‘కేసీఆర్‌కు పేగుబంధం కన్నా పార్టీనే ముఖ్యం’
కేసీఆర్ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నామన్న బీఆర్ఎస్ మహిళా నేతలు.;
కవిత సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ మహిళా నేతలు స్పందించారు. ఈ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, తామే కాదని ప్రజలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. పేగుబంధం కన్నా పార్టీని నమ్ముకున్న కోట్లాది మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కవిత సస్పెన్షన్‌పై తెలంగాణ భవన్‌లో పార్టీ మహిళా నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ కీలక అంశాలు పంచుకున్నారు. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు, శ్రేణులనే కాకుండా ప్రజలను కూడా తీవ్రంగా బాధించాయన్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఉంటే ఎంతో పోతే ఎంతా అని ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రజలు కూడా జీర్ణించుకోలేకున్నారని, అందుకే ఆమెకు సోమవారం నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోందని వారు పేర్కొన్నారు. ఆమె ఏం పోస్ట్ చేసినా అందుకు వ్యతిరేకంగా, ప్రతికూలంగానే స్పందన లభిస్తుందని వారు వివరించారు.
నష్టాన్ని నివారించాలనే కేసీఆర్ నిర్ణయం..
కవిత విషయంలో కేసీఆర్.. ఒక తండ్రికా కాకుండా ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారామే. ‘‘పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఆయన అనుకున్నారు. కన్నబిడ్డల కంటే పార్టీనే ఎక్కువని ఈ నిర్ణయంతో కేసీఆర్ స్పష్టం చేశారు. కవిత మాటలు కోట్లాది మంది పార్టీ కార్యకర్తలను బాధించాయి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి అంశంలో కేసీఆర్‌కు కుడి భుజంలా హరీష్ రావు మెలిగారు. ఏ సమస్య వచ్చినా వారు కలిసి ఎదుర్కొన్నారు. అలాంటి హరీష్ రావుపై విమర్శలు చేశారు కవిత. కొన్నాళ్లు కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్‌ను టార్గెట్ చేశారు’’ అని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
కవిత వెనక ఎవరో ఉన్నారు..
‘‘ఇవి కవిత అన్న మాటలుగా అనుకోవడం లేదు. ఆమె వెనక ఎవరో ఉండి అనిపిస్తున్న మాటలుగా మాకు అనిపిస్తోంది. కవితకు కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒకసారి ఎంపీని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీగా పదవిని అందించారు. కవితకు కేసీఆర్ కుమార్తెగా పార్టీలో గౌరవం దక్కింది. ఇవాళ వాటన్నింటిని మర్చిపోయి పార్టీ గురించి ఆమె చెడుగా మాట్లాడటం సరికాదు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంతా అని ఆమె అంటే.. పార్టీలో నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని కార్యకర్తలు అంటున్నారు’’ అని అన్నారు.