జిహెచ్ఎంసీ కార్యాలయంలో సర్వర్లు కట్ చేయడం ఇంటి దొంగల పనేనా?

ఎసిబి అధికారుల భయంతో..;

Update: 2025-07-23 14:00 GMT

జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఓ దుండగుడు చోరీకి పాల్పడటానికి ఇంటి దొంగల పనే అని సర్వత్రా వినిపిస్తోంది. సర్వర్‌ రూమ్‌లోకి చొరబడి మెయిన్‌ సర్వర్ల వైర్లు దుండగుడు కట్‌ చేశాడు. దీంతో కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం ఉదయం అధికారులు మెయిన్‌ సర్వర్ల పునరుద్ధరించినప్పటికీ సర్వర్లు కట్ చేయడానికి గల కారణాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.రెండుసర్కిళ్లలో ఆన్ లైన్ సేవలు నిలిచిపోవడం వెనక జిహెచ్ ఎంసిలో పని చేసే అవినీతి అధికారుల పనే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇటీవలె లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుండి 80 వేల రూపాయలు లంచం అడిగిందని బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎసిబి అధికారుల సూచనమేరకు బాధితుడు ఆమెను బ్రతిమిలాడటంతో 30 వేల రూపాయలకు బేరం కుదిరిందని తెలిసింది. సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత ఎసిబి అధికారులకు మరికొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు రెండు జోనల్ కార్యాలయాలపై నిఘా పెట్టారు. అవినీతికి పాల్పడ్డ అధికారులే సర్వర్ వైర్లు కట్ చేశారనే వాదన వినిపిస్తోంది. అధికారుల ప్రమేయం ఉందా అనేకోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగదు వంటివి దొంగతనం చేయకుండా కేవలం సర్వర్ వైర్లు కట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags:    

Similar News