కొలనుపాక మ్యూజియంలో దూలంగా రాష్ట్రకూట జైన తోరణం

మ్యూజియం కట్టేటపుడు తోరణాన్ని గోడల్లో దేవాలయ ప్యానెల్స్ గా వాడినారు.

Update: 2024-09-05 05:45 GMT
కొలనుపాక తోరణం


తెలంగాణ రాష్ట్రం, యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ప్రసిద్ధ చారిత్రకప్రదేశం కొలనుపాకలో సోమేశ్వరాలయం ప్రాంగణంలో వారసత్వశాఖ మ్యూజియం ఉంది. మ్యూజియం కట్టేటపుడు దూలాలుగా రాష్ట్రకూటశైలి దేవాలయస్తంభాలు, జైనశాసనస్తంభాలు, ఒక ద్వారతోరణం, గోడల్లో దేవాలయ ప్యానెల్స్ వాడినారు. అవన్నీ చారిత్రాత్మకమైనవే. తెలిసో, తెలియకో వాటిని తోచినచోట పెట్టి, మ్యూజియమైతే కట్టారు.




 

36మంది కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుల క్షేత్రసందర్శన సందర్భంగా మ్యూజియాన్ని చూసినపుడు దక్షిణభాగం కప్పుకింద పెట్టిన రాతిదూలం ఒకప్పటి(8,9వ శతాబ్దాలు) కొలనుపాక పాలకులైన రాష్ట్రకూటులశైలి ద్వారతోరణం అగుపించింది. ఆ తోరణం కిందిభాగం కొంతచెక్కేసినట్లుంది. ఆ తోరణం మీద ధ్యానాసనస్థితిలో ముగ్గురు తీర్థంకరులు, వారి యక్ష, యక్షిణులు, ఇరువైపుల నుంచి రెండుమకరాల నోళ్ళ నుంచి తీగెలు, పూలు చెక్కివున్నాయి. ఈ శిల్పాల కిందుగా 5 కీర్తిముఖాలున్న అర్థవలయాలున్నాయి. తోరణంపైవైపు కుడులు కూడా చెక్కారు. ఇటువంటి తోరణమే రాజుగారి దర్వాజ అని పిలువబడే ‘గేట్ వే ఆఫ్ కొలనుపాక’ జైనాలయం వెనకవైపున ఉన్నది. దానిమీద శైవశిల్పాలున్నాయి. రెండు ఒకే విధమైన డిజైన్ తో చెక్కబడ్డ తోరణాలు. ఇన్నిరోజులు ఈ తోరణం ఎవరికంటపడవపోవడం ఆశ్చర్యం. ఈ తోరణం కొలనుపాకలో మరొక తోరణద్వారముందని చెప్పడానికి ఆనవాలు. 




 మ్యూజియంలో పెట్టివుండాల్సిన శిల్పాలు, శాసనాలు, తోరణం కప్పుకింద చేరడం పట్ల కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ విచారవ్యక్తం చేశారు.  వీటిని వారసత్వశాఖవారు వాటినక్కడ నుంచి తొలగింపజేసి, భద్రపరచాల్సిందిగా  ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News