కవితకు ముందంతా ముళ్ళబాటేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈవిషయం సులభంగానే అర్ధమవుతుంది.;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురి హోదాలో కల్వకుంట్ల కవిత ఇంతకాలం పూలబాటలోనే నడిచారు. ఆమె పూలబాటపై నడిచిందో లేకపోతే ఆమె నడిచిందే పూలబాటగా మారిందో కాని రాజకీయాల్లో ఆమెనడక ఇంతకాలం నల్లేరుపై నడకలాగ సాగిపోయింది. కాని ఇప్పటినుండి ఆమె నడిచిన పూలబాట ముళ్ళబాటగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈవిషయం సులభంగానే అర్ధమవుతుంది. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) నుండి సస్పెండ్ అయిన కవిత(Kavitha) భవిష్యత్ రాజకీయాలు అయోమయంగా మారిపోయింది. ఆమె భవిష్యత్ ఎంతఅయోమయంగా మారిందంటే తాను భవిష్యత్ గురించి ఆలోచించుకోలేదని మీడియాలో ప్రకటించేంతగా క్లిష్టంగా మారిపోయింది.
అందుబాటులోని సమాచారం ఏమిటంటే పదేళ్ళ క్రితం కవితే ప్రారంభించిన జాగృతి సంస్ధ కేంద్రంగానే రాజకీయాలు చేయబోతున్నారని. జాగృతి పేరుకే తెలంగాణ అనో లేకపోతే మరోటి తగిలించి కొత్తపార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈనేపధ్యంలోనే ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ అని ‘తెలంగాణ జాగృతి’ అనే పేర్లతో పార్టీని రిజిస్టర్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరే, కవిత ఏమిచేసినా తొందరలోనే జరగబోయే రెండు ఎన్నికలు ఆమె కెపాసిటీకి పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. మొదటిదేమో స్ధానికసంస్ధల ఎన్నికల రూపంలో, రెండో పరీక్షేమో స్ధానికసంస్ధల కోటలో భర్తీ చేయాల్సిన నాజామాబాద్ జిల్లా కోటా ఎంఎల్సీ ఎన్నిక. ఎంఎల్సీ పదవికి కవిత రాజీనామాచేయటంతో తొందరలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది.
ఇపుడు విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కవిత పార్టీ పోటీచేయకపోతే పెద్ద మైనస్ అవుతుంది. గ్రాస్ రూట్లో పార్టీని బలోపేతం చేయాలంటే గ్రామీణ ప్రాంతాన్ని ప్రతిఫలించే, ప్రభావితంచేసే ఎన్నికల్లో పోటీచేయాల్సిందే. పార్టీని కొత్తగా పెట్టాను కాబట్టి ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని కవిత చెప్పేందుకు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి కవిత బయటకు వచ్చింది ఇపుడే అయ్యుండచ్చు కాని జాగృతి సంస్ధ తరపున పదేళ్ళుగా రాజకీయం చేస్తునే ఉన్నారు. పార్టీనుండి బయటకు వచ్చేసే సమయం ఆసన్నమైందన్న అనుమానంతోనే కవిత మూడునెలలుగా జాగృతి అధ్యక్షురాలిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కాబట్టి స్ధానిక ఎన్నికలనుండి తప్పుకున్నా లేకపోతే పోటీచేసి సీట్లలో గెలవకపోయినా ఆమెకే నష్టం.
ఇక రెండో ముళ్ళబాట ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీచేసి గెలవటం. ఇపుడు కవిత రాజీనామా చేసిన ఎంఎల్సీ పదవి అదే. 2022లో నిజామాబాద్ జిల్లా స్ధానికసంస్ధల ఎన్నికల కోటా నుండి కవిత ఎంఎల్సీగా ఎన్నికయ్యారు. ఇపుడు రాజీనామా చేసిన ఎంఎల్సీ పదవీకాలం ఇంకా మూడున్నరేళ్ళుంది. కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదిస్తే ఆరుమాసాల్లోగా ఎన్నికలు జరగుతాయి. మరపుడు కవిత మళ్ళీ పోటీచేస్తారా ? చేయరా ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. ఎందుకంటే తాను ఖాళీచేయటం వల్ల వచ్చిన ఎన్నికలకు కవిత దూరంగా ఉన్నా, పోటీచేసి గెలవకపోయినా పరువుపోతుంది. ఉద్యమంలో నుండి వచ్చాను కాబట్టి తిరిగి ఉద్యమం ద్వారానే ప్రజల్లోకి వెళతానని కవిత చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. కవిత ఉద్యమంలోకి వచ్చింది కేసీఆర్ కూతురుగా మాత్రమే. కవితకంటు ప్రత్యేక గుర్తింపులేదు. కేసీఆర్ కూతురు కాబట్టే బీఆర్ఎస్ లో పట్టుసాధించారు, 2014 పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఆధరించి గెలిపించారు. ఇదే కవిత 2019లో అదే నిజామాబాదు నుండి ఎంపీగా రెండోసారి పోటీచేసి ఓడిపోయారు.
అంటే కవితను రెండోసారే నిజామాబాద్ జనాలు ఆధరించలేదని అర్ధమవుతోంది. కవిత ఓటమికి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. అయితే ఎంపీగా పోటీచేసిన కవిత ఓడిపోయిందన్నద వాస్తవం. రెండోసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినా తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కవిత ఓడిపోయిందంటే ఏమిటర్ధం ? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కవిత ఎంపీగా ఓడిపోయారు. తండ్రి మద్దతున్నపుడే కవిత ఓడిపోయారంటే ఇక కేసీఆర్ కు దూరమైన తర్వాత కవిత రాజకీయం ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. అందుకనే మైనస్ కేసీఆర్, కవిత జీరో అన్నప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈవిషయం తెలియనంత అమాయకరాలు కాదు కవిత. అన్నీ తెలిసినా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకునే వరకు వ్యవహరించి బయటకు వచ్చారంటే ఆమె వ్యూహాలు ఏమిటో చూడాలి.