అన్ని వేళలా ఆపన్న హస్తం: నిర్మల్ పోలీసుల శివంగి దళం

ఒక చేత్తో తుపాకీ, మరో చేత చెలిమితో ప్రశంసలందుకుంటున్న ఆల్ విమెన్ కమాండోలు...;

Update: 2025-06-16 12:19 GMT
నిర్మల్ జిల్లా శివంగి మహిళా కమాండో దళం

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివంగి ఆల్ విమెన్ కమాండోలు శాంతి భద్రతల పరిరక్షణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివంగి కమాండోలు శాంతి భద్రతల పరిరక్షణలో విజయం సాధించారు. ఈ శివంగి టీం గడచిన రెండు నెలల్లో సాధించిన విజయాలు మహిళా లోకానికే స్ఫూర్తినిస్తున్నాయి.తాము ఆడపులులు కాదని, శివంగులమని చెబుతూ రెండు నెలల్లోనే మహిళా కమాండోలు అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లను విజయవంతంగా చేసి చూపించి శెభాష్ అనిపించుకున్నారు. విశేషమేమిటంటే, వీరంతా కమాండోలు అయినా చాలా సందర్భంగా చర్చలు ద్వారా శాంతియుతంగా ఉద్రికత్త సడలేందుకు కృషి చేయడం.




మహిళల ఆందోళన నేపథ్యంలో...

నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళన చేశారు. మహిళల ఆందోళనను నిరోధించడానికి మహిళా పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. జిల్లాలో జరిగే ప్రతీ ఆందోళనలు, ధర్నాల్లో మహిళలను ముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలతో కూడిన ప్రత్యేక బృందం అవసరాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వినూత్నంగా ఆలోచించి 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి, వారికి కఠోర శిక్షణ ఇప్పించి శివంగీ టీంగా నామకరణం చేశారు.జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో శివంగి బృందం విశిష్ఠ సేవలు అందిస్తుందని నిర్మల్ జిల్లా రిజర్వ్ ఇన్ స్పెక్టర్ రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

టాప్ 20 మహిళా పోలీసు కానిస్టేబుళ్లు
నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న వారిలో చురుకైన,సమర్ధత ఉన్న టాప్ 20 మహిళా పోలీసులను ఎంపిక చేసి, వీరికి పురుష కమాండోలకు ఇచ్చే శిక్షణ ఇచ్చారు.వర్టికల్ రోప్ క్లైంబింగ్, యుద్ధ తంత్రాలు, పోరాట నైపుణ్యం, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్ లాంటి శిక్షణలో వారి నైపుణ్యం బట్టి వివిధ బాధ్యతలు అప్పగించారు.



 పురుషులతో సమానంగా మహిళా కమాండోల సేవలు

నిర్మల్ జిల్లాలో మతకలహాలు, వర్గ ఘర్షణలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని సమర్ధంగా నిరోధించి జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యతను శివంగి టీంకు ఎస్పీ అప్పగించారు. పోలీసింగ్ లో మహిళా పోలీసులు పురుషులతో సమానంగా శివంగుల్లా పనిచేసేలా 20 మందితో శివంగి టీంను ఏర్పాటు చేశారు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకీ షర్మిల. ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆపరేషన్లను శివంగి టీంకు ఎస్పీ అప్పగిస్తున్నారు. మహిళా పోలీసులు శివంగుల్లా పనిచేసేలా ప్రత్యేక కమాండో దళాన్ని ఎస్పీ ఏర్పాటు చేయడంతో దీనికి శివంగి టీం అని నామకరణం చేశారు.దేశంలోని త్రివిధ దళాల్లో స్పెషల్ కమాండో ఫోర్స్, నేవీలో మార్కోస్ కమాండోస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, గ్రేహోండ్స్ లాంటి ప్రత్యేక కమాండో గ్రూపులున్నాయి. పురుష పోలీసు కానిస్టేబుళ్లకు దీటుగా మహిళా పోలీసులు పనిచేసేలే వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చి శివంగి కమాండోల బృందాన్ని ఏర్పాటు చేశారు.

