కల్తీ ఆహారంలో తెలుగు రాష్ట్రాలు టాప్...జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోని దైన్యం

కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. దేశంలోనే మన తెలుగు రాష్ట్రాలు కల్తీ ఆహార విక్రయాల్లో ముందున్నాయి. దీనివల్ల మనం ఆహార భద్రత విషయంలో అత్యంత డేంజర్ పరిస్థితుల్లో ఉన్నామని తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే...

Update: 2024-02-12 13:07 GMT
Vegetables Adulteration

అభివృద్ధిలో ఎమో గానీ ఈ కల్తీ ఆహారంలో మాత్రం మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. కల్తీ ఆహారం తినడం వల్ల వేలాది మంది ప్రజలు కేన్సర్, గుండెపోటు బారిన పడటంతోపాటు మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రక్కసిని నిరోధించడంలో పాలకులు విఫలమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గుట్టుగా సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ బాగోతంపై ‘ఫెడరల్ తెలంగాణ’ సంచలన కథనం...

ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ నంబర్ వన్

భారతదేశంలో అత్యధిక ఆహార కల్తీ కేసులతో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలచింది. ఈ విషయాన్ని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. కల్తీ అనేది చాలా మందికి కనిపించే దానికంటే చాలా తీవ్రమైన సమస్య. కల్తీలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2022 దేశంలోని 19 ప్రధాన నగరాల్లో 291 శాంపిళ్లు కల్తీవని తేలగా, అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. 19 నగరాల్లో నమోదైన కేసులో 84శాతం కేసులు మన హైదరాబాద్ నగరంలోనే వెలుగుచూశాయి. దీంతో మన హైదరాబాద్ నగరం ఆహార భద్రతలో ఎంత ప్రమాదకర స్థానంలో ఉందో విదితమవుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలోని స్థానిక పోలీసులు ఆహార కల్తీకి వ్యతిరేకంగా క్రియాశీలక వైఖరిని అవలంబించడంతో పాటు పలు చోట్ల ఆహార కల్తీ పదార్థాలను సీజ్‌ చేశారు. యథేచ్ఛగా సాగుతున్న కల్తీ బాగోతంతో హైదరాబాద్‌లో అత్యధికంగా ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి.

ఆహార కల్తీతో తీవ్ర అనారోగ్యం

ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి హానీకరం. కల్తీ ఆహార పదార్థాల్లో హానీకరమైన రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌కు కారణమవుతున్నాయి. మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతోంది. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎముకలు దెబ్బతింటాయని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ ఏ రామ్మోహన్ రావు చెప్పారు. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్‌కు కారణమవుతుందని, కల్తీ ఆహారం వల్ల చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ పేర్కొన్నారు.

అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు కాదేది కల్తీకి అనర్హం...

మనిషి శరీరానికి కల్తీ ఆహారం అంత ప్రమాదకరం ఇంకా ఏదీ ఉండదు...అభివృద్ధి విషయంలో ఏమో గానీ కల్తీ విషయంలో మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ దేశంలో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి. అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ పదార్థాలే కనిపిస్తున్నాయి. మార్కెట్ లో ప్రతి వస్తువుని కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి కొందరు వ్యాపారులు తినే తిండి, తాగే నీరు, పీల్చుకునే గాలిని సైతం కల్తీ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆప్ ఇండియా విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2021-22లో రెండు తెలుగు రాష్ట్రాలు ఆహార కల్తీలో నంబర్ వన్, టూ స్థానాల్లో ఉన్నాయి.

అడ్డూ అదుపూ లేని కల్తీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తయారీ ప్రదేశాల్లో పరిశుభ్రత అసలు కనిపించడం లేదు. ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడటంతో కల్తీలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తేనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆప్ ఇండియా 2021-22లో విడుదల చేసిన ఆహార నాణ్యత సూచీలో దేశంలోని 17 ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ 15 వస్థానంలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నాయి. ఈ సూచీలో తెలంగాణకు 34.5మార్కులు, ఆంధ్రపదేశ్ కు 26 మార్కులు వచ్చాయి. అంటే కల్తీ ఆహార పదార్థాల్లో తెలుగు రాష్ట్రాలకు పాస్ మార్కులు కూడా రాలేదంటే ఇక్కడి ఎంతటి దైన్య పరిస్థితులు నెలకొన్నాయో తెలుస్తోంది.

తెలంగాణలో నామమాత్రంగా ఆహార తనిఖీలు

తెలంగాణ రాష్ట్రంలో ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు చేసేందుకు పది ల్యాబ్‌లున్నా అరకొర సిబ్బంది ఉన్నారు. ఉన్న ఫుడ్ ఇన్‌స్ఫెక్టర్లు కూడా సజావుగా పనిచేయడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని నాచారంలో ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు అధునాతన ప్రయోగశాల ఉంది. దీంతో పాటుజీహెచ్ఎంసీలో నాలుగు సంచార ఆహార నాణ్యత పరీక్షల ప్రయోగ శాలలు ఉన్నాయి. కానీ వీటిల్లో పరీక్షలు మాత్రం నామమాత్రంగానే సాగుతున్నాయి. తెలంగాణలో ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు చేసే సంచార లాబోరేటరీలపై కనీసం టోల్ ఫ్రీ నంబరు కానీ, ఫిర్యాదులు చేసేందుకు ఫోన్ నంబరు కాని ఇవ్వలేదని, కల్తీని నిరోధించాల్సిన ఫుడ్ ఇన్ స్పెక్టర్లకు చిత్తశుద్ధి లేదని కన్జ్యూమర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు ఆరోపించారు. ప్రమాదకరమైన ఆయిల్ తో వండిన ఆహార పదార్థాలను తినడం వల్ల ప్రజలు కేన్సర్ బారిన పడుతున్నారని డాక్టర్ హరిబాబు చెప్పారు.

అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ ముఠా గుట్టురట్టు

ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కానీ కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా వాటిపై చర్యలు తీసుకునే అధికారులు కొరవడ్డారు. పిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీములు, చాక్లెట్లు కల్తీ చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. కాసుల కోసం కక్కుర్తి పడి కేటుగాళ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కల్తీ చేస్తున్నారు. వారికి మనుషుల ఆరోగ్యం అంటే లెక్క లేదు. ప్రాణాలు అంటే పట్టింపు లేదు. విచ్చలవిడిగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను ఇటీవల రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు పట్టుకున్నారు. 

ఆహార కల్తీ అంటే ఏమిటి?

కొన్ని పదార్ధాలను జోడించడం ద్వారా ఆహారాన్ని కల్తీ చేయడం కొందరు వ్యాపారులకు నిత్యకృత్యంగా మారింది. నాణ్యత లేని ఉత్పత్తులు, ఈ కల్తీ పదార్థాలను కలపడం వల్ల ఆహారంలో పోషకాల విలువ తగ్గుతుంది. కొందరు వ్యాపారులు కాసుల కోసమే పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, మాంసం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పానీయాలు మొదలైన వాటితో సహా మనం రోజూ తినే అన్ని ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తున్నారు. పండ్లు వేగంగా పక్వానికి రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతున్నారు. కుళ్లిన పండ్లు, కూరగాయలను మంచి వాటితో కలుపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని సహజ,రసాయన రంగులను జోడిస్తున్నారు. ధాన్యాలు, పప్పుధాన్యాల్లో మట్టి, గులకరాళ్లు, రాళ్లు, ఇసుక, పాలరాయి చిప్స్ కలుపుతున్నారు.

నకిలీ మ్యాంగో కూల్ డ్రింకుల తయారీ

హైదరాబాద్ నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామికవాడలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న నకిలీ ముఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కుళ్లిన అల్లం, వెల్లుల్లి, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన నకిలీ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార ఉత్పత్తి ప్రక్రియలో అపరిశుభ్ర పరిస్థితులు, వ్యర్థ జలాలు, ప్రమాదకరమైన రసాయనాల వినియోగాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. కాటేదాన్ లో ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. లిటిల్స్ చాంప్స్ పేరుతో తయారు చేస్తున్న మ్యాంగో డ్రింక్స్ ను పోలీసులు సీజ్ చేశారు.

మార్కెట్‌లో రాజ్యమేలుతున్న కల్తీ పదార్థాలు

కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా వినియోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. పాలల్లో డిటర్జంట్‌ పొడి, యూరియా, గంజి కలిపి కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. ఐస్‌క్రీంలో వాషింగ్‌ పౌడర్‌లు, పండ్లపై మైనాన్ని పూతగా పూస్తున్నారు. ఉప్పులో సుద్దపొడి కల్తీగా వాడుతున్నారు.కల్తీని నిరోధించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరం చేసి ఆహార పరీక్షలు చేయాలని వినియోగదారుల రక్షణ మండలి మాజీ సభ్యుడు బోయపాటి వెంకటరమణ డిమాండ్ చేశారు. ప్రజల్లో కల్తీపై చైతన్యం తీసుకువచ్చి, ఆహార నాణ్యత పరీక్షలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాబోరేటరీలు ఏర్పాటు చేయాలని బోయపాటి వెంకటరమణ సూచించారు.

అమలు కాని చట్టాలు

ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు పలు చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006ను అనుసరించి ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నియంత్రణ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కల్తీని నిరోధించలేక పోతున్నారు. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆహార తయారీదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే తయారు చేసి, విక్రయిస్తున్నారు. ఆహార కల్తీ నిరోధక చట్టం ,1954 పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం,వంట నూనెల నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల చట్టం 1955 తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు.ఆహార నాణ్యతలో తనిఖీలు, విక్రయ కేంద్రాలకు లైసెన్సుల జారీ, శాంపిళ్ల సేకరణ, హెల్ప్ డెస్క్, ఎఫ్ఎస్ఎస్ ఏఐ సూచీలో తమిళనాడు రాష్ట్రం ముందుంది. తమిళనాడులో 400 ఫుడ్ సేఫ్టీ అధికారులున్నారు. అక్కడ ఆన్ లైన్ ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నారని వినియోగదారుల రక్షణ మండలి మాజీ సభ్యుడు బోయపాటి వెంకటరమణ చెప్పారు. తమిళనాడు తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ఆహార తనిఖీల ప్రక్రియను ముమ్మరం చేసి కల్తీని నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు.

కల్తీ ఆహారపదార్థాలపై ఫిర్యాదు చేయండి : హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్

కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై ప్రజలు తమకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ నగర ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఇటిక్యాల సుదర్శన్ రెడ్డి కోరారు. నాణ్యత ప్రమాణాలు లేని ఆహార పదార్థాలను ప్రజలు వినియోగించవద్దని ఆయన సూచించారు. కల్తీ ఆహార పదార్ధాల కట్టడికి ప్రజల సహకారం అవసరమని, తనిఖీలు చేస్తున్నప్పటికి పూర్తి స్థాయిలో కల్తీని అరికట్టలేకపోతున్నామని సుదర్శనరెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కల్తీ ఉత్పత్తిదారులు కొత్త కొత్త పేర్లతో మార్కెట్‌లోకి వారి ఉత్పత్తులను చేరవేస్తున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు.

Tags:    

Similar News