మరోసారి నెత్తురోడిన కశ్మీర్.. కేంద్రం సీరియస్
ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.;
జమ్మూకశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల తుపాకుల పేలుళ్లు మరోసారి అనంతనాగ్ జిల్లాను కమ్మేశాయి. అనంత్‌నాగ్ జిల్లా పహల్గంలో పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో మహిళలు కాకుండా పురుషుల టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకున్న ఉగ్రవాదులు పర్యాటకులపై తమ ప్రతాపం చూపారు. అమాయకులను భయపెట్టి హతమార్చారు. ఈ అంశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడినట్లు, కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రంపై టీఎంసీ తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాల కోల్పోడానికి భద్రతా వైఫల్యమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ ఆరోపించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేవారు.
"జమ్మూ కశ్మీర్‌లో అన్నీ బాగానే ఉన్నాయి' అన్న వాదనలు కట్టిపెట్టండి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ" టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఎక్స్ వేదికగా స్పందించారు.
"పుల్వామా ఘటన తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌కి సమాచారం ఉన్నా, ఎందుకు ఆపలేకపోయారు?," అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రాత్యా బసు పోస్ట్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టుపెట్టాల్సిందేనని పేర్కొంటూ..
కాశ్మీర్‌లో చిక్కుకున్న కర్ణాటక పర్యాటకులను తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
కాగా విషాద సమయంలోనూ పార్టీలు రాజకీయాలు చేయడం మంచిదికాదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి సుకాంత మజుమ్దార్ స్పందించారు. ‘‘కేంద్రం, భద్రతా సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులను వదిలిపెట్టరు" అని చెప్పారు.
ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు పర్యాటకులు కూడా మృతిచెందారు. ముంబై, పుణెకు చెందిన హేమంత్ జోషి, అతుల్ మోనె, సంతోష్ జాదగాలే, కౌస్తుభ్ గన్బోటే, సంజయ్ లెలే, దిలీప్ దేశాలే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పహల్గాం వద్ద మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరికొంతమంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా ముగ్గురు అనుమానితుల ఊహా చిత్రాలను సోలీసులు విడుదల చేశారు. ఉగ్రదాడిలో అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురూ గతంలో పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) మంగళవారం మధ్యాహ్నం ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
ఉగ్రదాడిలో మృతి చెందిన జెఎస్ చంద్ర మౌళి మృతదేహం బుధవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనుంది. ఏపీ చంద్రబాబు నాయుడు ఐదు రోజుల యూరోప్ పర్యటన తరువాత మంగళవారం ఢిల్లీలో అధికారిక సమావేశాలు ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చారు. రేపు ఆయన వైజాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందిలో తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతిచెందారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. మృతుల్లో బైష్ణబ్‌ఘటాకు చెందిన బితన్ అధికారి, కోల్‌కతాలోని సఖేర్‌బజార్ చెందిన సమీర్ గుహ, పురూలియా జిల్లా ఝాల్దాకు చెందిన మనీష్ రంజన్ ఉన్నారని పేర్కొన్నారు. తమ అధికారులు బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు వారితో టచ్‌లో ఉన్నారని, రాత్రి 8.30కి విమానం కోల్‌కతాకు చేరుకునే అవకాశం ఉందని మమత చెప్పారు.
ఉగ్రదాడిని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాన్ ఖండించారు. పార్టీ జెండాను అవనతం చేసి, రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు. "దాడి అమానుషం. ఉగ్రవాదానికి నాగరిక సమాజంలో స్థానం లేదు." అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్మూ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారులు బంద్ పాటించారు. జన జీవనం స్తంభించింది. ప్రజా రవాణా స్తంభించింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు తక్కువగా నమోదైంది. జమ్మూ బార్ అసోసియేషన్ బంద్‌కి మద్దతిచ్చింది.రియాసి, ఉదంపూర్, కత్రా, కఠువా, సంబా జిల్లాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది. జమ్మూ నగరంలో పలుచోట్ల ప్రజలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్‌లోని సోనౌలి వద్ద భారత్-నేపాల్ సరిహద్దుల్లో బుధవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కదలికలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు, గూఢచారి విభాగాలు గట్టి నిఘా ఉంచాయని ఎస్పీ సోమెంద్ర మీనా తెలిపారు. బార్డర్ చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నామని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు.
AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉగ్రదాడిని ఖండించారు. ‘‘మతాన్ని తెలుసుకుని ఉగ్రవాదులు అమాయకులు చంపడం నిజంగా ఇది బాధాకర ఘటన. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి. ఉగ్రవాదుల్ని తగిన గుణపాఠం చెప్పాలి.’’ అని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఒవైసీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.