శివంగి బృందం సక్సెస్
నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివంగి కమాండో బృందం ఏర్పాటు చేసినప్పటి నుంచి వీరు క్లిష్టతరమైన పలు ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. రెండు నెలల్లోనే శివంగి టీం పనితీరుపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. ముథోల్ మండలం బోరేగామ్ గ్రామంలోని ఆలయం ముందు ఉన్న వివాదాస్పద స్థలంలో బుద్ధ విగ్రహాన్ని ఒకవర్గం ఏర్పాటు చేసింది. ఆలయం ముందు బుద్ధ విగ్రహం ఏర్పాటును గ్రామస్థులందరూ వ్యతిరేకించారు. దీంతో ఆర్డీఓ రంగంలోకి దిగి వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన బుద్ధవిగ్రహాన్ని తొలగించారు. దీంతో కొందరు ఆందోళనకు దిగారు. బోరేగామ్ గ్రామంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడటంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల శివంగి టీంను రంగంలోకి దించారు. మహిళా కమాండోలు వచ్చి గ్రామస్థులకు నచ్చచెప్పి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించారు.
- నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో తరచూ ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సూచనతో శివంగి కమాండోలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని రిజర్వ్ ఎస్ఐ రవి నాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 కూలిన చెట్లను తొలగించిన శివంగి పోలీసు బృందం

నిర్మల్ పట్టణంలో తాజాగా భారీవర్షంతోపాటు గాలులు వీచి పలు చెట్లు కూలిపోయాయి.నిర్మల్ తహసీల్దారు కార్యాలయం వద్ద ఓ చెట్లు కూలిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడటంతోపాటు రెండు ఆటోలు, కారు, లారీలు దెబ్బతిన్నాయి.భారీవర్షం వల్ల బ్రహ్మపురి,షేక్ పేటతోపాటు పలు కాలనీలకు వెళ్లే రోడ్లు మూసుకుపోయాయి.అంతే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల 12 మంది శివంగి పోలీసు బృందాన్ని రంగంలోకి దించారు.దీంతో మహిళా కమెండోలు ఓ వృద్ధ మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అందరి ప్రశంసలందుకున్నారు. శివంగి టీం మహిళా కమాండోలు కూలిన చెట్ల కొమ్మలను నరికి వాటిని తొలగించారు. రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను మహిళా కమాండోలే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. విపత్తుల సమయంలోనూ మహిళా కమాండోలు సమర్ధంగా పనిచేస్తారని నిరూపించారు. భారీ వర్షాల నుంచి ప్రజలను రక్షించడానికి రాత్రింబవళ్ళు సేవలందిస్తున్న ధైర్యవంతులైన నిర్మల్ శివంగీ టీంకు నెటిజన్లు అభినందనల వర్షం కురిపించారు.



 కప్పనపల్లి కారడవుల్లో తప్పిపోయిన మహిళలు

నిర్మల్‌లోని మమడ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన నలుగురు గిరిజన మహిళలను వెతికే రెస్క్యూ ఆపరేషన్‌లో విజయవంతంగా పాల్గొనడం ద్వారా ఈ బృందం ఇప్పటికే కార్యాచరణ అనుభవాన్ని పొందింది.మామడ మండలం కప్పనపల్లిలో తునికాకు సేకరణ కోసం వెళ్లిన కూలీలు రాధ,కంబాల లింగవ్వ, గట్టు మేడిలక్ష్మీ, బత్తుల సరోజఅనే నలుగురు మహిళలు తప్పిపోయారు.రాత్రంతా గాలించినా నలుగురు ఆల్ ఉమెన్ స్పెషల్ పార్టీని ఎస్పీ రంగంలోకి దించారు.వర్షానికి నలుగురు నలుగురు మహిళలు దట్టమైన కారడవిలో చిక్కుకు పోయారని గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో శివంగి కమాండోలను రంగంలోకి దించారు.డ్రోన్లు, నూతన జీపీఎస్, వైర్ లెస్ సెట్ల సహాయంతో తప్పిపోయిన వారిని గుర్తించారు. ట్రాక్టరుపై ఇంటికి తీసుకువచ్చారు. అడవిలో కూంబింగ్ నిర్వహించి మహిళలను కనుగొని వారిని సురక్షితంగా ట్రాకర్లలో వారి ఇళ్లకు తరలించారు. శివంగీ టీం డ్రోన్ల సాయంతో కూలీలను గుర్తించి వారిని ట్రాక్లరులో వారి ఇళ్లకు చేర్చారు. శివంగి కమాండోలు తప్పిపోయిన తమ గ్రామ మహిళలను తీసుకొని రావడంతో గ్రామస్థులు జిల్లా ఎస్పీతోపాటు శివంగి టీంను సత్కరించారు.
- ప్రతీ ఆదివారం జరుగుతున్న అడెల్లు జాతరకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మహిళా భక్తులను క్రమబద్ధీకరించి వారి దర్శనం సజావుగా సాగేందుకు వీలుగా శివంగి కమాండోలకు జాతరలో బందోబస్తు విధులు అప్పగించారు.



