రంగరాజన్‌పై దాడిని ఖండించిన కేంద్రమంత్రి
అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం అని పేర్కొన్నారు.;
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై 22 మంది దుండగులు దాడి చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను తేలికగా తీసుకోకూడదని, అర్చకుడిపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు.
‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్ గారు.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతాపార్టీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’’ అని కోరారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తుతున్న క్రమంలో కేంద్ర మంత్రి స్పందించడం కీలకంగా మారింది.