కొత్త వ్యాకరణం రాస్తున్న అతి చిన్నయ సూరి

ప్రసాద్ సూరి కొత్త నవల, ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ మీద తాడి ప్రకాష్ కామెంట్

Update: 2024-11-07 06:44 GMT


ఇది ప్రసాద్ సూరి అనే యువ రచయిత ప్రయాణం. ఈ ఏడాది మూడో నవల రాశాడు. ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్’ దాని పేరు. కొన్ని పువ్వులు పుట్టగానే ఠలాయిస్తాయి. తల ఎగరేస్తాయి. ఇపుడు ముదురుమాటలు మాట్లాడుతున్న ఆ లేత పువ్వు ఎలమంచిలి దగ్గర రాంబిల్లి అనే పల్లెటూరిలో పూసింది. హైదరాబాద్‍లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నాలుగేళ్ళు బొమ్మలు నేర్చుకున్న అనుభవమే ఈ నవల. ఆకర్షణ, ప్రేమ, కామం, నిరాశ, కళాత్మకమైన విభ్రమమూ కలిసి ప్రవహించే ఒక మోహనదిలోకి మనల్ని లాక్కుపోతాడు.

పొందికైన ఆ వాక్యాల్లో ఒక జీవశక్తి ఏదో వుంటుంది. ప్రసాద్ పిరికి రచయిత కాదు. ముసుగులేమీ వుండవు. జీవితపు ఔన్నత్యాన్నీ, అల్పత్వాన్నీ పడుగూ పేకలుగా అల్లుకుంటూ పోతాడు. ఆ విద్య బాగా వంటబట్టిన ఈ కొంటె కుర్రాడు, నిజానికి - సజీవమైన పాత్రల్ని, నిస్సహాయులైన పాఠకుల్ని ఒకేసారి నరికి పోగులు పెట్టి, నవ్వుకునే శాడిస్ట్. She is suffering from a serious illness called సౌందర్యరాహిత్యం అంటాడొక చోట. ఆమె శరీరంలో ముందుగా ఏ భాగం మీద కన్ను పడుతుందో అక్కడే చూపు నిలిచిపోతుంది. అందువల్ల ఊర్లో ఆమె అందాన్ని పూర్తిగా చూసిన వాళ్ళే లేరు అంటూ గాథా సప్తశతిని గుర్తు చేస్తాడు. ఈ నవల ఆధునిక వాస్తవ జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బతుకులో, గొంతు దిగని కటిక చేదునీ, చమత్కార సంభాషణా చాతుర్యాన్నీ లాఘవంగా మేళవించి తెలుగు నవలకి ఒక కొత్త వ్యాకరణం రాస్తున్నాడీ అతి చిన్నయ సూరి!

కవులో రచయితలో అనకాపల్లిలోనో అనంతపురంలోనో వుంటే చాలదు. ఇంకా బరంపురం, విజయనగరం, శ్రీకాకుళంలో వున్నా కుదరదు. హైదరాబాద్ అనే పెద్ద కళాకేంద్రానికి వస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరు. ఆ ఎక్స్‌పోజర్ వేరు. పదేళ్ళ క్రితం బంజారాహిల్స్‌లోని ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వచ్చాడు ప్రసాద్ సూరి. పెయింటింగ్‍లూ, పుస్తకాల గురించి మాట్లాడాడు. ఇరవై ఏళ్ళ లోపు పిల్లలు చచ్చినా చదవని పుస్తకాలన్నీ శ్రద్దగా చదువుకున్నాడు. హైదరాబాద్‌లోనే కవి, రచయిత అనంత్ చింతలపల్లితో స్నేహం కుదిరింది. ప్రసాద్ రాతలు చదివి ముచ్చటపడిన ఛాయా మోహన్‍బాబు సూరి రాసిన రెండు నవలల్ని అచ్చు వేశాడు. బాగా చదువుకున్న దంపతులు శాంతా రామశర్మలు ఈ కుర్రాణ్ణి ఆదరించారు. సాయి పాపినేనితో కలిసి చర్చలూ, చరిత్ర అధ్యయనమూ చేశాడు. మాసబ్‍ట్యాంక్ దగ్గర వుండే ఫైన్‍ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు ఈ యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించారు. కవయిత్రి శోభాభట్, ఉషా జ్యోతి బంధం, రచయిత్రి కుప్పిలి పద్మ, తల్లావఝల శివాజీ, మందలపర్తి కిషోర్, లైబ్రేరియన్ కడుపు గంగాధర్, ఇంగ్లీషు మేష్టారు డాక్టర్ రఘు, అరుణాంక్ , సూఫీ, వెంకట్ శిద్దారెడ్డి, మహీ బెజవాడ లాంటి అనేకుల్ శభాష్ అని భుజం తట్టారు.

