‘తెలంగాణలో మీ పాలిటిక్స్ పనిచేయవు’.. రేవంత్‌కు హరీష్ రావు స్వీట్ వార్నింగ్..
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుందంటూ హరీష్ రావు చురకలంటించారు. ఎందుకంటే..
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. అన్ని వరగాల ప్రజలకు మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందంటూ చురకలంటించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరికీ మోసం చేశారని, ఇప్పటికీ వారికి న్యాయం చేస్తామన్న మాట సీఎం రేవంత్ నోటి నుంచి కానీ, మంత్రుల నోటి నుంచి కానీ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను, చేతకానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, వాటి నుంచి ప్రజల దృష్టిని మల్లించడం కోసం బీఆర్‌ఎస్ నేతలను, పార్టీని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు హరీష్. తెంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ రన్ చేయడానికి కాంగ్రస్ తెగ ఉబలాటపడుతోందని, కానీ రాష్ట్రంలో అవి పనిచేయవన్న సంగతి వారికి అర్థం కావట్లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, వందరోజుల్లో నెరవేరుస్తానని చెప్పి ఇప్పటికీ వాటి ఊసెత్తకుంటే ఎలా అని నిలదీశారు.
నిరుద్యోగులకిచ్చిన హామీ ఏది?
‘‘రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను ఉద్దేశించి అన్నారు. మరి వారికి ఇచ్చిన హామీ ఏమైంది? రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.. అదెంతవరకు వచ్చింది? అధికారంలోకి వచ్చి పది నెలల పూర్తైనా విద్యార్థులకు ఇంకా ఫీజు రియింబర్స్‌మెంట్ ఎందుకు చేయలేదు? ఇప్పటి వరకు కనీసం 20వేల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ ఇచ్చారా? కాంగ్రెస్ పాలన పట్ల వారు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఆనందంగా లేరు. రేవంత్ రెడ్డి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను కూడా మోసం చేశారు’’ అని చెప్పుకొచ్చారు హరీష్ రావు.
రైతుల దుస్థితి ఇది..
‘‘రాష్ట్రంలో గిట్టుబాటు రాకపోయినా తక్కువ ధరలకే ధాన్యం అమ్ముకునే దుస్థితికి రైతులు వచ్చారు. రైతులకు బోనస్ కాదు కదా కనీస గిట్టుబాటు ధర లభించడమే గగనంగా తయారైంది. పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జీవో 317ను ఈ ప్రభుత్వం ఇంకా పరిష్కరించలేదు. ఆఖరికి ఈ జీవో సమస్యపై కమిటీని నిర్మించడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగినా పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఇచ్చిన హమీలను ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని డైవర్షన్ పాలిటక్స్ చేస్తోంది కాంగ్రెస్. కానీ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి తెలంగాణలో అస్సలు పనిచేయవు’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని ఇప్పటికే విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థులంటే ఇంత చులకనగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు.
రేవంత్ ఏం చేయలేకున్నారు..
‘‘తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన అనేక పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించలేకపోతున్నారు. ఆఖరికి బతుకమ్మ చీరలను కూడా అందించలేకున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకపోయినా.. మా ప్రభుత్వ హాయంలో రైతుల కోసం రైతు బంధును అమలు చేశాం. అధికారంలోకి వస్తే రైతులకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్.. గతంలో ఉన్న రూ.10వేలు కూడా ఇవ్వలేదు. పత్తికి మద్దతు ధర రాకపోయినా సీఎం, మంత్రులు నోరుమెదపడం లేదు. అకాల వర్షాలతో ఇప్పటికే పత్తి రైతులు ఇబ్బందుల్లో ఉంటే గోరుచుట్టపై రోకలిపోటులా వారికి మద్దతు ధర కూడా లేదు’’ అని ఎద్దేవా చేశారు హరీష్ రావు.
మొద్దునిద్రలో ప్రభుత్వం
‘‘ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ రైతులు రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం మొద్దునిద్ర వదలడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాలే ప్రారంభం కాలేదు. వడ్లు కొనుగోలుకు మంత్రులు కొబ్బరికాయలు కొట్టడం తప్ప వాటిని కొనే దిక్కు లేదు. వడ్లకు రూ.2చ320 మద్దతు ధర రావాల్సి ఉండగా.. రూ.1800 నుంచి రూ.1900కే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. పత్తికి రూ.7,521 మద్దతు ధర రాకపోవడంతో రూ.5000 నుంచి రూ.5,500కే విక్రయించి నష్టపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు.
విద్యార్థుల ఉద్యమ బాట..
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు ఆరేళ్లుగా పెండింగులోనే ఉన్నాయి. ఆరేళ్లుగా రూ.8వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించక పోవడంతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. తమ విద్యా అవసరాలను పట్టించుకోకుండా వ్యవసాయ రుణమాఫీ, హైడ్రా వంటి పథకాలకు నిధులు ఎందుకు కేటాయించారని విద్యార్థులు ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.