భట్టి విక్రమార్కకు బీజేపీ నోటీసులు..
మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక.;
తెలంగాణ ఢిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలగానూ రామచందర్ రావు ఈ నోటీసులు అందించారు. మూడు రోజుల్లో భట్టి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.25కోట్ల పరువునష్టం దావా వేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
భట్టి అసలేమన్నారంటే..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని రామచందర్ రావుకు ఇవ్వడాన్ని భట్టి తప్పుబట్టారు. ‘‘హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణం. రోహిత్ వేముల తన సూసైడ్ నోట్‌లో కారణాలు వెల్లడించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూకు వచ్చి విద్యార్థులకు మద్దతిచ్చారు. ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రామచందర్‌రావు.. హెచ్‌సీయూకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అతని ఒత్తిడి వల్లే రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి నేత రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారు. ఆయన నియామకాన్ని బీజేపీ పునరాలోచించాలి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన సుశీల్ కుమార్‌కు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్క రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. రోహిత్ వేములది వ్యవస్థాగత హత్య’’ అని భట్టి అన్నారు.