‘సీఎం ప్రకటన బీసీలను మోసం చేయడమే’
బీసీలకు పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం దారుణమన్నారు కృష్ణయ్య.;
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం తీవ్ర చర్యలకు దారి తీస్తున్నాయి. బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే ప్రతిపక్షాలు, బీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రభుత్వానికి బీసీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య.. ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధం తప్పదని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన బీసీ రిజర్వేషన్లపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాలోని పేదవారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్‌ను ఎత్తివేసిందని, ఇప్పుడు సీలింగ్ అనేది ఏమీ లేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్.. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంపై ఆయన విచారం వ్యక్తం చేరశారు. కామారెడ్డి వేదికగా ప్రకటించిన రిజర్వేషన్ల నుంచి ఇప్పుడు తప్పించుకోవడానికి కసరత్తులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగాచూపిస్తూ ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే రాష్ట్రంలో యుద్ధం తప్పదని హెచ్చరించారు. బీసీలంతా ఏకమైన ఉద్యమిస్తారని అన్నారు.