చిన్నపిల్లల విక్రయానికి చైన్ సిస్టమ్
చిన్నపిల్లల విక్రయ బాగోతంలో పలు విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు మూడంచెల చైన్ సిస్టమ్ బయటపడింది.
By : Saleem Shaik
Update: 2024-05-29 11:26 GMT
చిన్న పిల్లల విక్రయ బాగోతంలో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులకు తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లల విక్రయం కేసులో రాచకొండ పోలీసు బృందం ఇప్పటి వరకు 16 మంది చిన్నారులను రక్షించింది. వారిలో నలుగురు బాలురు ఉండగా మిగిలిన 12 మంది బాలికలు. మధ్య దళారులు విక్రయించిన పిల్లలను పోలీసులు కాపాడి వారిని హైదరాబాద్ జిల్లా ఛైల్డ్ ప్రొటెక్షన్ విభాగానికి అప్పగించారు. వారు చిన్నారులను మహిళా శిశు సంక్షేమశాఖ ఆధీనంలోని అమీర్ పేట శిశువిహార్ కు తరలించారు.
- ఢిల్లీ,ఫూణే నగరాల నుంచి 50 మందికి పైగా పిల్లలను ఈ ముఠా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి వారిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లలు లేని తల్లిదండ్రులకు భారీ మొత్తాలకు విక్రయించారని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పిల్లల విక్రయ ముఠా అత్యంత పకడ్బందీగా ఢిల్లీ, పూణే నగరాల నుంచి పిల్లలను తీసుకువచ్చి విక్రయించినట్లు తేలింది.
ఈ రాకెట్ ఎలా బయటపడిందంటే...
హైదరాబాద్ నగర శివార్లలోని మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఓ మహిళ రెండున్నరేళ్ల బాలికను విక్రయిస్తుందంటూ ఓ మీడియా రిపోర్టర్ మన్యం సాయికుమార్ అనే యువకుడు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. విలేఖరి ఫిర్యాదుపై హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాలికను రక్షించారు. బాలికను విక్రయించేందుకు యత్నిస్తున్న శోభారాణి, స్వప్న, సలీం అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించారు. పిల్లల విక్రయ ముఠాపై ఐపీసీ సెక్షన్ 81,87,88 జేజే యాక్ట్2015 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తీగలాగితే డొంక కదిలిందిలా..
ముందు పీర్జాదిగూడలో విక్రయిస్తున్న ఇద్దరు పిల్లలను రక్షించిన పోలీసులు నిందితులైన శోభ రాణి, సలీం, స్వప్న ఇంటరాగేట్ చేయగా పిల్లల రాకెట్ గుట్టు రట్టు అయింది. నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను కూడా విక్రయించినట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఇలా 16 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు.
ఢిల్లీ,పూణేలకు ప్రత్యేక పోలీసు బృందాలు
పిల్లల విక్రయ బాగోతం కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు 8మందిని అరెస్టు చేశామని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఢిల్లీ, పూణె నగరాల్లో ఉన్న పిల్లల విక్రయ ముఠా సభ్యులనూ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని సీపీ వివరించారు.
రూ.5.5లక్షలకు చిన్నారి విక్రయం
ఢిల్లీ, పూణే నుంచి ఏడాది లోపు ఉన్న పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితులు విక్రయించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.50 మందికి పైగా శిశువులను పై నిందితులకు సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ ముఠా ఏజెంట్లు పిల్లలను మధ్యవర్తుల సహాయంతో 1,80,000 నుంచి 5,50,000/- వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. ఒక్కో శిశువు విక్రయ ప్రక్రియలో మధ్యవర్తులు 50వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బును తీసుకున్నారని వెల్లడైంది. సంతానం లేని వారికి ఒక్కో చిన్నారిని రెండు లక్షల రూపాయల నుంచి రూ.5.5లక్షలదాకా విక్రయించారని సీపీ తరుణ్ జోషి తెలిపారు.
