SLBC సహాయక చర్యలు.. కదిలిన రోబో టీమ్..
మరో ఇద్దరి మృతదేహాలు ఉండొచ్చని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతి జాగ్రత్తగా తవ్వకాలు చేస్తున్నారు.;
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా మిగిలిన ఏడుగురికి కోసం గాలింపులు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ కోసం రోబోలను రంగంలోకి దించారు. అన్వీ రోబో బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు అధికారులు. కాగా మంగళవారం సాయంత్రానికి రెండు మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతం నుంచి మరో ఐదు అడుగుల దూరం వరకు తవ్వకాలు జరపారు. అక్కడ మరో ఇద్దరి మృతదేహాలు ఉండొచ్చని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతి జాగ్రత్తగా తవ్వకాలు చేస్తున్నారు. మిగిలిన వారు సొరంగం చివరి భాగం దగ్గర టీబీఎం కట్టర్ సమాపంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో టీబీఎం మిషన్ కటింగ్, డీ వాటరింగ్ కొనసాగుతున్నాయి.
కాగా ఇప్పుడు రోబోల వినియోగం మరింత ఉపయోగకరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. రెడ్ జోన్‌గా గుర్తించి ప్రమాద స్థలంలో తవ్వకాలు జరపడం ప్రమాదకరమైన చర్యగా ఇప్పటికే పలు రెస్క్యూ బృందాలు చెప్పాయి. అక్కడే అప్రమత్తంగా లేకుంటే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, మరికొందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో రోబో బృందం చాలా సహాయకరంగా మారుతుందని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ప్రాంతాల్లో రోబోల సహాయంతో తవ్వకాలు జరిపించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఎక్కడెక్కడ రోబోలను వినియోగించాలి, ఎలా వినియోగించాలి వంటి ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు మునిగిపోయినట్లు సమాచారం. మరికాసేపట్లో రోబోల సహాయంతో తవ్వకాలతో పాటు గల్లంతయిన వారి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. రోబోల వినియోగం విజయవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ రోబోలు కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలన్న అంశంపై కూడా చర్చలు చేస్తున్నారు. కాగా అతిపెద్ద సమస్యగా మారిన డీవాటరింగ్‌కు కూడా చెక్ పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.