KTR | కేటీఆర్ సింగిల్ పాయింట్ అజెండా ఒకటేనా ?
టైం టేబుల్ వేసుకున్నట్లుగా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)ని వ్యక్తిగతంగాను టార్గెట్ చేస్తున్నారు;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగిల్ పాయింట్ అజెండా ఒకటేలాగుంది. అదేమిటంటే సంబంధంలేకపోయినా సరే కాంగ్రెస్ పై బురదచల్లేయటం. ప్రతిరోజు ఏదో ఒక అంశంమీద టైం టేబుల్ వేసుకున్నట్లుగా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)ని వ్యక్తిగతంగాను టార్గెట్ చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమించిన ఇద్దరు ఎంఎల్సీల నియామకంపై సుప్రింకోర్టు స్టే పై కేటీఆర్ రియాక్షనే. 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్(BRS) హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణను ఎంఎల్సీలుగా నియమిస్తు కేసీఆర్ ప్రభుత్వం సిఫారసుచేసింది. అయితే దాసోజు, కుర్రా ఇద్దరూ రాజకీయనేతలే కాబట్టి వీళ్ళ నియామకాలను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు.
గవర్నర్ కోటాలో నియమితులయ్యేవారు ఏదైనా కళలు, లేదా రంగాల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయాలకు సంబంధంలేకుండా నిపుణులను చట్టసభల్లోకి పంపటానికి ఉద్దేశించిందే గవర్నర్ కోటా. అయితే కాలక్రమేణా ఆ కోటాకు గ్రహణంపట్టేసి రాజకీయనేతలే ఈకోటాలో కూడా ఎంఎల్సీలు అయిపోతున్నారు. కారణాలు ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం సిఫారసుచేసిన రెండుపేర్లను తమిళిసై ఆమోదించలేదు. ఫైలు పెండింగులో ఉండగానే ఎన్నికలు రావటం, బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగిపోయింది.
రేవంత్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న రెండుసీట్లను భర్తీచేసేందుకు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ పేర్లను సిఫారసు చేస్తే గవర్నర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గవర్నర్ సంతకం అయిపోగానే ఇద్దరూ ఎంఎల్సీలుగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. గవర్నర్ చర్యను చాలెంజ్ చేస్తు దాసోజు, కుర్రా కోర్టులో పిటీషన్లు దాఖలుచేశారు. దాని పర్యవసానమే తాజాగా సుప్రింకోర్టు కోదండరామ్, అమీర్ నియామకాలపై స్టే విధించింది. సుప్రింకోర్టు ఎప్పుడైతే ఎంఎల్సీల నియామకాలపై స్టే విధించిందో వెంటనే కేటీఆర్ రెచ్చిపోయారు. కాంగ్రెస్, బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని, తాజా తీర్పు కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టని ట్విట్టర్లో తెగ రెచ్చిపోయారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈహోలు మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఏమీలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరి పేర్లను సిఫారసుచేసింది కేసీఆర్. దాన్ని పెండింగులో పెట్టింది గవర్నర్ తమిళిసై. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు రేవంత్ కోదండరామ్, అమీర్ పేర్లను ఎంఎల్సీలుగా సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇదంతా రికార్డెడుగా జరిగిన వ్యవహారాలే. మరిందులో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేదేముంది ? సుప్రింకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు ఏమిటి ? ఇక్కడే మరో పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే తెరవెనుక నుండి గవర్నర్ కు చెప్పి దాసోజు, కుర్రాల అపాయింట్మెంట్ ను బీజేపీ అడ్డుకున్నది అనేందుకు ఆధారాలు కూడా లేవు.
అప్పట్లో గవర్నర్-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగుండేదన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. చాలా విషయాల్లో గవర్నర్ తమిళిసైని కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించారనే ప్రచారం జరిగింది. తన పర్యటనలకు ప్రభుత్వం ప్రోటోకాల్ కూడా పాటించలేదని గవర్నర్ అప్పట్లోనే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ స్ధాయిలో ఇద్దరి మధ్యా గొడవలవుతుండటంతో ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు తమఅధికారాలను చూపించేవారు. ఈ నేపధ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం పంపిన ఇద్దరి పేర్లకు తమిళిసై ఆమోదముద్ర వేయకుండా పెండింగులో పెట్టేశారు. వాస్తవం ఇదైతే కేటీఆర్ కాంగ్రెస్ పై బురదచల్లేయటమే విచిత్రంగా ఉంది. దీంతోనే కాంగ్రెస్ విషయంలో కేటీఆర్ సింగిల్ పాయింట్ అజెండా ఏమిటో అర్ధమైపోతోంది.