ఢిల్లీలో పీవీ విగ్రహం.. బీజేపీ ప్లాన్ ఏంటి..?
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇప్పుడు ఎందుకు గౌరవిస్తోంది?;
మరణించిన 21 సంవత్సరాల తర్వాత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గౌరవం లభిస్తోంది. ఇన్నాళ్లూ ఢిల్లీలో ఆయనకు ఆరడుగుల జాగా కూడా లేదు. అలాంటిది ఇప్పుడు దేశరాజధానిలో పీవీ నరసింహరావు విగ్రహ ఏర్పాటుకు బీజేపీ రెడీ అయింది. ఇందులో భాగంగా పీవీ విగ్రహ ఏర్పాటు కోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. అందుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోద ముద్ర కూడా వేసేసింది. ఎన్‌డీఎంసీ ప్రతిపాదన మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీయూఏసీ నిర్ణయించింది. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది.
కొత్త భవనంలో పీవీ విగ్రహం
అయితే ప్రస్తుతం ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ను నిర్మించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ భవన్‌లో కలిసి ఉన్నాయి. కాబట్టి పీవీ విగ్రహ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. కాగా ప్రస్తుతం తెలంగాణ, ఏపీ భవన్‌లో ఉన్న మాజీ సీఎం ప్రకాశం పంతులు విగ్రహానికి సమీపంలోనే పీవీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎన్‌డీఎంసీనీ పీవీ నరసింహరావు మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఓకే చెప్పింది. ఢిల్లీలో పీవీ స్మారకం ఏర్పాటుతో పాటు ఆయన ఎన్‌డీఏ ప్రభుత్వం భారతరత్న బిరుదు కూడా ఇచ్చి పీవీని గౌరవించింది.
కాంగ్రెస్ అవమానిస్తే.. బీజేపీ గౌరవిస్తోంది..
పీవీ నరసింహరావు విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు మోదీ లేదా మరెవరైనా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గతంలో తన జీవితాన్ని కాంగ్రెస్ కోసం ధారపోసిన పీవీని ఆ పార్టీ అవమానించింది. ఆయన విగ్రహ ఏర్పాటుకు పార్టీ కార్యాలయంలో స్థానం లేదని తెలిపింది. ఆయన మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలను కూడా ఢిల్లీలో జరగకుండా అడ్డుకుంది. దీంతో ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరిగాయి. అవి కూడా నామమాత్రంగానే నిర్వహించడం విషాధకరం. హైదరాబాద్‌లో కూడా పీవీ అంత్యక్రియలను ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రం దేశానికి పీవీ నరసింహరావు చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనను గౌరవిస్తోంది.
ఇదంతా బీజేపీ రాజకీయమేనా..
రాజకీయ లబ్ధి లేనిదే బీజేపీ ఏ పనీ తలపెట్టదు.. ఇది చాలా మంది అభిప్రాయం. అదే విధంగా బీజేపీ చేసే ప్రతి పని కూడా ఏదో ఒక రకంగా వారికి రాజకీయ లబ్ధిని చేకూరుస్తూ ఉండటం.. ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తోంది. అదే విధంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇప్పుడు గుర్తుకు రావడం కాస్తంత ఆశ్చర్యంగా ఉంది. ఇందులో కూడా ఏదో ఒక రాజకీయ కోణం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసమే తెలంగాణ బిడ్డ పీవీకి బీజేపీ ప్రభుత్వం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది.
నిజంగానే పీవీపై ప్రేమ ఉంటే ఇన్నాళ్లూ ఎందుకు ఆగారు? అన్న ప్రశ్న వినిపిస్తోంది. కచ్ఛితంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాలంటే.. అందరూ మెచ్చునే వారికి మేలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు బీజేపీ దృష్టి పీవీపైకి మళ్లిందని, అందులో పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఢిల్లీలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.