తొందరలో పోలీసు ఎఫ్ఎం

తొందరలోనే హైదరాబాద్ వాసులకు సరికొత్త ఎఫ్ఎం స్టేషన్ అనుభవంలోకి రాబోతోంది. అదేమిటంటే పోలీసుల ఆధ్వర్యంలోనే ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు కాబోతోంది.

Update: 2024-08-29 06:30 GMT
Telangana police

అందరికీ, ముఖ్యంగా నగరవాసులకు ఎఫ్ఎం రేడియోస్టేషన్ సుపరిచయమే. దశాబ్దాల క్రితం మొదలైన రేడియోలు కనుమరుగైపోతున్న దశలో ఎఫ్ఎం స్టేషన్లు ఊపందుకున్నాయి. దాంతో ప్రతిరాష్ట్రంలో లెక్కకు మిక్కిలి ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటై జనాధరణ పొందాయి. అయితే ఈ ఎఫ్ఎంలన్నీ ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. నిర్వహణ, నిధులలేమి కారణంగా కొన్ని ఎఫ్ఎం స్టేషన్లు మూతపడినా చాలావరకు ప్రజాధరణ పొందిన విషయం వాస్తవం.

ఇపుడు విషయం ఏమిటంటే తొందరలోనే హైదరాబాద్ వాసులకు సరికొత్త ఎఫ్ఎం స్టేషన్ అనుభవంలోకి రాబోతోంది. అదేమిటంటే పోలీసుల ఆధ్వర్యంలోనే ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే ఉన్న ఇతర ఎఫ్ఎం స్టేషన్లకు ధీటుగా పోలీసులు కొత్త ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు నగర పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో కొత్త రేడియో స్టేషన్ పనిచేయబోతోంది.

నగర పోలీసుశాఖకు సొంతంగా ఎఫ్ఎం రేడియో లేకపోయినా ప్రైవేటు రేడియోల సంస్ధలతో కలిసి ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నగర ట్రాఫిక్ నిబంధనలు, నగరంలో ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఎలాగుంది, ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ప్రయాణించాల్సిన మార్గాలేమిటి ? ట్రాఫిక్ నిబంధనలు, ఉల్లంఘిస్తే జరిమానాలు తదితరాలపై జనాల్లో అవేర్ నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గణేష్ ఉత్సవాలు, బోనాల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో పోలీసులు ఎఫ్ఎం రేడియోను చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటారని తెలిసిందే. అంటే పోలీసు కార్యక్రమాలను ప్రైవేటు ఎఫ్ఎం స్టేషన్లను వేదికగా ఉపయోగించుకుంటున్నారు.

అవసరమైనపుడల్లా ప్రైవేటు స్టేషన్లను ఉపయోగించుకుంటున్న తమకు ప్రత్యేకంగా సొంతంగానే ఒక ఎఫ్ఎం స్టేషన్ ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో నుండి పుట్టుకొచ్చింది సిటీ పోలీసుకు ఎఫ్ఎం స్టేషన్. ఇప్పటివరకు కర్నాటక, గుజరాత్, కశ్మీర్ లో మాత్రమే పోలీసు, మిలిటరీకి ప్రత్యేకంగా ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు సొంతంగా 2019లోనే కమ్యూనిటి ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటుచేసుకున్నారు. అందులో వినోద కార్యక్రమాలతో పాటు ఖైదీల హక్కులు, ఖైదీల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, బెయిల్ నిబంధనల్లాంటి అనేక కార్యక్రమాలను అందిస్తున్నారు.

అలాగే గుజరాత్ రాజకోట్ సెంట్రల్ జైలు అధికారులు కూడా సొంతంగా ఎఫ్ఎం స్టేషన్ ను 2021లోనే ఏర్పాటైంది. ఈ స్టేషన్ నూరుశాతం ఖైదీల ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. ఇక్కడ కూడా ఖైదీల సంక్షేమం, ఖైదీల్లో చైతన్యం తీసుకురావటం, శిక్షలు, బెయిల్ లాంటి కార్యక్రమాలను అందిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కూడా కాశ్మీర్లోని బారాముల్లా, యూరీ సెక్టార్లలో సొంతంగా రేడియో స్టేషన్ ఏర్పాటుచేసుకుంది. ఈ స్టేషన్ను సైనికులే నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా సైనికులకు సంబంధించి, మిలిటరీతో పాటు త్రివిధ దళాల ప్రాధాన్యత, దళాల్లో చేరలదలచుకున్న యువతకు అవకాశాలు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

వినోదం+అవగాహన

నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటవ్వబోయే ఎఫ్ఎం స్టేషన్లో వినోదంతో పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇతర ఎఫ్ఎం స్టేషన్లో జనాలను ఆలరించటానికి ఎలాంటి వినోద కార్యక్రమాలను అందిస్తున్నారో పోలీసు ఎఫ్ఎం స్టేషన్లో కూడా అవన్నీ ఉంటాయని కమీషనర్ చెప్పారు. వినోదంతో పాటు పోలీసు శాఖకు సంబంధించి జనాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా అందించబోతున్నట్లు చెప్పారు. రోడ్ సేఫ్టి, ట్రాఫిక్ నిబంధనలు, పోలీసు చట్టాలు, పోలీసుచట్టాలపై అవగాహనా కార్యక్రమాలు, ఉల్లంఘిస్తే పడే శిక్షల్లాంటివి ఉండబోతున్నాయి.

Tags:    

Similar News