పిల్లల విక్రయ బాగోతంలో మూడంచెల చైన్
పిల్లల విక్రయ బాగోతం గుట్టుగా సాగించేందుకు ఈ ముఠా మూడంచెల చైన్ సిస్టమ్ ను పాటించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దూర ప్రాంతాలైన ఢిల్లీ, పూణే నగరాల నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి లేదా అతి తక్కువ డబ్బుకు కొనుగోలు చేసి వారిని గుట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు తరలించారు. విజయవాడలోని ముఠా సభ్యులు పిల్లల్ని విక్రయించేందుకు వారిని ఘట్ కేసర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న ముఠా సభ్యులకు పంపించారు. ఇక్కడ ముఠా సభ్యులు పిల్లలు లేని దంపతులను సంప్రదించి వారితో బేరసారాలు ఆడి అధిక డబ్బులకు పిల్లల్ని విక్రయించారు. ఈ మూడంచెల వ్యవస్థ పిల్లల విక్రయంలో వెలుగుచూసిందని ఈ కేసు దర్యాప్తు చేసిన మేడిపల్లి ఇన్ స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పిల్లల విక్రయం కేసులో పలువురిపై కేసులు
పిల్లల విక్రయం కేసులో పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మేడిపల్లి ఇన్ స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కేసులో ఏ వన్ గా పీర్జాదిగూడకు చెందిన శోభారాణి, ఏ 2గా చెంగిచెర్లకు చెందిన హేమలత అలియాస్ స్వప్న, ఏ3గా పీర్జాదిగూడకు చెందిన షేక్ సలీంలను అరెస్టు చేశామని ఇన్ స్పెక్టర్ చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఘట్ కేసర్ మండలం అన్నోజిగూడ ఆర్జీకే కాలనీకి చెందిన బండారి హరి హర చేతన్ బండారి పద్మ, విజయవాడకు చెందిన బల్గం సరోజ, ముదవత్ శారద అలియాస్ షకీలా పఠాన్,జగన్నాథం అనురాధ,పఠాన్ ముంతాజ్ అలియాస్ హసీనా, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముదవత్ రాజు,చర్లపల్లికి చెందిన యాత మమత ఉన్నారు.
పరారీలో కీలక నిందితులు
ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పూణెకు చెందిన కన్నయ్య ఉన్నారని తేలిందని మేడిపల్లి పోలీసులు చెప్పారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన కిరణ్, ప్రీతి, కన్నయ్య తదితరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందితురాలైన బల్గం సరోజ కోసం కూడా గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ నిందితుల్లో కొందరు గతంలో కూడా పిల్లల విక్రయంపై కేసులున్నాయని పోలీసులు వివరించారు.
రాచకొండ పోలీసుల ఘనత
పిల్లల విక్రయ రాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ పీవీ పద్మజ, ఏసీపీ ఎస్.చక్రపాణి, మేడిపల్లి పోలీసు అధికారులు ఆర్.గోవింద రెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐలు నర్సింగ్ రావు, అనిల్ కుమార్, మేడిపల్లి పోలీసు బృందం పిల్లల రాకెట్ కేసును వెలికితీశారు.
కొనుగోలు చేసిన తల్లిదండ్రులు ఆందోళన
13మంది పిల్లలను కొన్న వారి నుంచి రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. అయితే కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ రాచకొండ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తాము పెంచుకోవడానికే పిల్లలను కొనుగోలు చేశామని, వారిని తమకు తిరిగి అప్పగించాలంటూ కోరారు.
పిల్లల్ని పెంచుకోవాలనుకునేవారు చట్టబద్ధంగా దత్తత తీసుకోండి
పిల్లలు లేని దంపతులు పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే వారిని అక్రమ మార్గంలో కొనుగోలు చేయకుండా దరఖాస్తు చేసుకొని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఇండ్ల అక్కేశ్వరరావు సూచించారు. పోలీసులు రక్షించిన పిల్లల్లో 14 మందిని తాము అమీర్ పేటలోని శిశువిహార్ కు తరలించామని అక్కేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చిన్నారుల సంరక్షణ తమ శిశువిహార్ సిబ్బంది చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్థుతం శిశువిహార్ లో 200మంది చిన్నారులున్నారని, వారిని సెంట్రల్ అడాప్ట్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి దత్తత ఇస్తామని అక్కేశ్వరరావు వివరించారు.