పాశమైలారం ఘటనలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు
ఎఫ్ఐఆర్ లో సరికొత్త విషయాలు;
తెలంగాణలో సంచలనం సృష్టించిన పాశ మైలారం బ్లాస్ట్ ఘటనలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన అంశాలు కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి. తాతాల కాలం నాటి పాత మిషన్ వినియోగించడం వల్లే బ్లాస్ట్ జరిగింది. సిగాచీ కంపెనీ వినియోగించే మిషన్ కు సంబంధించి కార్మికులు, ఉద్యోగులు వందల సార్లు ఫిర్యాదుచేసినప్పటికీ కంపెనీ పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే ఇదే మిషన్ మీద పని చేయండి లేదా మానేయండి అని కంపెనీ పలుమార్లు హెచ్చరిస్తూ వస్తుంది.
మార్గ దర్శకాలను పాటించలేదు
మిషన్ వినియోగించే సమయంలో కంపెనీ కనీస ప్రమాణాలను కూడా పాటించలేదు. మిషన్ ఆపరేట్ చేసే సమయంలో కొన్ని మార్గ దర్శకాలను పాటించాలి. కానీ కంపెనీ ఆ మార్గర్శకాలను పాటించలేదు.కంపెనీ యాజమాన్యానికి ఇప్పటివరకు అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ సిగాచి కంపెనీకి చెందిన ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోని అంశాలు చదివితే షాక్ అవ్వాల్సిందే. కంపెనీలో తుప్పు పట్టిన పాతమిషన్ ఉంది. మిషన్ పని చేయడం లేదని కంపెనీకి ఫిర్యాదులు వచ్చినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితంగా ఇంత భారీ ప్రాణ నష్టం జరిగింది. ప్రమాదానికి ప్రధాన కారణం సిగాచి కంపెనీ మాత్రమే.
మంటలనార్పే సిలిండర్లు లేవు
సోమవారం ఉదయం 9 :30 గంటలకు బ్లాస్ట్ జరిగింది. ఘటనాస్థలిలో 145 మంది పని చేస్తున్నారు. స్పాట్ లో కొందరు చనిపోగా, కాలిపోతూ కొందరు కనిపించారు. సిగాచిలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కనీసం మంటలను ఆర్పే ఫైర్ సిలిండర్లు కూడా లేవు.
కాగా పాశ మైలారంలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని బుధవారం వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా పరిశిలించారు. ఆయన వెంట ఎఐసిసి తెలంగాణ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పిసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తదితరులు పరిశీలించారు.