రేవంత్ ను వెంటాడుతున్న ‘ఆర్డినెన్స్’ టెన్షన్
స్ధానికసంస్ధల ఎన్నికల్లో పాటించాల్సిన రిజర్వేషన్లను జూలై 25వ తేదీలోగా ఫైనల్ చేయాలని కూడా ఆదేశించింది;
ఎనుముల రేవంత్ రెడ్డిని ఆర్డినెన్స్ టెన్షన్ వెంటాడుతోంది. ఒకవైపు హైకోర్టు చెప్పిన డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరోవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం కోసం ప్రభుత్వం పంపిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ బిల్లు ఎదురుచూస్తోంది. ఈ రెండింటినడుమ ఏమిచేయాలో అర్ధంకాక రేవంత్(Revanth) లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా జరపాలని ఆమధ్య హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదేసమయంలో స్ధానికసంస్ధల ఎన్నికల్లో పాటించాల్సిన రిజర్వేషన్లను జూలై 25వ తేదీలోగా ఫైనల్ చేయాలని కూడా ఆదేశించింది. రిజర్వేషన్లు ఫైనల్ కాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు లేదు.
ఇదేసమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ రాకుండా రిజర్వేషన్లు(BC Reservations) ఖరారుచేసేందుకు లేదు. అందుకనే ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెడతారా లేదా అన్న విషయంలోనే రేవంత్ లో టెన్షన్ పెరిగిపోతోంది. గవర్నర్ సంతకం పెడితే వెంటనే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొదలుపెడుతుంది. ఒకవేళ 25 తేదీలోగా గవర్నర్(Telangana Governor Jishnu dev Varma) సంతకం పడకపోతే అప్పుడు ఆర్డినెన్స్ విషయంలో ఏమిచేయాలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. శుక్రవారం సాయంత్రం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. క్యాబినెట్ సమవేశం అయ్యేలోగా ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం అయితే అంతా హ్యాపీసే. ఒకవేళ సంతకం కాకపోతేనే సమస్య మొదటికి వస్తుంది.
సమస్య కూడా రెండురకాలుగా వస్తుంది. అవేమిటంటే జూలై 25లోగా రిజర్వేషన్ల ఖరారు చేయకపోతే హైకోర్టుతో సమస్య. రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. ఇదేవిషయాన్ని ఎత్తిచూపుతు హైకోర్టులో పిటీషన్ వేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సుంటుంది. ఇక రెండోసమస్య ఏమిటంటే గవర్నర్ ఆర్డినెన్స్ పై సంతకంచేయకపోతే బీసీరిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాల్సుంటుంది. ఆప్రత్యామ్నాయమార్గమే ఏమిటన్నది క్యాబినెట్+న్యాయ+రాజ్యంగనిపుణులు ఆలోచించాలి. ఇదంతా తేలికగా కొలిక్కి వచ్చే అంశంకాదు.
గవర్నర్ దగ్గరకు ఆర్డినెన్స్ పంపి సుమారు 3 వారాలు అవుతోంది. ఇప్పటికే ఆర్డినెన్స్ పై గవర్నర్ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించారు. ఆచర్చల్లో ఎవరేమి చెప్పారో తెలీదు. ఆర్డినెన్స్ పై సంతకం విషయంలో కేంద్రప్రభుత్వంతో సంప్రదించకుండా గవర్నర్ తనంతట తానుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే. తెలంగాణ ప్రభుత్వం మూడునెలల క్రితం పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లునే కేంద్రం పక్కనపెట్టేసింది. అలాంటిది రేవంత్ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు సంతకం పెట్టి ఆమోదించమని గవర్నర్ కు కేంద్రం చెబుతుందా ? గవర్నర్ సంతకంపై ఇన్ని మెలికలు ఉన్నాయి కాబట్టే రేవంత్ లో ఆర్డినెన్స్ టెన్షన్ పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.