ఉన్నతాధికారులకు ఈడీ నయా నోటీసులు
ఈ-కార్ రేసు కేసు విచారణకు సంబంధించి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.;
ఫార్ములా ఈ-కార్ రేసు ఈడీ విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈకేసు విచారణకు సంబంధించి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారు జనవరి 8,9 తేదీల్లో విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పింది. అయితే ఫార్ములా కార్ రేసు విషయంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దీంతో ఈ అంశం మరిన్ని చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్.. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ గురువారం హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి.. విచారణకు డుమ్మా కొట్టారు. తనకు మరింత సమయం కావాలని ఈడీని కోరారు. ఆయన విజ్ఞప్తి ఈడీ కూడా సానుకూలంగా స్పందించింది. గంటల వ్యవధిలోనే అరవింద్ కుమార్ కూడా తానూ శుక్రవారం ఈడీ విచారణకు రాలేనని, తనకు కూడా మరింత సమయం ఇవ్వాలంటూ లేఖ రాశారు. ఆయన అభ్యర్థనను స్వీకరించిన ఈడీ అంగీకరించింది.
కాగా వారికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 8,9 తేదీల్లో విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఈసారి ఎటువంటి కారణాల వల్ల గైర్హాజరు కావొద్దని, తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనని ఈడీ నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కోరారు. అందుకు నిరాకరించిన ఈడీ.. వారి విచారణను జనవరి 8, 9 తేదీలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జనవరి 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.