EXAMS | పరీక్షలకు మీ ప్లాన్ సరైందేనా?

పరీక్షలు తరుముకొస్తున్నాయి. సంక్రాంతి దాటిన దగ్గర్నుంచి విద్యార్థులు పుస్తకాల్లో మునిగిపోవాల్సిందే. ఈనేపథ్యంలో ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మానస ఇస్తున్న సలహా ఏమిటంటే.;

Update: 2025-01-01 02:00 GMT

విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనే సమయం రాబోతుంది. ఆ సన్నద్ధ ప్రయాణం సాహసంతో కూడుకున్నదై విజయ మార్గం నిరుత్సాహంగా అనిపించవచ్చు. దాన్ని సమర్థవంతంగా అధిగమించటానికి వ్యూహ రచనా నైపుణ్యాన్ని అలవర్చుకుని నిరంతర సాధన, పట్టుదలతో విజయం సాధించాలి.

వ్యూహ రచయితలు మీరే...

నిరంతర విషయ అవగాహన, శోధనా నైపుణ్యత దీర్ఘకాలిక విజయానికి ప్రధాన భూమిక పోషిస్తాయి. తరగతి గదిలో చెప్పే పాఠాన్ని ఏంటి అనే ఆలోచన బదులు ఎందుకు అనే విశ్లేషణ అవలంబించినపుడు మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మెరుగైన బోధన పద్ధతులు, మంచి నేర్చుకునే విధానాలు అలవర్చుకుని సంకల్ప దీక్షతో చదవటం మొదలుపెట్టినప్పటికి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. విద్యార్థులకు తరచుగా చంచల మనసుతో అనేక రకాల ఆలోచనలతో ఉంటారు, ఇదే ఒక పెద్ద సవాలుగా మారక ముందే గురువులు, తల్లితండ్రులు కాస్త పిల్లలపై దృష్ఠిపెట్టడం అవసరం.

అన్వేషణ అవసరం

తరగతి గదిలో టీచర్ బోధించే పాఠం కేవలం ఆ విషయ పరిజ్ఞానాన్ని కొంత వరకు మాత్రమే కల్గించగలదు. కానీ పూర్తి విషయ జ్ఞానం తోటి విద్యార్థులతో చర్చించడం, మరికొంత పుస్తకాల పరిశోధనతో నేర్పును పొందవచ్చు. తరగతి గదిలో ఎంత బాగా విషయాన్ని సంభాషించగలుగుతారో వారు నేర్చుకొనే ప్రయాణంలో నైపుణ్యం సాధిస్తారు.

సామాజిక మాధ్యమ గ్రహణం…

పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఈరోజు మొబైల్ తో నిరంతరం సహవాసం చేస్తూ, ఎదిగే వయసు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం లోనే అనవసర విషయాలకే సమయ వృధాతో పాటు మొబైల్ చెరలో బందీ అయి విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. అదే వారి భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తుంది. దీనివల్ల విపరీత మానసిక పరివర్తనతో పాటు ఏకాగ్రత కోల్పోవటం, విద్యా దృష్టి లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరి భావన, నిద్ర లేమి, పరిశోధనాత్మక భావన కోల్పోవటం అలవాటవుతుంది.

మొబైల్ తో నోమోఫోబియా వ్యాధి...

గురువు చెప్పే పాఠాల కన్నా మొబైల్ లో చూసే సమయమే ఎక్కువ. సామజిక మాధ్యమాలు అమితంగా ప్రభావం చూపిస్తున్న ఈ తరం లో వాటి నుండి దూరంగా ఉంచడం, ఉండడం పిల్లలకు, తల్లితండ్రులకు ఒక సవాలుగా మారింది. కానీ సరైన అవగాహనతో విద్యావిధాన మార్పుతో తప్పకుండా మొబైల్ వ్యసనాన్ని దూరం చేయవచ్చు. మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల నోమోఫోబియా అనే మానసిక వ్యాధికి గురి అవుతారు. సామాజిక మాధ్యమాల్లో విషయ శోధన మంచిదే కానీ ఎంతవరకు పిల్లలకు అవసరం అనేది తల్లితండ్రులు నిరంతరం పరిశీలించాలి.

రేపటి పనిని నేడే చేయండి...

చేయాల్సిన పని వాయిదా వేయడం అనేది ఒక సర్వసాధారణమైన అలవాటు. ఉద్దేశ పూర్వకంగా చేయకున్నా కొన్ని అంశాలు విద్యార్థులకు ప్రతికూలతలను కల్గిస్తాయి. సరైన సమయపాలన, క్రమపద్ధతిలో సాధన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు, మంచి ఆహార అలవాట్లు, నిగ్రహ మనస్సు తో వాయిదా పద్దతిని మార్చుకోవచ్చు. దీని వల్ల మంచి విజయ ఫలితాన్ని అందుకోవచ్చు. ఎప్పటికప్పుడు చదవాల్సిన అంశాలు చేయాల్సిన సాధన విద్యార్థుల్లో మంచి నేర్పరితనంతో పాటు అందుకోవాల్సిన గమ్యం కూడా చేరుతారు.

పరివర్తన అవసరం...

విషయం నేర్చుకునే అనుభవం కాకుండా, విషయ అనుభవాన్ని అమలుచేయడం విద్యార్థి ప్రయాణంలోను, జీవిత గమనం లోను ప్రతిబింభించేలా ఉంటే విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి వెళ్లేలా బాటలు పడుతాయి. కొత్త పరిస్థితులు, కొత్త నైపుణ్యాలు, సమస్యలపై సాధన ద్వారా విద్యలో మరింత పట్టుదల సాధిస్తారు.

"సాధనాత్ సాధ్యతే సర్వం" అన్నది ఆర్యోక్తి. సాధనతో అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు అనే స్వావలంబనని విద్యార్థులు అలవర్చుకుంటే తదుపరి విద్యా ప్రయాణం లో జీవితం లో కూడా ఎన్నో మెట్లు ఎక్కడానికి దోహదపడతాయి.

పరీక్ష సమయం లో విద్యార్థులు ఎంతో కష్టపడి మనసు దేహం బుద్ది తో ఒక యజ్ఞంలా సన్నద్ధం అవుతారు, మనసు చాలా రకాలుగా ఒత్తిడికి లోనవుతుంది, తల్లితండ్రులు గురువులు తగిన విధంగా వారిని మార్గనిర్దేశం చేస్తూ వారిని నిరాశకు గురి కాకుండా వారి పాత్రను కూడా సమర్థవంతంగా పోషించాలి.

MANASA THIRUMALA

Counselling Psychologist

Tags:    

Similar News