ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమా..?

రాష్ట్రానికి మాంద్యం ముప్పుందన్న మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్.;

Update: 2025-08-14 16:02 GMT

శక్తివంతంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ తన చేతకాని తనంతో నావనం చేసిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ఆరోపణలు చేశారు. ఆర్థిక నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేయడంపై హరీష్ రావు, కేటీఆర్ స్పందించారు. దీనికి రేవంత్ సర్కార్ చేతకాని తనమే కారణమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందడం చాలా ప్రమాదకర సంకేతమని, దీనికి రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని వారు పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చొందని చురకలంటించారు. తొమ్మిదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ఆర్థికంగా చితికిపోయిందంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తగ్గిపోతున్న మూలధన పెట్టుబడి: హరీష్ రావు

‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల చేతుల్లో డబ్బు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం మూలధన పెట్టుబడి నిరంతరం తగ్గుతోంది. మూసీ, హైడ్రా వంటి నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి. వేలాది మంది ఉపాధి అవకాశాలపై ఇవి ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రధాన ప్రాజెక్ట్‌లు చేపట్టడం, ప్రజలకు డబ్బు అందుబాటులోకి తీసుకురాకపోవడం చేస్తే ద్రవ్యోల్బణం మరింతగా దిగజారి మాంద్యంలోకి వెళ్లే ప్రమాదముంది. సీఎం రేవంత్ ఇప్పటికయినా మేలుకోవాలి. ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజల గురించి ఆలోచించాలి’’ అని హరీష్ రావు చెప్పారు.

ఎనిమిది నెలల్లో అంతా అయిపోయింది: కేటీఆర్

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వరుసగా రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లడం ఇదే తొలిసారని మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు కేవలం ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలతోనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. జులైలో రాష్ట్ర ద్రవ్యోల్బణం -0.44శాతం ఉండగా, జాతీయ సగటు +2.10శాతంగా ఉందని గుర్తు చేశారు. జూన్‌లో రాష్ట్రంలో -0.93శాతంగా ఉంటే, దేశవ్యాప్తంగా +1.55శాతంగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఫ్లేషన్ (ద్రవ్యోల్బణం తగ్గుదల) మరింత తీవ్రంగా ఉందని కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News