రేవంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మాజీ డీఎస్పీ ?
అసలు తన సమస్య ఏమిటి ? తాను కోరుకుంటున్న పరిష్కారం ఏమిటన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు
మాజీ డీఎస్సీ దోమకొండ నళిని తాజా పోస్టుచూస్తుంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉంది. రాబోయే నవమిలోపు తనవిషయం తేల్చకపోతే మరణమే శరణ్యమని, జీవసమాధి అవుతానని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఫేస్ బుక్(Facebook) వేదికగా నళిని రాసిన లేటెస్ట్ డెత్ నోట్(Death Note) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రేవంత్(Revanth) ను ఉద్దేశించి పే....ద్ద ఉత్తరం రాసిన నళిని అసలు తనసమస్య ఏమిటి ? తాను కోరుకుంటున్న పరిష్కారం ఏమిటన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. రేవంత్ ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నాను అన్న విషయాన్ని లేఖలో ఎక్కడా డైరెక్టుగా చెప్పలేదు. లేఖలో ఉద్యోగం, సస్పెన్షన్, సగం జీతం, మూడోవంతు జీతం అంటు కొంతసమాచారం చెప్పారు. తనకు కావాల్సిన దానిగురించి పూర్తి వివరంగా చెప్పుంటే బాగుండేది.
తనవిషయాన్ని రేవంత్ పట్టించుకోవటంలేదని ఆవేధన వ్యక్తంచేశారు. తనమరణ వాగ్మూలాన్ని ఆర్డీవోతో రికార్డు చేయించటం మినహా ఇప్పటివరకు ఇంకేమీ చేయలేదని నిష్టూరంగా అన్నారు. నాలుగురోజుల క్రితం మరణ వాగ్మూలం అంటు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు రేవంత్ దృష్టికి వెళ్ళింది. వెంటనే నళినితో మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరించమని యాదాద్రి భువనగిరి కలెక్టర్ ను రేవంత్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ హనుమంతు స్వయంగా నళిని ఇంటికివెళ్ళి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. కలెక్టర్ తో నళిని ఏమి మాట్లాడారు ? ఏమి చెప్పారు ? అందుకు కలెక్టర్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలీదు. తనకు కలెక్టర్ కు మధ్య ఏమి జరిగిందన్న విషయాన్ని నళిని ఇప్పటివరకు చెప్పలేదు.
ఇంతలోనే లేటెస్ట్ డయ్యింగ్ లెటర్ అంటు ఫేస్ బుక్ లో శుక్రవారం మరో పోస్టు పెట్టారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవంత్ కుటుంబాన్ని ఆదుకోవటానికి రేవంత్ కు వారంకూడా పట్టలేదు కాని తన విషయంలో సంవత్సరాల తరబడి తాత్సారం చేస్తున్నట్లు మండిపడింది. ఏ అధికారిని అయినా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు విచారణ పూర్తిచేయాలన్నారు. విచారణ సమయంలో మూడోవంతు జీతం లేదా సగం జీతం జీవన భృతికింద ఇవ్వాల్సుంటుదన్నారు. ఆరునెలలు దాటితో పూర్తిజీతం ఇవ్వాలన్న విషయాన్ని గుర్తుచేశారు. అలా చెల్లించకపోవటం కూడా నేరంకిందకే వస్తుందని చెప్పారు. రేవంత్ కు తాను 21 నెలల క్రితం ఇచ్చిన రిపోర్టుపై ఇంకా చర్యలు తీసుకోకపోవటం దారుణమని మండిపడ్డారు.
లేఖలో నళిని రాసిన విషయాలు చాలానే ఉన్నాయి. నళిని లేఖను చదివితే తాను సస్పెన్షన్లో ఉన్నట్లు, సస్పెన్షన్ ఎత్తేసి పూర్తిజీతం ఇవ్వాలని అడుగుతున్నట్లు అర్ధమవుతోంది. ఉద్యమకాలంలో సమైక్య ప్రభుత్వంలో ఉద్యోగం చేయటం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్లు నళిని ప్రకటించారు. అప్పట్లో ఏమో ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ అని ప్రచారం చేయించుకుని ఇపుడేమో సస్పెన్షన్, పావుజీతం, అర్ధజీతం అని లేఖలు రాస్తు తన మరణానికి రేవంతే కారణమని చెప్పి మరణ వాగ్మూలం అంటు హడావుడి చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.