 శివంగీ టీంను ప్రారంభించిన మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాలో శివంగి పేరిట తొలి మహిళా కమాండో యూనిట్ ను జిల్లా ఎస్పీ జి జానకీ షర్మిల ఏర్పాటు చేశారు. ఈ శివంగి కమెండో బృందాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 20వతేదీన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.ఈ శివంగి బృందంలో జిల్లా సాయుధ రిజర్వ్ విభాగానికి చెందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.శివంగి టీం కమాండోల పరేడ్ ను చూసిన మంత్రి సీతక్క వారిని అభినందించారు.

అన్ని జిల్లాల్లోనూ శివంగి టీంలు ఏర్పాటు చేయాలి : మంత్రి సీతక్క
అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏర్పాటు చేసిన శివంగి బృందాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు.స్పెషల్ కమెండోల లాగా ఎన్ ఎస్ జీ, ఎస్పీజీ, గ్రేహౌండ్స్ తరహాలో మహిళా కమాండోలను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఏర్పాటు చేశారు. ఈ శివంగి టీంను మంత్రి సీతక్క ఇటీవల ప్రారంభించారు.

శివంగి టీం సభ్యులకు కఠిన శిక్షణ
నిర్మల్ జిల్లా రిజర్వు పోలీసు విభాగానికి చెందిన 20 మంది మహిళా పోలీసులకు 45 రోజుల పాటు కఠిన శిక్షణ ఇచ్చి శివంగి పోలీసు టీంగా ప్రకటించారు. తమకు మార్షల్ ఆర్ట్స్, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే శిక్షణ,అధునాతన ఆయుధాలను ఉపయోగించే శిక్షణ ఇచ్చారని శివంగి టీంకు చెందిన ఓ సభ్యురాలు చెప్పారు. అధునాతన తుపాకులు, రివాల్వర్లతో కాల్పులు జరపడం, ఫీల్డు సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, అటవీ సంకేతాలు, నిఘా, ప్రతి దాడి వ్యాయామాలు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం, నిలువుగా తాడు సహాయంతో ఎక్కడం ఇలా ఒకటేమిటి కమాండోలుగా అత్యంత కఠిన శిక్షణ ఇచ్చామని నిర్మల్ జిల్లా ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు విభాగం ఎస్ఐ రవినాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నిర్మల్ జిల్లాలో శివంగి పోలీసు టీంకు అత్యంత అధునాతన శిక్షణ ఇచ్చి వారిని అత్యవసర పరిస్థితుల్లో మహిళా కమెండోల సేవలను వినియోగించుకుంటున్నామని ఎస్పీ జానకి షర్మిల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కాల్పులు జరపడం, నిఘా వ్యవస్థలో నైపుణ్యం పొందిన మహిళా పోలీసులు జిల్లాలో ప్రత్యేక కార్యకలాపాల్లో సేవలు అందిస్తున్నారని ఎస్పీ వివరించారు.

విపత్తు సహాయ పనులకు శివంగి టీం రెడీ
వర్షాకాలంలో వరదలు, భారీవర్షాలు లాంటి విపత్తులు సంభవించినపుడు నిర్మల్ జిల్లా శివంగి మహిళా కమాండోలను సమాయత్తం చేశారు. ఎయిర్ బోట్లు, లైఫ్ జాకెట్లు, గాలితో నింపిన గొట్టాలు , రెస్క్యూ రోప్ లను సిద్ధంగా ఉంచారు. భారీవర్షాల వల్ల నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు, చెరువులు పొంగి పొర్లుతూ లోతట్టుప్రాంతాలు మునిగిపోయే అవకాశమున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల శివంగి టీంకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రెడీగా ఉంచారు. విపత్తు సమయాల్లోనూ శివంగి టీం అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల చెప్పారు.



Tags:    

Similar News