బిఆర్ ఎస్ కారు టిఆర్ ఎస్ కు తిరిగొస్తుందా!

కొత్తొక వింత.. పాతొక రోత అంటుంటారు. అలాంటిది ఇప్పుడు రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటున్నారు ప్రస్తుత బీఆర్ఎస్‌ నేతలు. అదెలాగంటే..

Update: 2024-01-12 13:19 GMT

భారతీయ రాష్ట్ర సమితి-బీఆర్‌ఎస్‌- మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితీ- టీఆర్‌ఎస్‌గా మారనుందా? బీఆర్‌ఎస్‌ పేరు కలిసి రాలేదా? టీఆర్‌ఎస్‌గా ఉన్నప్పుడే బాగుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది పార్టీ నేతల నుంచి. మాజీ మంత్రి కడియం శ్రీహరి వంటి సీనియర్‌ నేతలు సైతం బీఆర్‌ఎస్‌ పేరు మారిస్తేనే బాగుంటుందని బాహాటంగానే ప్రకటించారు. ఆయన్ను అనుసరిస్తూ మరి కొంతమంది..


నాయకులు కూడా బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చాలని పార్టీ అధినేత కే.చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ నిర్ణయంపై.. బీఆర్‌ఎస్ అధినేత.. కేసీఆర్ ఎలా స్పందిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

టీఆర్‌ఎస్‌ పేరే జనం మదిలో ఉందా?


2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గత 23 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. పార్టీ చేపట్టిన ఉద్యమంతో 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. 2018లో జరిగిన మలి ఎన్నికల్లోనూ విజయపతాకాన్ని ఎగురవేసింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రెండోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చినా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్.. 2022 అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడంతో పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది.

బీఆర్‌ఎస్‌ పేరిట పలు రాష్ట్రాలలో కేసీఆర్‌ పర్యటన...

పార్టీ పేరు మార్చిన కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి.. పార్టీని విస్తరించే కార్యాచరణను అమలు చేశారు. మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ కార్యాలయాలను మొదలుపెట్టారు. ఇదే సమయంలో పార్టీ క్యాడర్ నుంచి పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. టీఆర్ఎస్ పేరు మార్చడంతో.. తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు. పార్టీ పేరు మార్పు ప్రభావం ఎన్నికలలో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంగా అధినేత కేసిఆర్ నేతల అభ్యంతరాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధినేతగా కెసిఆర్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించే యత్నం చేశారు.

ఓటమితో గుబులు...


ఈలోపే అంటే 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. బీఆర్ఎస్‌గా తొలి ఎన్నికల్లో అధికార పార్టీకి రాష్ట్రంలో ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్‌కు ఈ సమీక్షల్లో పార్టీ పేరు మార్పు పైన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ పెద్దలకు తమ అభిప్రాయాలను వినిపిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తెలంగాణ ప్రజలతో మమేకం అయిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో పేరు మార్చాలని డిమాండ్ పెరుగుతుండడంతో పార్టీ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడిందన్న చర్చ గులాబీ నేతల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్ గా మారుతుందా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. పార్టీ పేరును మార్చాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తే పార్టీ అధినేత కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరమే ఇందుకు సంబంధించిన నిర్ణయం ఉండవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News