ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించారు.పాక్ ముష్కరులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతాన్ని విరాళంగా అందించాలని సీఎం రేవంత్ సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి విరాళం ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతను అప్పగించారు.దీనిపై సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు.ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూం
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం తెలంగాణ భవన్‌లో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూంలో నిరంతరాయంగా సేవలు అందిస్తామని అధికారులు చెప్పారు.
కంట్రోల్ రూంను సంప్రదించాలంటే...
కంట్రోల్ రూం ల్యాండ్‌లైన్ ఫోన్ నంబరు : 011-23380556,వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజాన్ హెడ్ – 9871999044, హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు – 9971387500,జి.రక్షిత్ నాయక్, లైజాన్ ఆఫీసర్ – 9643723157, సీహెచ్.చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 9949351270ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ కోరారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ భద్రత పెంపు
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అధికారులు శుక్రవారం ప్రయాణీకులకు సలహా జారీ చేశారు. అన్ని విమానాల్లో ప్రయాణానికి సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ తప్పనిసరి చేశారు.విమానాశ్రయాల టెర్మినల్ భవనాల వద్ద సందర్శకులను నిషేధించడంతోపాటు సాయుధ భద్రతను పెంచారు. పెరిగిన భద్రత చర్యల కారణంగా ప్రయాణీకులు విమానాశ్రయ భద్రతా నిరీక్షణ సమయాన్ని పెంచారు. విమాన ప్రయాణీకులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని కోరారు.ఉద్రిక్త పరిస్థితుల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో 27 విమానాశ్రయాలను మూసివేశారు. మరికొన్ని విమానాశ్రయాల్లో మెరుగైన భద్రతా చర్యలు అమలులోకి తీసుకువచ్చారు. పాక్ గగనతల అడ్డంకుల కారణంగా కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు.