తెలంగాణలోని 9 జిల్లాల్లో సోమవారం తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆమె తెలిపారు. 9జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆమె వెల్లడించారు. 9 జిల్లాలకు తాము ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు నాగరత్న వివరించారు.
14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలోని 14 జిల్లాలకు సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల కంటే అధికంగా గాలులు వీస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబరు మొదటి వారంలో మోస్తరు వర్షాలతో ముసురు ఉంటుందని ఐఎండీ తెలిపింది.
వారం రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 1వతేదీ సోమవారం నుంచి వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ప్రకటించారు.ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి,, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ జిల్లాల్లో 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు
హైదరాబాద్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబరు 2 నుంచి 6వ తేదీ వరకు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో భారీవర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల వరదలు వెల్లువెత్తే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ మ్యాన్ వివరించారు.