

75 శాతం విద్యార్థులకు అదే స్థాయిలో దామాషాగా బడ్జెట్ కేటాయించడం అవసరం. అప్పుడు గ్రామీణ పాఠశాలలో చదివే పిల్లలకు రెండు కిలోమీటర్ల కన్నా దూరం ఉన్న పాఠశాలలకు వెళ్ళడానికి ఉచిత బస్సు పాస్ లు , సైకిళ్ళు ఏర్పాటు చేయడం అవసరం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలులో ఉంది. ఇలా పేద విద్యార్థుల ఎదుగుదల కోసం ప్రభుత్వంలో ఉన్న బడుగు , బలహీన వర్గాల అధికారులు , మంత్రులు , ముఖ్యమంత్రిని ఒప్పించడం అవసరం.

ఈ పిల్లల విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి , సంస్కరణల గురించి , బీసీ , ఎస్సీ , ఎస్టీ విద్యావంతులు , మేధావులు , ప్రజాప్రతినిధులు ఉద్యమకారులతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో కుల సమావేశాలు ఏర్పాటు చేయడం అవసరం. కలెక్టర్ ద్వారా వాటన్నిటిని సేకరించి తిరిగి రాష్ట్ర స్థాయిలో ఈ సామాజిక వర్గాల మేధావులతో , విద్యావంతులతో కలిసి కూర్చొని చర్చించి , నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అంతదాకా ఇప్పుడున్న పద్ధతే ఉత్తమం. అందరితో చర్చించే దాకా ఏ నిర్ణయం తీసుకోకూడదని కోరుతున్నాను



Tags:    

Similar News