Telangana| కాగితాల్లోనే కొత్త రైల్వే లైన్లు, పట్టాలెక్కని ప్రతిపాదనలు

రైల్వే బడ్జెట్‌లోనూ తెలంగాణకు మరోసారి తీరని అన్యాయం జరిగింది. కొత్త రైల్వే లైన్లు కాగితాలకే పరిమితం కాగా కొత్త రైలు సర్వీసులు పట్టాలెక్కలేదు.;

Update: 2025-02-04 01:20 GMT
ప్రతిపాదనల్లోనే కొత్త రైల్వే లైన్లు

రైల్వేశాఖ చూపిస్తున్న వివక్షతో తెలంగాణ రాష్ట్రం రైల్వే రంగంలో వెనుకబడి ఉంది. సర్వేల పేరుతో రైల్వే బోర్డు కాలయాపన చేస్తుందే కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు.దీంతో తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదనల్లోనే నిలిచాయి. కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, ట్రిప్లింగ్ కోసం రైల్వే మంత్రిత్వశాఖ నిధులు ఇవ్వకపోవడంతో తెలంగాణలో ఏళ్లు గడుస్తున్నా రైలు రవాణ రంగం మెరుగుపడటం లేదు.


సీఎం లేఖలు రాసినా కాగితాలకే పరిమితమైన కొత్త రైల్వే లైన్లు
మిర్యాలగూడ నుంచి పాపటపల్లి మీదుగా జాన్ పహాడ్ వరకు, డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది డిసెంబరు 11వతేదీదీన లేఖ నంబరు 596 రైల్వే శాఖ మత్రికి లేఖ రాశారు. సీఎం లేఖ రాసినా కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ స్పందించలేదు. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, చిట్లపల్లి, టేకల్ కోడ్, రావులపల్లి,మాటూర్, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మఖ్తల్ మీదుగా కృష్ణా వరకు కొత్త రైలు మార్గం నిర్మానానికి 100 శాతం నిధులను రైల్వే శాఖ ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది డిసెంబరు 11వతేదీన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు లేఖ రాసినా చలనం లేదు. విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి 2023 వసంవత్సరం డిసెంబరు 26వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూర్తి స్థాయి కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరితే రైల్వే శాఖ వర్క్ షాప్ నిర్మిస్తామని ప్రకటించింది.

రైల్వేబోర్డు పరిశీలనకే పరిమితం
కరీంనగర్-హసన్ పర్తి, డోర్నకల్- మిర్యాలగూడ కొత్త రైలు మార్గాలు నిర్మించడానికి రూ.7,840 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినా అవి రైల్వే బోర్డు పరిశీలనలకే పరిమితమయ్యాయి. వికారాబాద్-వాడి మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించాలనే ప్రతిపాదనలు కాగితాల్లోనే ఉన్నాయి.తెలంగాణలో ప్రతిపాదనల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు రూ.83,543 కోట్లు అవసరమని అంచనా వేయగా ఆశించిన మేర నిధులు విడుదల చేయలేదు.

9 జిల్లాకేంద్రాలకు రైలు మార్గాలేవి?
తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలకు ఇప్పటికీ రైలు మార్గాలే లేవు. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా కేంద్రాలకు రైలు మార్గాలు నిర్మించాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా రైల్వేశాఖలో చలనం లేకుండా పోయింది. ఆధ్యాత్మిక కేంద్రాలైన భద్రాచలం, రామప్ప, మేడారం పుణ్య క్షేత్రాలకు రైలు మార్గాలు లేవు.

అంచనాలు పెరిగినా మంజూరు కానీ రైల్వే ప్రాజెక్టులు
తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకు 122 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించేందుకు రూ.787 కోట్లు కావాలని అంచనా వేశారు. నిర్మాణ జాప్యంతో ఈ రైలుమార్గం నిర్మాణ వ్యయం రూ.2,196 కోట్లకు పెరిగినా ఇప్పటికీ ఈ ప్రతిపాదన రైల్వేబోర్డు వద్దే పెండింగులోనే ఉంది.కరీంనగర్ - హసన్ పర్తి వరకు 62 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మాణం రైల్వే మంత్రిత్వశాఖ వద్దే పెండింగులో ఉంది. హసన్ పర్తి నుంచి మణుగూరు, మేడారం, రామగుండం మీదుగా భూపాలపల్లికి రైలు మార్గం నిర్మించాలని అటవీ ప్రాంత ప్రజలు కోరుతున్నా కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అమృత్ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతున్నాయి.

పట్టాలెక్కని యాదాద్రి ఎంఎంటీఎస్ రైలు
హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ నిధులు విడుదల చేయలేదు. ఈ రైల్వే లైను నిర్మాణానికి రూ. 650 కోట్లు కావాలని డీపీఆర్ చేయగా, నిధులు రాలేదు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా చేపట్టాల్సిన ఈ ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు.హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు రెండో దశ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు.చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్థుతం ఒక్కటే ఎంఎంటీఎస్ చర్లపల్లి- సికింద్రాబాద్ వరకు నడుపుతున్నారు. చర్లపల్లిలో మరిన్ని రైళ్లను నిలిపితే ఈ ఏడాది మే నాటికి చర్లపల్లిని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో అనుసంధానం చేసేలా మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజాగా ప్రకటించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు ఆమోదించినా సర్వేకే పరిమితమైంది. సికింద్రాబాద్- కాజీపేట మూడో రైల్వే లైన్ నిర్మాణం రైల్వే బోర్డు వద్దే ఉంది. కొత్తగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా కొత్త రైల్వే లైన్ నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

తెలంగాణకు రూ.5,337 కోట్ల ప్రాజెక్టులు కేటాయించాం : రైల్వే మంత్రి ప్రకటన
తెలంగాణకు రూ.5,337 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు కేటాయించామని కేంద్ర రైల్వే వాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాజీపేట రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. కొన్ని రకాల అనుమతులు రానందువల్ల కాజీపేటలో పనుల్లో జాప్యం జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 1326 కిలోమీటర్ల కవచ్ ఉందని, దీన్ని మరో 1,026 కిలోమీటర్ల మేర రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు నడుపుతామని చెప్పారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే అధిక నిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.9,417 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఏపీ సీఎం సహకరిస్తున్నందున కొత్తగా ఏపీలో 1560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించామన్నారు.ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు.మంత్రి ప్రకటనలోనే ఏపీకి అధిక నిధులు కేటాయించి తెలంగాణను విస్మరించారని వెల్లడైంది.


Tags:    

Similar News