చరిత్ర, రాజకీయాలు, ప్రేమ, విప్లవం, వ్యక్తిత్వ వికాసం... కథలు, కవిత్వం, నవల... పుస్తకాలు వచ్చి పడుతూనే వుంటాయి. ఏది చదవాలి? ఎవరి రచనలు ఎంచుకోవాలి? అనే దానిపై ప్రసాద్‍కి పిచ్చి క్లారిటీ వుంది. వెయ్యి పేజీల ఇంగ్లీషు పుస్తకాన్ని ఐనా ఏకబిగిన చదివే అలవాటూ, దానికి కావాల్సినంత వోపికా వున్నాయి. కరణం సుబ్రహ్మణ్య పిళ్ళే సాధికారికంగా రాసిన ఒక చారిత్రక నవల ‘బోయ కొట్టములు పండ్రెండు’, సాధు సుబ్రహ్మణ్య శర్మ రాసిన ‘బంకోలా’ చదివి వున్నాడు. సాయి పాపినేని రాసిన ‘ఆంధ్రపథం’, ‘ఆంధ్రనగరి’ చదివిన సూరి, చరిత్ర చీకటి వీధుల్లో నక్షత్ర కాంతిని కళ్ళల్లో నింపుకున్నాడు. ‘ఇతను మా రచయిత’ అని భారతదేశం తలెత్తి చెప్పుకోగల అమితావ్ ఘోష్ ఐబిస్ ట్రిలజీ - Sea of poppies, River of Smoke, Flood of fire వరసబెట్టి చదివి పులకించిపోయాడు.

పాతవీ, కొత్తవీ పుస్తకాలు కొనడమూ, చదవడమూ ఇతని ప్రధాన వ్యాపకం. కళ, నవల - ప్రసాద్ కవలపిల్లలు. సినిమా ఇతని ఊహా ప్రేయసి! ఇక పాటలూ, సంగీతమూ, వెబ్ సిరీస్‌లూ, ఆర్ట్ ఫిల్మ్‌లూ, క్రైం, కమర్షియల్ బ్లాక్‍బస్టర్‍లూ ఈ యువ హృదయానికి పట్టిన మల్టీడైమన్షనల్ పిచ్చి! ఉత్తమాభిరుచీ, నిరంతర అధ్యయనం, రాయకుండా వుండలేనితనమూ ఇతన్ని కుదురుగా వుండనివ్వవు. ప్రసాద్ సూరి చేతిలో వాక్యం అంత హొయలు పోవడం వెనక ఇంత రెస్ట్‌లెస్‍నెస్ వుంది.

New arts have been born in the course of the history of the man అన్నాడు Ralph Fox. తెలుగు నవల శతజయంతి సంవత్సరం 1978. ఆ తర్వాత 40 ఏళ్లు గడిచిపోయాక ప్రసాద్ సూరి మూడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నవలల్తో మన ముందుకి వచ్చాడు. తొమ్మిదీ, పదీ చదువుతున్నప్పుడు ఎలమంచిలిలోని దుర్భరమైన బీసీ హాస్టల్లో దిక్కుమాలిన జీవితంలోనూ చిన్నచిన్న సరదాల్ని కుర్రాళ్ళు ఎంజాయ్ చేసిన ప్రసాద్ తొలి నవల ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి!’ రాంబిల్లి అనే మారుమూల గ్రామంలో, పేద గంగపుత్రుల కుటుంబంలో, సుతరామూ అక్షరాలు కూడా రాని తలిదండ్రులకు పుట్టిన వరప్రసాదమే మన సూరి. బెస్తలూ, గంగపుత్రులూ అని కాకుండా వీళ్లది వాడబలిజ కులం. వీళ్ళ పూర్వీకులు ఆ రోజుల్లోనే గొప్ప నైపుణ్యంతో ఓడలు తయారు చేయడంలో ప్రసిద్ధహస్తులు! వాడబలిజల రోజువారీ బతుకులోని ఎమోషనల్ టర్మాయిల్ని ఒక ఉద్వేగంతో రాసిందే, ప్రసాద్ రెండో నవల ‘మైరావణ.’ మూడో నవల ‘ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ చదివి, “ఓహ్! వీడు కదా రచయిత అంటే” అని మురిసిపోయిన ప్రసిద్ధ రచయితా, ప్రపంచ సినిమా స్పెషలిస్టు వెంకట్ శిద్దారెడ్డి, 20 వేల రూపాయల బహుమతి యిచ్చి గౌరవించాడు.

