కాంగ్రెస్ మొద్దునిద్ర వీడాలి: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాగు, తాగు నీరుకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు హరీష్ రావు.;
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాగు, తాగు నీరుకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో సోయిలేని ప్రభుత్వం అధికారంలో ఉందని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. గద్ద వచ్చి కోడిపిల్లను తన్నుకెళ్లినట్లు ఏపీ వచ్చి తెలంగాణకు రావాల్సిన వాటా జలాలను లాగేసుకుంటుందని, అయినా ఈ కాంగ్రెస్ సర్కార్.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి.
‘‘సాగర్ కుడి కాల్వ నుండి రోజుకు 10 వేల టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుంది. నీళ్ల మంత్రి నీళ్లు అమ్ముతున్నారు. చేతకాక చేవచచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడానికి మిమ్మల్ని గెలిపించారా? ఏపీ 650 టీఎంసీల నీళ్లను వాడుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి ఎందుకు ఫెయిల్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నీళ్లు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను ఏపీకి వదులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును అడిగే దమ్ము లేదు. రేవంత్ రెడ్డి వికారమైన భాషతో జానెడు, జానెడు ఎగురుతున్నారు’’ అని విమర్శలు గుప్పించారు హరీష్.
‘‘కృష్ణా నదిలో 1010 టీఎంసీల నీళ్లు వచ్చాయి. ఏపీ 650 టీఎంసీల నీళ్లు వాడింది. సాగర్ కుడి కాలువ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుండి ఏపీకి నీళ్లు వెళ్తున్నాయి. ఇంకా ఏపీకి 9 టీఎంసీలు, తెలంగాణకు 123 టీఎంసీల నీళ్లు రావాలి. క్రిష్ణా నదిలో కేవలం 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఏపీ నుండి రిటైర్డ్ సిఎస్‌ను తీసుకువచ్చి ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకున్నారు. సాగర్ ఎడమ కాలువ కింద 6 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేశారు. ఎస్‌ఎల్‌బీసీకి నీళ్లు రావాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌కు తాగునీళ్లు సాగర్ నుండే రావాలి’’ అని తెలిపారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. కేఆర్‌ఎంబీ కార్యాలయం ముందు ధర్నా చేయండి మేము వస్తాము. కేంద్ర జల్ శక్తి ఆఫీసు ముందు,ప్రధాన మంత్రి ఆఫీసు ముందు ధర్నా చేద్దాం పదండి. మీకు చేతకాక పోతే ధర్నాకు మేము వస్తాము. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళండి. సాగర్ నీళ్లను ఏపీకి తరలించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలి. శిష్యుడు తెలంగాణ సీఎంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నీళ్లను తరలిస్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు మూగబోయింది. తెలంగాణ నీళ్లు తరలిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు’’ అని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ సీఎం పరోక్షంగా జలదోపిడికి సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు త్రీమెన్ కమిటీ సమావేశం జరగలేదు. కృష్ణా బోర్డు కేంద్రం కంట్రోల్‌లో ఉందా ఏపీ ప్రభుత్వం కంట్రోల్ లో ఉందా. కేంద్ర జల్ శక్తి ఇంటి ముందు ధర్నా చేద్దామా,ప్రధాని ఇంటి ముందు ధర్నా చేద్దామా మీరు
డిసైడ్ చేయండి. బీజేపీకి ఎనిమిది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం లాభం. కిషన్ రెడ్డి తెలంగాణకు నీళ్లు తెస్తారా లేక చంద్రబాబు ఒత్తిడికి తలోగ్గుతారా. కృష్ణా నదీ జలాలపై కిషన్ రెడ్డి రివ్యూ చేయాలి. సాగర్‌లో నీళ్లు లేకపోతే కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్‌కు నీళ్లు రావు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం కంట్రొల్‌లో ఉంది. నాగార్జున సాగర్ సీఆర్‌పీఎఫ్ కంట్రోల్‌లో ఎట్లా ఉంటుంది’’ అని నిలదీశారు.
‘‘శ్రీశైలం ప్రాజెక్టును కేంద్రంకు అప్పగించండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోండి. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ విఫలం అయింది. మేము అనేక ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చాము. పాలమూరు ఎత్తిపోతల, వార్ధా, కాళేశ్వరం మూడవ లిఫ్ట్ డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను నిర్లక్ష్యం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జల్ శక్తి మంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి. కేసీఆర్ పట్టుబట్టి సెక్షన్ 3 సాధించారు’’ అని గుర్తు చేశారు.