రాజరికం పోయినా.. రాజసం తగ్గలేదు

75 ఎకరాల విస్తీర్ణం, 25 వేల చదరపు అడుగుల్లో నిర్మాణాలు, 20 గదులు, వ్యవసాయానికి ఉపయోగించిన ఊటబావులు, పరుచుకున్నపచ్చదనం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉన్న అందాలు..

Update: 2024-01-31 06:56 GMT
రాష్ట్రపతి నిలయం, బొల్లారం, సికింద్రాబాద్

గత ఏడాది మార్చి 23న సందర్శకుల కోసం బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని చూడడానికి అనుమతించారు. ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకూ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకుల కోసం తెరిచిఉంచుతారు. చివరి ఎంట్రీ  4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.



 


గత ఏడాది మార్చి లో సందర్శకుల కోసం అనుమతించిన తరువాత ఇప్పటి వరకూ దాదాపు 70 వేల మంది ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడి కట్టడాలు, ప్రకృతి అందాలు సందర్శకులను మరోలోకంలోకి తీసుకెళ్తున్నాయని మౌత్ టాక్ రావడం, ఫొటోలు, వీడియోలు షేర్ కావడంతో సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది.



 

డైనింగ్ హాల్ నుంచి వంటగదికి రావడానికి ప్రత్యేకంగా నిర్మించిన సొరంగ మార్గం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిలో తెలంగాణ సంస్కృతికే ప్రత్యేకమైన చేర్యాల స్క్రోల్ పెయిటింగ్ ఉంది. ఇది ఆ సొరంగ అందాన్ని ద్విగుణీకృతం చేసింది.



 

రాష్ట్రపతి నివాసం బయట ఉన్న రాక్ గార్డెన్, పచ్చదనం గురించి ఎంత చెప్పిన తక్కువే. పురాతన చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు మనల్ని అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడకుండా చేస్తాయి. వచ్చిన సందర్శకులు మొత్తం ఇక్కడే ఫొటోలకు ఫోజులు ఇస్తూ, సెల్పీ లు దిగుతూ ఆనందం పంచుకుంటున్నారు. 2007 నుంచి పచ్చదనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 27 నక్షత్రాలు, 9 గ్రహాల నమూనాలో పార్కును ఏర్పాటు చేశారు.



 

బ్రిటిష్ వారి కోసం అప్పటి నిజాం నజీర్ ఉద్ దౌలా దీనిని నిర్మించాడు. 1860 నిర్మాణం పూర్తి అయింది. ఈ భవంతి కట్టి దాదాపు 165 సంవత్సరాలు పూర్తి అయింది. అయినా దాని అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 1948 లో తిరిగి నిజాం ప్రభుత్వం తిరిగి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుంది. రూ. 60 లక్షలు చెల్లించి కేంద్ర ప్రభుత్వం దీనిని తన సొంతం చేసుకుంది. దీనికి ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ కు పోలికలు కాస్త కనిపిస్తాయి.



 

20 గదులు దాదాపు 150 మంది అతిథిలకు సరిపొయేలా వసతులు ఉన్నాయి. విజిటర్స్ క్వార్టర్స్, డైనింగ్ హాల్, దర్బార్ హాల్, మార్నింగ్ రూమ్, సినిమా హాల్ ఉన్నాయి. 2009 లో హెర్బల్ గార్డెన్ ను ప్రారంభించారు.



 



 

ఉత్తరాదిన ఉండే రాష్ట్రపతిని దక్షిణాదిన ప్రజలకు సైతం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ హౌజ్ ను రాష్ట్రపతి కి కేటాయించారు. ప్రతి శీతాకాలం కొన్ని రోజులు ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి గడిపి వెళ్లిపోతారు. మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలు ఎన్నికైన ప్రెసిడెంట్ లు అందరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.



 

2023 ఉగాది నాడు సందర్శకుల కోసం మొదటగా అనుమతి ఇచ్చారు. అంతకుముందు కేవలం రాష్ట్రపతికి తప్ప ఎవరికి కూడా అందులోకి అనుమతి ఉండేదీ కాదు. మొదటి సారిగా 2011 నుంచి 15 రోజుల పాటు సందర్శకుల కోసం అనుమతించారు. ప్రస్తుతం  365 రోజుల పాటు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రావచ్చు. భారతీయులకు రూ. 50 ఎంట్రీ ఫీజు, విదేశీయులకు రూ. 250 గా నిర్ణయించారు.

సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేట వెళ్లే రహదారిలో ఉన్న లోతుకుంటలో దిగితే అక్కడి నుంచి దగ్గరలోనే బొల్లారం రాష్ట్రపతి నిలయం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరం. మీకు వీలున్నప్పుడు మీరు ఓసారి సందర్శించి మైమరిచిపోండి. 

Tags:    

Similar News