ఆ మూడు విషయాల్లో కేటీఆర్ ఫెయిలయ్యారా ?
ప్రభుత్వాన్ని వ్యతిరేకించటంలో ఏమైనా లాజిక్ ఉందా అంటే చాలాసందర్భాల్లో గుడ్డివ్యతిరేకత తప్ప మరోటి కనబడటంలేదు;
ప్రతిపక్షం అంటే ప్రతివిషయంలోను ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అన్నట్లుగా తయారైంది. పోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటంలో ఏమైనా లాజిక్ ఉందా అంటే చాలాసందర్భాల్లో గుడ్డివ్యతిరేకత తప్ప మరోటి కనబడటంలేదు. దీనికి ఉదాహరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)) వ్యవహారమే. ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై బురదచల్లటమే పనిగాపెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు ఏవో ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. తాజాగా హెచ్సీయూ(HCU)లో 400 ఎకరాల వివాదం, నెమళ్ళు, జింకలు భయంతో పారిపోతున్నాయని, ఏడుస్తున్నాయన్న వీడియోలు, భూములను తాకట్టుపెట్టి రు. 10 వేల కోట్ల అప్పుతీసుకున్నారంటు ప్రతిరోజు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన గొడవవల్ల వివాదం జాతీయస్ధాయికి చేరుకున్నా అసలు నిజంఏమిటన్నది బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రయోగించిన ఆయుధాలన్నీ ఫెయిలైపోయినట్లు అర్ధమైపోతోంది.
మొదటగా హెచ్సీయూలో 400 ఎకరాల భూవిషయమే చూద్దాం. ఏ రాజకీయపార్టీ అయినా ప్రభుత్వాన్ని లేదా అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ఏదో ఒక ఇష్యూ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ప్రతిపక్షం పని కూడా అదేకాబట్టి బీఆర్ఎస్ ను తప్పుపట్టేందుకు ఏమీలేదు. అయితే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలన్న ఉద్దేశ్యంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ఒకటిరెండు రోజులు సంచలనం అయి తర్వాతైనా జనాలకు నిజం ఏమిటన్నది తెలిసిపోతుంది. ఇపుడు జరిగింది అదే. హెచ్సీయూకి చెందిన 400 ఎకరాలను ప్రభుత్వం ఎలాగ తీసుకుంటుందని మొదట విద్యార్ధులు తర్వాత యూనివర్సిటి ఉద్యోగులు గోలమొదలుపెట్టారు. దాన్ని బీఆర్ఎస్ హైజాక్ చేసేసింది. 400 ఎకరాలు యూనివర్సిటీవే అని అందులో వేలాది చెట్లు, వందలాది పక్షిజాతులు, పదులసంఖ్యలో జంతువులున్నట్లు(HCU Biodiversity) నానా గోలచేసేసింది.
వేలాదిచెట్లు, వందలాది పక్షిజాతులు, పదులసంఖ్యలో జంతువులు అనగానే పర్యావరణవేత్తలు, పక్షి, జంతుపరిరక్షణ సంస్థలు, సెలబ్రిటీలు, మేథావులు, విద్యావేత్తలు రంగంలోకి దిగేశారు. ఇంకేముంది ఇష్యూ జాతీయస్ధాయికి చేరుకోవటంతో సుప్రింకోర్టు సూవోమోటోగా కేసు నమోదుచేసి విచారణ మొదలుపెట్టింది. దాంతో భూముల వివాదంపై జాతీయస్ధాయిలో గందరగోళం పెరిగిపోయింది. 400 ఎకరాలు యూనివర్సిటీవి కావని, ఆ భూములన్నీ ప్రభుత్వానివే అని రేవంత్, మంత్రులు ఎంతమొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. వివాదం రేగిన ఐదురోజుల తర్వాత ప్రభుత్వం భూరికార్డులన్నింటినీ బయటపెట్టింది. రికార్డుల ప్రకారం 400 ఎకరాలే కాదు యూనివర్సిటీకి 1976లో కేటాయించిన 2300 ఎకరాలూ ప్రభుత్వానివే అన్నవిషయం బయటపడింది. యూనివర్సిటీ ఏర్పాటుచేసినపుడు ప్రభుత్వం 2300 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించినా భూములు యూనివర్సిటి పేరులో రిజిస్టర్ కాలేదు. దాంతో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లోనే యూనివర్సిటి నడుస్తోందన్న విషయం ఇపుడు బయటపడింది. పైగా ఇపుడు వివాదాస్పదమైన 400 ఎకరాలను 2003లోనే చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనేసంస్ధకు కట్టబెట్టాన విషయం, 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్(YSR) కేటాయింపులను రద్దుచేసిన విషయం బాగా హైలైట్ అయ్యింది.