ఒక యవ్వనోద్రేకంలో ప్రేమించి, కామించి, మోహించిన క్షణాలన్నీ కరిగి నీరై ఒక తెల్లవారుజామున మోసం ముసుగు తొలగించిన విషాదం నీ తలుపు తడితే ఏమౌతుంది? నవ్వించి, వూరించి, ప్రేరేపించిన ప్రియురాలు చివరికి, కాదు కాదంటే ఎవరైనా ఏమైపోవాలి? జీవితంలోని ఘర్షణనీ, వైరుధ్యాల్ని, ఎడతెగని వేదననీ విస్తృతంగా చెప్పడానికి ఉపయోగపడే ఒక పెద్ద కేన్వాసు నవల! ప్రపంచమంతా తెలిసిన స్టార్ పెయింటర్ పాల్ గాగిన్ ప్రేమకథ నించి, అజంతా గుహల కుడ్య చిత్రాల సౌందర్యం నుంచి... తన జీవితానుభవం, విన్నవీ, కన్నవీ - ఆరేడు లవ్‍స్టోరీస్‍ని చాకచక్యంగా కలిపి, నిజాయితీగా, నిర్మమకారంగా చేసిన ఆడియో విజువల్ ప్రెజెంటేషనే ఈ బ్రహ్మచారి బతుకు!

ప్రసాద్ మంచి చిత్రకారుడు. లేత పూల తీగల్లాంటి నాజుకు గీతలతో బొమ్మకి జీవ కళని అద్దుతాడు. రంగుల మహత్యమూ, సౌందర్య రహస్యమూ, వయోలిన్ తీగల కన్నీటి గానంలోని మాధుర్యమూ తెలిసినవాడు. తన నవలలకి కవర్ పేజీలు తానే వేసుకుంటాడు. హైదరాబాద్ లో నాలుగేళ్ళు బి. ఎఫ్. ఎ. పూర్తి చేసి ఇపుడు బరోడాలో ఆర్కియాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఈ జెనెక్స్ కుర్రకుంక వయసు 24 ఏళ్లు మాత్రమే!

జీవితం వాస్తవమా? కలా? నెత్తురోడే విషాదమా? వట్టి కట్టు కథా? కల తర్వాత మేలుకున్నప్పుడు, నిద్ర ముందు జీవితాన్ని ఎక్కడ వదిలావో, ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనుక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల అయింది. అంటే అబద్ధం అయింది. కల జరిగిన తర్వాత కొనని అందుకోలేకపోతే ఈ జీవితం కేవలం కల కాదా? అనే తాత్విక ప్రశ్న ఈ నవలలో మనల్ని కలవరపరుస్తుంది.

ఇక్కడో మధ్య ప్రాచ్యపు కథ చెబుతాడు రచయిత. ఆది యందు నిద్రకి పిల్లలున్నారు. వాటిని కలలు అనేవారు. ఒక సాయంకాలం నిద్ర తమ పిల్లల్ని తీసుకుని సముద్రం వొడ్డున షికారుకు వెళుతుంది. పిల్లల్ని నావ ఎక్కించి అలల్ని చూస్తూ వుంటుంది. హఠాత్తుగా వచ్చిన తుఫాన్ అల్లకల్లోలం చేస్తుంది. నావ ముక్కలై పోతుంది. విసుగు అనే ఇసుక ద్వీపంలోకి కలల్ని విసిరేస్తుంది తుఫాన్. ఐనా, పిల్లల్ని కట్టడి చేయడం ఎంత కష్టం. విసుగు ద్వీపం నుంచి రాత్రి వేళల్లో తప్పించుకువెళ్లే ఆ కలలు మానవ మస్తిష్కాలలో ప్రవేశించి, ఆడుకుని వస్తాయి. ఈ పురాతన జానపద గాథ సూరి శక్తివంతమైన కథనాన్ని కొత్త వెన్నెల దారుల్లో నడిపించింది.

యువరక్తం పొంగుతున్న ప్రసాద్ సూరి, రచయితలుగా చెలామణి అవుతున్న అనేకమంది నేలబారు, చవకబారు, బిలో యేవరేజ్ గాళ్ళ వీపులు పగలగొట్టబోతున్నాడు. నేరేటివ్‍లో శక్తి లేని, కొత్త అభివ్యక్తి లేని సంప్రదాయ ఎండుగడ్డి వాముల్ని అక్షరాల జ్వాలా తోరణాలతో తగలబెట్టబోతున్నాడు.

త్వరలో ‘శివమ్’ అనే సెన్సేషనల్ నవలతో మన ముందుకు రాబోతున్నాడు. ఇతనేవేవో ఘనకార్యాలు చేయాలని రాసి పెట్టి వున్నట్టే నాకనిపిస్తోంది.







Tags:    

Similar News