కేటాయింపుల రద్దును సవాలుచేస్తు ఐఎంజీ హైకోర్టులో కేసువేసి ఓడిపోయింది. తర్వాత ఇదే కేసును విచారించిన సుప్రింకోర్టు కూడా సదరు 400 ఎకరాలు ప్రభుత్వానివే అని తీర్పిచ్చింది. సుప్రింకోర్టు తీర్పుతోనే ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే అని అందరికీ అర్ధమైంది. ఇదేసమయంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) రంగంలోకి దిగారు. విద్యార్ధులు, ప్రజాసంఘాలు, యూనివర్సిటి ఉద్యోగులతో సమావేశమయ్యారు. తర్వాత మంత్రుల కమిటీతో సమావేశమైనపుడు విద్యార్ధులపైన పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించేట్లుగా ఆదేశించారు. దాంతో ఆందోళనచేసిన విద్యార్ధులపైన పెట్టిన కేసులను పోలీసులు ఉపసంహరించేశారు. పోలీసులు కేసులను విత్ డ్రా చేసుకోవటంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. ఉద్యోగులు కూడా ప్రశాంతమైపోయారు. ప్రజాసంఘాలతో మాట్లాడిన మీనాక్షి వారి సందేహాలన్నింటినీ తీర్చేశారు. దాంతో పై మూడువర్గాలు ఆందోళనకు దూరమైపోయారు.
విద్యార్ధులు మొదలుపెట్టిన ఆందోళన ప్రశాంతమైపోతోందని అర్ధమవ్వగానే బీఆర్ఎస్ ఇష్యూని హైజాక్ చేయాలని ప్రయత్నించింది. సడెన్ గా సోషల్ మీడియాలో 400 ఎకరాలను బుల్ డోజర్లతో చదునుచేస్తున్నపుడు భయంతో పారిపోతున్న జింకలు, ఏడుస్తున్న నెమళ్ళుంటు వీడియోలను విడుదలచేసింది. ఈ వీడియోలు నాలుగురోజులు జాతీయస్ధాయిలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇలాంటి వీడియోలను సెలబ్రిటీలు కూడా బాగా ప్రచారంచేశారు. దాంతో రేవంత్ కు మండిపోవటంతో రంగంలోకి సైబర్ సెక్యూరిటి నిపుణులు దిగారు. రెండురోజుల్లో జింకలు, నెమళ్ళ వీడియోలన్నీ ఏఐ జనరేటెడ్ గా తేల్చేశారు. అంతేకాకుండా తప్పుడుపోస్టులతో ప్రభుత్వంపై బురదచల్లేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులపై కేసులు పెట్టారు పోలీసులు. దానిదెబ్బకు బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలోనే జింకలు, నెమళ్ళ వీడియోలు డిలీట్ అయిపోయాయి.
ఎప్పుడైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే వీడియోలు డిలీట్ అయిపోయాయో వాటిని రీపోస్టులు చేసిన వాళ్ళందరు సెలబ్రిటీలతో సహా తమఖాతాల్లోని వీడియోలను కూడా డిలీట్ చేసేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KishanReddy) కూడా సదరు వీడియోలను డిలిట్ చేశారంటేనే ప్రభుత్వంపై దుష్ప్రచరం ఏ స్ధాయిలో జరిగిందో అర్ధమైపోతోంది. తాము పోస్టుచేసిన వీడియోల్లోని జింకలు, నెమళ్ళు నిజమే అయితే బీఆర్ఎస్ తమ సోషల్ మీడియా నుండి ఆ వీడియోలను ఎందుకు డిలీట్ చేసింది ? అంటే ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం కూడా కేటీఆర్ కు రివర్సుకొట్టింది. ఇక మూడో విషయంగా 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖాపెట్టి ప్రభుత్వం రు. 10 వేల కోట్లు అప్పుతీసుకుందని కేటీఆర్ వరుసగా నాలుగురోజులు నానా గోలచేశారు. రు. 10 వేల కోట్ల రుణంపై ప్రభుత్వంపై బురదచల్లేస్తునే మరోవైపు బీజేపీలోని ఒక ఎంపీ బ్రోకర్ సంస్ధగా వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ పేరును తర్వాత ఎపిసోడ్ లో బయటపెడతానని చెప్పటం సంచలనమైంది.
అయితే కేటీఆర్ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించింది. ప్రభుత్వం తమదగ్గర ఎలాంటి భూములుపెట్టి అప్పే తీసుకోలేదని స్పష్టంగా ప్రకటించింది. తమదగ్గర ప్రభుత్వం భూములు తాకట్టుపెట్టింది లేదు తాము అప్పు ఇచ్చిందీలేదని స్పష్టంగా చెప్పటంతో కేటీఆర్ ఆరోపణలు అబద్ధాలే అని తేలిపోయింది. నిజంగానే ప్రభుత్వం ఎక్కడన్నా తప్పుచేసినా, అవినీతికి పాల్పడినా వదిలిపెట్టాల్సిన అవసరంలేదు. అలాగని ప్రభుత్వానికి సంబంధంలేని విషయాల్లో కూడా బురదచల్లేయాలని ఆరోపణలు చేస్తే ఒకటిరెండు రోజులు సంచలనమైనా తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇపుడు కేటీఆర్ వ్యవహారం ఎలాగ తయారైందంటే ‘అదిగోపులి అంటే ఇదిగోతోక’ అన్నట్లుగా తయారైంది. ప్రతిరోజు ప్రభుత్వంపై ఏదోఒక ఆరోపణ చేస్తున్న కేటీఆర్ ఏదో ఒకరోజు నిజంచెప్పినా జనాలు పట్టించుకోవటం మానేస్తారేమో. హోలుమొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించేందుకు కేటీఆర్ దగ్గర ఆయుధాలు ఏమీలేవని. మళ్ళీ కొత్తగా ఏదో ఆరోపణతో కేటీఆర్ మీడియా ముందుకు రాకమానరు. అప్పుడు చూడాలి ఆ ఆరోపణల్లో నిజమెంతని.